Sharad Pawar: వారెంత ప్రయత్నించినా.. భాజపాతో పొత్తు ప్రసక్తే లేదు..!

భాజపాతో జట్టుకట్టే ప్రసక్తే లేదని శరద్‌ పవార్‌ స్పష్టం చేశారు. ఈ దిశగా తనను ఒప్పించేందుకు కొందరు యత్నిస్తున్నారని చెప్పారు.

Updated : 13 Aug 2023 20:08 IST

ముంబయి: కొంతమంది శ్రేయోభిలాషులు తనను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ.. భాజపా (BJP)తో తమ పార్టీ చేతులు కలపదని ఎన్సీపీ (NCP) అధినేత శరద్ పవార్ (Sharad Pawar) స్పష్టం చేశారు. భాజపాతో ఎలాంటి అనుబంధమైనా.. అది ఎన్సీపీ రాజకీయ విధానానికి సరిపోదని చెప్పారు. సోలాపుర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న శరద్‌ పవార్‌ మీడియాతో మాట్లాడారు. అజిత్‌ పవార్‌తో శనివారం జరిగిన రహస్య భేటీపై స్పందిస్తూ.. ఒక ఇంటి సభ్యుడిగా ఆయన్ను కలిశానని చెప్పారు.

‘మా పార్టీలో కొందరు (అజిత్ పవార్ వర్గం) వేరే దారి ఎంచుకున్నారు. ఈ క్రమంలోనే.. మా వైఖరిలోనూ ఏమైనా మార్పు వస్తుందేమోనని కొందరు చూస్తున్నారు. అందుకే.. నన్ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. మా పార్టీ భాజపాతో ఎప్పటికీ జట్టుకట్టదు. ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడిగా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నా’ అని శరద్‌ పవార్‌ తెలిపారు. ఇదిలా ఉండగా.. శరద్‌ పవార్‌పై అజిత్‌ పవార్‌ వర్గం తిరుగుబాటు చేసి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే.

శరద్‌ పవార్‌-అజిత్‌ రహస్య భేటీ..! మహా రాజకీయాల్లో మళ్లీ చర్చ

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌తో రహస్య భేటీ గురించి ప్రశ్నించగా.. ‘అజిత్‌ నా సోదరుడి కుమారుడు. అతడిని కలవడంలో తప్పేముంది? ఒక ఇంట్లోని సీనియర్‌ వ్యక్తి.. తన కుటుంబంలోని మరో వ్యక్తిని కలవాలని కోరుకుంటే.. దాంతో ఎటువంటి సమస్య ఉండకూడదు’ అని శరద్‌ పవార్‌ పేర్కొన్నారు. అంతకుముందు.. సోలాపుర్‌లో దివంగత ఎమ్మెల్యే గణపత్‌రావు దేశ్‌ముఖ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌తో పవార్‌ వేదికను పంచుకోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని