దీదీని ఎందుకు ప్రశ్నించరు..?: మోదీ

రాజకీయ కారణాలతోనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కిసాన్‌ సమ్మాన్‌ నిధిని రైతులకు అందకుండా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి అడ్డుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

Published : 26 Dec 2020 02:34 IST

ఆ 70లక్షల మంది రైతులకు దక్కని పీఎం కిసాన్‌!

దిల్లీ: రాజకీయ కారణాలతోనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కిసాన్‌ సమ్మాన్‌ నిధిని రైతులకు అందకుండా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి అడ్డుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రైతుల ప్రయోజనం కోసం ఉన్న ఈ పథకాన్ని దీదీ ప్రభుత్వం అమలు చేయకపోవడంపై మౌనంగా ఎందుకు ఉన్నారని విపక్షాలను ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ పథకం అమలు అవుతున్నప్పటికీ .. కేవలం పశ్చిమ బెంగాల్‌లోనే అమలు కాకపోవడంపై మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం-కిసాన్‌) మరో దఫా పెట్టుబడి సాయాన్ని విడుదల చేసిన సందర్భంగా ఈ విధంగా మాట్లాడారు.

మమతా బెనర్జీ సిద్ధాంతాలతో ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌ తీవ్రంగా నష్టపోయిందని విమర్శించిన మోదీ, రైతులకు వ్యతిరేకంగా దీదీ తీసుకుంటున్న చర్యలు తనను ఎంతగానో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రైతుల విషయంలో కేరళ తీరును కూడా నరేంద్ర మోదీ తప్పుబట్టారు. పంజాబ్‌ రైతులను తప్పుదోవ పట్టించేందుకు విపక్షాలకు సమయం ఉందని.. కానీ, కేరళలో రైతు సంస్కరణలు తీసుకొచ్చేందుకు మాత్రం ఎందుకు సమయముండదని అక్కడి ప్రభుత్వానికి చురకలు అంటించారు.

ఇదిలాఉంటే, రైతులకు నేరుగా నగదు బదిలీ చేసే పథకమైన ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం-కిసాన్‌) ప్రయోజనాలు మాత్రం పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి అందడం లేదు. దీంతో అక్కడి దాదాపు 70లక్షల మంది రైతులు ఈ పథకానికి దూరమయ్యారు. ఇప్పటికే అక్కడ దాదాపు 23లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వారి సమాచారాన్ని తనిఖీ చేసి కేంద్రానికి పంపించేందుకు మమతా సర్కార్‌ వెనుకడుగు వేస్తోంది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.లక్షా 10వేల కోట్ల రూపాయలను పలు దఫాల్లో కేంద్ర ప్రభుత్వం రైతులకు బదిలీ చేసింది.

ఇవీ చదవండి..
రైతుల జీవితాలతో ఆడుకోవద్దు: మోదీ
వ్యవసాయ చట్టాల అమలు: ఒక్క ఏడాది చూడండి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని