Purandeswari: ఆ రైల్వే లైన్ వద్దని జగన్‌ లేఖ రాయడం సమంజసమా?: పురందేశ్వరి

రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్నిరకాలుగా సహకారం అందిస్తున్నా.. అభివృద్ధి చేయడంలో వైకాపా ప్రభుత్వం విఫలమవుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మండిపడ్డారు.

Updated : 02 Nov 2023 16:44 IST

రాజంపేట: ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్నిరకాలుగా సహకారం అందిస్తున్నా.. అభివృద్ధి చేయడంలో వైకాపా ప్రభుత్వం విఫలమవుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఒక్క పరిశ్రమ కూడా పెట్టలేకపోయారన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో పురందేశ్వరి పర్యటించారు. పార్లమెంటు నియోజకవర్గ భాజపా నాయకులు, కార్యకర్తలతో సమావేశమై పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వెనకబడి ప్రాంతాల అభివృద్ధి కోసం ఏడాదికి రూ.350 కోట్ల చొప్పున కేంద్రం నిధులు విడుదల చేస్తోందన్నారు. అయినా సీఎం జగన్‌ కనీసం రహదారులు కూడా నిర్మించలేక పోయారన్నారు. వెనకబడిన రాయలసీమ ప్రాంతంలో సరైన విద్యాసంస్థలు అందుబాటులో లేవని.. రాజంపేటలో కేంద్రీయ విద్యాలయం మంజూరైతే స్థలం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.

కడప - బెంగళూరు రైల్వే లైన్ కోసం వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి హయాంలో పనులు ప్రారంభిస్తే.. జగన్ మాత్రం ఆ లైన్ వద్దని కేంద్రానికి లేఖ రాయడం ఎంతవరకు సమంజసమని పురందేశ్వరి ప్రశ్నించారు. రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం.. ఆ పాలన ఎలా ఉందో ప్రజలే గుర్తించాలన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయి మూడేళ్లవుతున్నా.. వాటి నిర్మాణానికి నిధులు కేటాయించలేదని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం కుంభకోణంపై సీబీఐ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని పురందేశ్వరి వ్యాఖ్యానించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని