Telangana News: పార్టీ వీడొద్దని జగ్గారెడ్డి కాళ్లు పట్టుకున్న కాంగ్రెస్‌ నేత

కాంగ్రెస్ పార్టీని వీడిపోకుండా జగ్గారెడ్డికి బుజ్జగింపు ప్రయాత్నాలు మొదలయ్యాయి. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని ఆ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు(వీహెచ్‌) కలిశారు.

Updated : 19 Feb 2022 13:29 IST

హైదరాబాద్‌: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు ఈ ఉదయం కలిశారు. కాంగ్రెస్‌కు దూరం కావొద్దని జగ్గారెడ్డికి వీహెచ్‌ విజ్ఞప్తి చేశారు. పార్టీలోనే ఉంటూ అన్యాయాలపై కొట్లాడాలని సూచించారు. కార్యకర్తలతో మాట్లాడి తదుపరి నిర్ణయం వెల్లడిస్తానని జగ్గారెడ్డి ఈ సందర్భంగా వీహెచ్‌కు తెలిపారు. మరోవైపు  పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లి కిషన్‌.. జగ్గారెడ్డి కాళ్లు పట్టుకొని బతిమిలాడటం గమనార్హం. పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ వీడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

అనంతరం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతానికైతే కాంగ్రెస్‌ పార్టీని వీడనని ఆయన స్పష్టం చేశారు. రాజీనామా చేయొద్దని పార్టీ అధిష్ఠానం కోరిందని చెప్పారు. మరోవైపు పార్టీలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు సోనియాగాంధీకి లేఖ రాస్తున్నట్లు చెప్పారు. తన మీద సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నట్లు.. దీనిపై పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు జగ్గారెడ్డి తెలిపారు.

మరోవైపు సామాజిక మాధ్యమాల్లో తనపై, జగ్గారెడ్డిపై తప్పుడు ప్రచారం జరుగుతోందని వీహెచ్‌ అన్నారు. తెరాసలో చేరుతున్నట్లు తమ ఫొటోలు మార్ఫింగ్‌ చేశారని చెప్పారు. తెరాసకు అనుకూలంగా పని చేస్తున్నామని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వీహెచ్‌ తెలిపారు. ఎన్నికల కమిషన్‌కు కూడా దీనిపై ఫిర్యాదు చేస్తామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని