Munugode bypoll: బావి వద్ద మీటర్లు పెట్టమనే మోదీ కావాలా? వద్దనే కేసీఆర్‌ కావాలా?

ప్రజల దీవెన ఉన్నంత వరకూ తెలంగాణ రైతలు బాయిల కాడ మీటర్లు పెట్టనివ్వనని సీఎం కేసీఆర్‌ స్పష్టం

Updated : 20 Aug 2022 19:20 IST

మునుగోడు: ‘ప్రజల దీవెన ఉన్నంత వరకూ తెలంగాణ రైతుల బాయిల కాడ మీటర్లు పెట్టనివ్వ’నని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా మునుగోడులో ఏర్పాటు చేసిన ప్రజాదీవెన సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. మునుగోడు ఉప ఎన్నిక రాజకీయ పార్టీల ఎన్నిక కాదు.. రైతుల బతుకుదెరువు ఎన్నిక అని వివరించారు. రైతు వ్యతిరేక విధానాలకు, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టమనేందుకు, మన ధాన్యం కొనుగోలు చేయనందుకు.. ప్రగతిశీల శక్తులతో ఏకమై భాజపాను తరిమి కొడదామని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే వృథా అవుతుందన్నారు. భాజపా టక్కు టమారా మాటలు చూసి మోసపోవద్దని మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతులు ఓటు వేసేముందు బావి వద్ద దండం పెట్టి ఓటు వేయాలి. మహిళలు ఓటు వేసే ముందు గ్యాస్‌ సిలిండర్‌కు దండ పెట్టి ఓటు వేయాలి అని కోరారు.

ఫ్లోరైడ్‌ బాధ పోగొట్టాం..

‘‘ఒకనాడు ఫ్లోరైడ్‌ నీళ్లతో ఏవిధంగా బాధపడ్డారో అందరికీ తెలుసు. కేసీఆర్‌ కన్నా ముందు ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు. దుశ్చర్ల సత్యనారాయణ తన ఉద్యోగానికి రాజీనామా చేసి జలసాధన పోరాటం చేశారు. ఆనాటి ప్రధాని టేబుల్‌ దగ్గరికి కూడా వెళ్లి పరిస్థితిని వివరించినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత నేను రాష్ట్రమంతా తిరిగి ఫ్లోరైడ్‌ సమస్య వివరించా. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ‘నల్లగొండ నగారా’ పేరుతో 15 రోజుల పాటు జిల్లా అంతా తిరిగి ఫ్లోరైడ్‌ కష్టాలపై అవగాహన కల్పించాం. ఫ్లోరైడ్‌పై సరైన చర్యలు తీసుకోకపోతే మానవ నివాస యోగ్యానికి(నో మ్యాన్‌ జోన్‌) పనికిరాకుండా పోతుందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. ఇక్కడ పండే పంటలు తింటే కూడా ప్రమాదమే అని హెచ్చరించినా ఆనాటి పాలకులు పట్టించుకోలేదు. అనేక పోరాటాల తర్వాత తెలంగాణ సాధించుకొని ఈరోజు జీరో ఫ్లోరైడ్‌ నల్గొండగా మనం మార్చుకున్నాం. తెలంగాణ వచ్చాక మిషన్‌ భగీరథ ద్వారా మంచినీళ్లు తెచ్చుకున్నాం. కానీ, సాగు నీరు రావాలి. నల్లగొండ జిల్లా ఉండేది కృష్ణా బేసిన్‌లో. డిండి, శివన్న గూడెం, శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా నీరు రావాలి. ఇది ఆషామాషీ విషయం కాదు. మునుగోడు ప్రజలంతా ఆలోచన చేయాలి. మన చేతిలో ఉన్న అధికారాన్ని ఎవరికో అప్పజెప్పి పోరాటం చేయమంటే చేయరు. మన చుట్టూ ఏం జరుగుతుందో చర్చ పెట్టాలి. ఇందులో భాగంగా దేశంలో జరుగుతున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలపై ఎలా పోరాటం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది. అసలు ఇక్కడ ఉప ఎన్నిక  ఏం అక్కర ఉందని వచ్చింది. ఎవర్ని ఉద్ధరించడానికి ఈ ఉప ఎన్నిక. దీని వెనుక ఉన్న మాయా మచ్ఛీంద్ర ఏంటో గుర్తించకపోతే దెబ్బతింటాం’’

సీపీఐ, సీపీఎంతో కలిసి భాజపాను తరిమి కొడదాం..

‘‘ప్రగతిశీల శక్తులన్నీ ఏకమై దుర్మార్గులను సాగనంపాలి. చిన్న చిన్న విషయాలు పక్కన పెట్టి అంతా ముందుకు సాగాలని, మునుగోడులో తెరాసను గెలిపించడమే కరెక్టని సీపీఐ మద్దతు తెలిపింది. సీపీఐకి నా తరఫున, నల్గొండ జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు చెబుతున్నా. మునుగోడు నుంచి దిల్లీ వరకూ ఐక్యత కొనసాగాలి. పేదలు, రైతుల బతుకులు బాగుపడే వరకు ప్రగతిశీల శక్తులతో కలిసి పనిచేస్తాం. దేశంలో కొత్త రాష్ట్రం ఏర్పడితే ఒక పద్ధతి ఉంటుంది. రాష్ట్రమేర్పడి 8ఏళ్లు అయినా... కృష్ణాలో ఎన్ని నీళ్లు వస్తాయో చెప్పమంటే నరేంద్రమోదీ చెప్పరు. అమిత్‌ షా.. మా నీళ్లలో వాటా ఇయ్యనందుకే మునుగోడు వస్తున్నావా? ఎందుకు వస్తున్నావ్‌. నీ బొమ్మలు కాదు మాక్కావాల్సింది. కొట్లాడుడు తెలంగాణకు కొత్త కాదు. ఎందుకు కృష్ణా జలాల్లో  మావాటా తేల్చడం లేదు. పంద్రాగస్టు రోజు ప్రధాని మాట్లాడితే మైకులు పగిలిపోయినయ్‌. కృష్ణాలో మావాటా  తేలిస్తే చకా చకా నీళ్లు తెచ్చుకుంటాం. మునుగోడు చైతన్యవంతమైన గడ్డ. రైతులు చైతన్యవంతులై ఉన్నారు. కేంద్ర హోం మంత్రిని డిమాండ్‌ చేస్తున్నా.. మీ కేంద్ర ప్రభుత్వం పాలసీ ఏంటి? కృష్ణా జలాల్లో వాటా ఎంతో చెప్పాలి? కేంద్రంలో భాజపా వచ్చి 8ఏళ్లు అయింది. దేశంలో ఏ ఒక్క మంచి పని అయినా జరిగిందా? ఎయిర్‌పోర్టులు, రైళ్లు, బ్యాంకులు అమ్ముతున్నారు. ఇక మిగిలింది..  రైతులు, భూములు, వ్యవసాయ పంటలు. మన నోట్లో మన్ను పోసే కార్యక్రమం జరుగుతోంది. బావి వద్ద మీటరు పెట్టమన్నారు.. నేను సచ్చినా పెట్టనని చెప్పా. ఎరువుల ధరలు పెంచాలి, కరెంటు ధర పెంచాలి. గిట్టుబాటు ధర ఇవ్వొద్దు. ఇదే భాజపా విధానం. రైతులు సాగు బంద్‌ చేస్తే.. సూట్‌ కేసులు పట్టుకుని కార్పొరేట్‌ పెద్దలు వచ్చి వ్యవసాయం చేస్తారట. రైతులంతా కూలీలుగా మారి వారి వద్దే పనిచేయాలట. ఇదేవారి కుట్ర’’

సంక్షేమ పథకాలు ఇవ్వొద్దంటున్నారు..

‘‘రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నాం. భారతదేశంలో ఇలాంటి పథకాలు ఎక్కడైనా ఉన్నాయా? రైతు బంధు ఇవ్వకూడదట. ‘పింఛన్లు ఎందుకిస్తున్నా, ఇన్ని సంక్షేమ పథకాలు ఎందుకు ఇస్తున్నావ్‌’ అంటున్నారు.  మునుగోడు ఉప ఎన్నిక మన జీవితాలకు సంబంధించిన ఎన్నిక. మీటర్లు పెట్టమనే నరేంద్రమోదీ కావాలా? మీటర్లు వద్దనే కేసీఆర్‌ కావాలా? దీనిపై గ్రామాల్లో చర్చ జరగాలి. ఎవరు కావాలో మీరు తేల్చుకోవాలి. మునుగోడు చరిత్రలో ఎన్నడూ భాజపాకు డిపాజిట్లు రాలేదు. భాజపాకు ఓటు పడిందంటే మన బావి వద్ద మీటరు వస్తది. ఏక్‌నాథ్‌ శిందేలాను తీసుకొస్తామని, ఈడీ దాడులు చేస్తామని బెదిరిస్తున్నారు. ఈడీ వస్తే నాకేమైనా భయమా? ఈడీ కాకపోతే బోడీ పెట్టుకోమని చెప్పా. నరేంద్రమోదీ.. నువ్వు గోకినా గోకకున్నా నేను మాత్రం గోకుతూనే ఉంటా. మోదీని ఓడించేందుకు కొత్త శత్రువు అవసరం లేదు.. ఆయన అహంకారమే అతన్ని ఓడిస్తుంది.  బావి కాడ మీటరు కాదు.. భాజపా వద్దే మీటరు పెడదాం. భాజపా టక్కు టమారా విద్యలు చూసి మునుగోడు ప్రజలు మోసపోవద్దు. ఇది పార్టీల ఎన్నిక కాదు.. రైతుల బతుకుదెరువు ఎన్నిక. తెలంగాణ జీవితం. దేశంలో మతపిచ్చి, కుల పిచ్చి మంచిదా? ఎవరిని ఉద్ధరీయడానికి. విద్వేషం పుట్టిస్తే దేశం ప్రమాదంలో పడుతుంది. భాజపాను గెలిపిస్తే అన్ని సంక్షేమ పథకాలు ఆగిపోతాయి’’ అని సీఎం కేసీఆర్‌ వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని