BJP-JDS: ‘రెండు సీట్లకు ఇంత కష్టపడాలా?’ భాజపాపై కుమారస్వామి అసంతృప్తి!

‘రెండు సీట్ల కోసం ఇంత కష్టపడాలా?’ అంటూ కర్ణాటకలో భాజపాతో ఎంపీ సీట్ల సర్దుబాటుపై జేడీఎస్‌ నేత కుమారస్వామి అసంతృప్తి వ్యక్తం చేశారు.

Published : 19 Mar 2024 00:55 IST

బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) విషయంలో కన్నడనాట భాజపా- జేడీఎస్‌ కూటమి మధ్య సీట్ల సర్దుబాటుపై విబేధాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ తమకు రెండు స్థానాలు మాత్రమే కేటాయించేందుకు కమలదళం సిద్ధంగా ఉందని వస్తోన్న వార్తలపై జేడీఎస్‌ (JDS) రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం కుమారస్వామి అసంతృప్తి వ్యక్తం చేశారు. జేడీఎస్‌ను గౌరవంగా చూడాలని భాజపా (BJP) అధిష్ఠానానికి తెలియజేయడంతో పాటు 18 ఎంపీ స్థానాల్లో మన బలం అర్థమయ్యేలా చెప్పాలని సమావేశంలో పార్టీ నేతలు తనకు సూచించినట్లు చెప్పారు.

‘‘రెండు సీట్ల కోసం ఇంత కష్టపడాలా? ఇన్ని సర్దుబాట్లు చేసుకోవాలా? హసన్‌, మాండ్యాల్లో స్వతంత్రంగా పోటీ చేసినా మా అభ్యర్థులు సులభంగా నెగ్గుతారు. మేం ఆరేడు సీట్లు అడగలేదు. మొదటినుంచి మూడు నుంచి నాలుగు సీట్లు కోరుతున్నాం. మా పార్టీ బలం భాజపాకు తెలుసు. పార్టీ విజ్ఞప్తిని మన్నిస్తారనే నమ్మకం ఉంది. అధికారిక ప్రకటన వెలువడేవరకూ సీట్ల కేటాయింపుపై మాట్లాడను’’ అని సమావేశం అనంతరం కుమారస్వామి మీడియాతో చెప్పారు.

బిహార్‌లో ‘ఎన్డీయే’ సీట్ల పంపకం పూర్తి.. అధిక స్థానాల్లో భాజపా పోటీ

గతేడాది సెప్టెంబర్‌లో ఎన్డీయే కూటమిలో జేడీఎస్ చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సీట్ల పంపకాలపై చర్చలు సాగుతున్నాయి. మాండ్య, హసన్, కోలార్ స్థానాలను దేవేగౌడ పార్టీ ఆశిస్తోంది. రెండు పార్టీల మధ్య ఒప్పందం ప్రకారం.. దేవెగౌడ అల్లుడు డా.సీఎన్ మంజునాథ్‌ను భాజపా టికెట్‌పై బెంగళూరు రూరల్‌ నుంచి ఇప్పటికే బరిలోకి దించారు. అయితే.. కోలార్‌ను కేటాయించేందుకు కమలం పార్టీ సిద్ధంగా లేదనే వార్తలు వస్తున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని 28 స్థానాల్లో 25 చోట్ల భాజపా విజయం సాధించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని