సీఎం జగన్‌ బెయిల్‌ వార్షికోత్సవాలు మరెన్నో జరుపుకోవాలి

రూ.43 వేల కోట్ల అవినీతి నేరాభియోగ కేసుల్లో జగన్‌... పదేళ్ల క్రితం సెప్టెంబరు 23న జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన రోజును పండగలా జరుపుకోవడంలో తప్పులేదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు.

Published : 24 Sep 2023 05:41 IST

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఎద్దేవా

ఈనాడు, దిల్లీ: రూ.43 వేల కోట్ల అవినీతి నేరాభియోగ కేసుల్లో జగన్‌... పదేళ్ల క్రితం సెప్టెంబరు 23న జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన రోజును పండగలా జరుపుకోవడంలో తప్పులేదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు. దిల్లీలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చట్టం అందరికీ సమానమని అంటారని.. ఆ చట్టానికి అతీతుడినని నిరూపించిన వ్యక్తి జగన్‌ అని విమర్శించారు. జగన్‌ రూ.43 వేల కోట్ల అవినీతికి పాల్పడినట్లుగా శాస్త్రీయ ఆధారాలను సీబీఐ అధికారులు న్యాయస్థానానికి సమర్పించినా... పదేళ్లుగా ఆ కేసుల ట్రయల్స్‌ పూర్తికాకుండా పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ అడ్డుకోగలిగిన సమర్థుడన్నారు. సీఎం అయ్యాక సీబీఐ కోర్టు విచారణకే హాజరు కావాల్సిన అవసరం లేదన్నట్లుగా అద్భుతమైన ఆర్డర్‌ తెచ్చుకున్న ఘనుడు జగన్‌ అని రఘురామ విమర్శించారు. ఈ సందర్భంగా జగన్‌కు దశమ బెయిల్‌ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన కేకు కోశారు. తమ సీఎం ఇలాగే మరెన్నో బెయిల్‌ వార్షికోత్సవాలను జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు వ్యంగ్యంగా అన్నారు. జగన్‌ 11వ బెయిల్‌ వార్షికోత్సవం నాటికి తాను వైకాపాలో ఉండనన్నారు. జగన్‌ ప్రభుత్వ అవినీతిపై సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిల్‌ దాఖలు చేయాలని మాజీఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు రఘురామ సూచించారు. మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు తుదిదశకు చేరుకోవడంతో, ఆ కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారేమోనని ఎంపీ సందేహం వ్యక్తం చేశారు. ‘వివేకా హత్యకేసులో కేసు డైరీ కీలకం కానుంది. దీన్ని క్షుణ్నంగా అధ్యయనం చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. హత్య జరిగాక ఎవరు ఎవరితో మాట్లాడుకున్నదీ కేసు డైరీలో సవివరంగా ఉంది. దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ప్రస్తుత అక్రమ అరెస్టుల పర్వానికి తెరలేపారు. సుప్రీంకోర్టులో అక్టోబరు 11న జరగనున్న వాదనల్లో అన్ని విషయాలూ వెలుగుచూసే అవకాశం ఉంది’ అని రఘురామ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని