KTR: సోషల్ మీడియా కమిటీలను మరింత బలోపేతం చేసుకోవాలి: పార్టీ నేతలకు కేటీఆర్‌ దిశానిర్దేశం

సీఎం కేసీఆర్‌ రాసిన సందేశంతోనే ఆత్మీయ సమ్మేళనం ప్రారంభించాలని భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ నేతలు ఆత్మీయ సమ్మేళనంలో కచ్చితంగా పాల్గొనాలని సూచించారు.

Updated : 02 Apr 2023 16:36 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణను ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. భారత రాష్ట్ర సమితి ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణపై ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగుతున్న తీరుపై పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఆధ్వర్యంలో 10 మందితో కూడిన కమిటీ ఏర్పాటైందని వెల్లడించారు.  ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు  జరుగుతున్న తీరును పరిశీలిస్తుందన్నారు.  జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలు కమిటీకి సహకరించాలని  కేటీఆర్ సూచించారు.  ఈ కమిటీ ద్వారానే కేసీఆర్ పార్టీ కార్యక్రమాల అమలు పర్యవేక్షణ తీరు, వాటికి సంబంధించిన అభిప్రాయాలు తీసుకుంటారని వెల్లడించారు.

ఎన్నికల  ఏడాదిలో ప్రతి ఎమ్మెల్యే అత్యంత చురుకైన పార్టీ కార్యకర్తలతో  ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. ఈ బృందం ద్వారా అటు పార్టీకి ప్రజలకు నిరంతరం సమాచారం అందించడంతోపాటు, పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించుకునేందుకు ఉపయోగించుకోవాలని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకుపోయేందుకు సోషల్ మీడియా కమిటీలు మరింత బలోపేతం చేసుకోవాలని తెలిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనాలు మే వరకు  నిర్వహించుకోవచ్చని సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మరింత విస్తృతంగా, కూలంకషంగా, అత్యంత పకడ్బందీగా నిర్వహించుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. 

సమాచార సైనికులుగా పార్టీ కార్యకర్తలు..

ప్రతి ఆత్మీయ సమ్మేళనం కచ్చితంగా సీఎం కేసీఆర్‌ కార్యకర్తలకు రాసిన ఆత్మీయ సందేశంతోనే ప్రారంభించుకోవాలని కేటీఆర్‌ సూచించారు. సీఎం ఆత్మీయ సందేశం ప్రతి కార్యకర్తకు అందేలా అవసరమైన కరపత్రాల  వంటి మెటీరియల్స్ సిద్ధం చేసి విస్తృతంగా పంపిణీ చేసుకోవాలన్నారు. పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు, పదవుల్లో కొనసాగుతున్న ప్రతి ఒక్కరూ ఈ ఆత్మీయ సమ్మేళనాల్లో హాజరయ్యేలా ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని చెప్పారు. ఈ ఆత్మీయ సమ్మేళనాల ద్వారా రాష్ట్రంలో జరిగిన  అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకుపోయేందుకు అవకాశం లభిస్తుందన్నారు.  తెలంగాణ సాధించిన అభివృద్ధిపైన విస్తృతంగా మాట్లాడేందుకు ప్రజాప్రతినిధులు, వక్తలను ప్రత్యేకంగా ఇందుకు ఉపయోగించుకోవాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితులు, రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి, అందివచ్చిన సంక్షేమ కార్యక్రమాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ కార్యకర్తలను సమాచార సైనికులుగా తయారు చేసేందుకు ఆత్మీయ సమ్మేళనాలు అద్భుతంగా ఉపయోగపడతాయని కేటీఆర్ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని