Pawars Secret Meeting: పవార్‌ల రహస్య భేటీపై కాంగ్రెస్‌ ఆందోళన.. బాబాయ్‌కు అబ్బాయ్‌ ఆఫర్లు!

పవార్‌ల మధ్య రహస్య భేటీ ఆందోళనకరమైన అంశంగా భావిస్తున్నట్లు మహారాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు నానా పటోలే తెలిపారు. ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. 

Updated : 16 Aug 2023 11:50 IST

ముంబయి: ఎన్సీపీ (NCP) అధినేత శరద్‌ పవార్‌ (Sharad Pawar), మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ (Ajit Pawar) మధ్య జరిగిన రహస్య సమావేశం ఆమోదయోగ్యం కాదని కాంగ్రెస్‌ (Congress) పార్టీ పేర్కొంది. ఈ మేరకు మహారాష్ట్ర (Maharashtra) కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు నానా పటోలే (Nana Patole) పవార్‌ల భేటీ (Pawar's Secret Meeting)ని ఆందోళనకరమైన అంశంగా పేర్కొన్నారు. ‘‘పవార్‌ల మధ్య రహస్య సమావేశం ఆందోళన కలిగించే విషయం. దీన్ని కాంగ్రెస్‌ పార్టీ ఏ మాత్రం అంగీకరించదు. ఈ భేటీ గురించి అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తాం. దీనిపై ఇండియా కూటమి చర్చిస్తుంది. ఇప్పుడే నేను మాట్లాడటం సరైంది కాదు’’ అని నానా పటోలే తెలిపారు. 

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో శరద్‌ పవార్‌ లేకుండా కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తోందని వస్తోన్న వార్తలను నానా పటోలే ఖండించారు. అంతకముందు బారామతిలో శరద్‌ పవార్‌ మాట్లాడుతూ.. తమను వ్యతిరేకించిన వారికి ఓటు వేయాలని నేను మహారాష్ట్ర ప్రజలకు ఇకపై చెప్పలేనని అన్నారు. ‘‘పార్టీలో కొంతమంది వేరే మార్గాన్ని ఎంచుకున్నారు. పరిస్థితి గురించి వారికి పూర్తి అవగాహన వచ్చిన తర్వాత, తప్పకుండా వారి నిర్ణయం మారుతుంది. ఒకవేళ వాళ్లు మాతో వచ్చినా.. రాకున్నా మేం ఎంచుకున్న మార్గంలోనే ముందుకు సాగుతాం. గతంలో చెప్పినట్లు మహారాష్ట్ర ప్రజలను వారికి ఓటు వేయాలని నేను కోరను’’ అని శరద్‌ పవార్‌ తెలిపారు. 

బాబాయ్‌కు అబ్బాయ్‌ ఆఫర్లు!

మరోవైపు పవార్‌ల రహస్య భేటీలో అజిత్‌ పవార్‌ బాబాయ్‌ శరద్‌ పవార్‌ ముందు పలు కీలక ప్రతిపాదనలు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు మద్దతు ప్రకటిస్తే.. శరద్‌ పవార్‌కు కేంద్ర మంత్రి పదవితోపాటు, ఆయన కుమార్తె సుప్రియా సూలేకు నీతి ఆయోగ్ ఛైర్మన్‌ పదవి, ఎన్సీపీ నేత జయంత్‌ పాటిల్‌కు కేంద్రం లేదా రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని అజిత్‌ పవార్‌ చెప్పినట్లు సమాచారం. అయితే, ఈ ప్రతిపాదనలను శరద్‌ పవార్‌ తిరస్కరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

పుణెలో బాబాయ్‌ భోజనానికి వచ్చారంతే: అజిత్‌ పవార్‌

గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీలు కలిసి మహా వికాస్‌ అఘాడీ (MVA) కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని నెలకొల్పాయి. శివసేన నుంచి ఏక్‌నాథ్‌ శిందే విడిపోయి భాజపాకు మద్దతు ప్రకటించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం గత నెలలో ఎన్సీపీ నుంచి అజిత్‌ పవార్‌ కొంత మంది ఎమ్మెల్యేలతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిపోయి, డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి పలు సందర్భాల్లో శరద్‌ పవార్‌, అజిత్‌ పవార్‌ల మధ్య భేటీలు జరిగినప్పటికీ.. ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. మరోవైపు శరద్‌ పవార్‌ ప్రతిపక్షాల కూటమి ఇండియాలో భాగస్వామిగా ఉన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని