Pawar: శరద్‌ పవార్‌-అజిత్‌ రహస్య భేటీ..! మహా రాజకీయాల్లో మళ్లీ చర్చ

ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్‌, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌లు రహస్యంగా భేటీ అయ్యారనే వార్తలు మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.

Published : 13 Aug 2023 18:13 IST

ముంబయి: నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (NCP) అధినేత శరద్‌ పవార్‌పై.. అజిత్‌ పవార్‌ వర్గం తిరుగుబాటు చేసి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. అనంతరం ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజిత్‌ పవార్‌ (Ajit Pawar), ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్‌ల (Sharad Pawar) మధ్య దూరం పెరిగింది. ఇటీవల శరద్‌ పవార్‌ను అజిత్‌ వర్గం పలుసార్లు కలిసినప్పటికీ అందుకు సంబంధించిన సమాచారం బయటకు వెల్లడైంది. కానీ ఈసారి మాత్రం ఇద్దరు నేతలు రహస్యంగా భేటీ అయ్యారనే వార్తలు మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. దీనిపై ఆ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్‌ పాటిల్‌ స్పందిస్తూ.. అది సీక్రెట్‌ మీటింగ్‌ కాదన్నారు. కానీ, వారిమధ్య ఏం సంభాషణ జరిగిందో తనకు తెలియదన్నారు.

జయలలితకు అవమానంపై.. తమిళనాట మాటల యుధ్ధం

శరద్‌ పవార్‌తోపాటు ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌లు పుణెలోని ఓ వ్యాపారవేత్త ఇంట్లో శనివారం భేటీ అయ్యారు. కొరేగావ్‌ పార్కులో ఉన్న ఇంటికి మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో శరద్‌ పవార్‌ వెళ్లినట్లు వార్తా ఛానళ్లలో కనిపించింది. ఐదు గంటలకు ఆయన బయటకు వెళ్లిపోయారు. అనంతరం ఓ గంట తర్వాత అజిత్‌ పవర్‌ కారు కూడా ఆ ప్రాంగణం నుంచే బయటకు వచ్చారు. అక్కడున్న మీడియా కంటకనపడకుండా వెళ్లిపోయారు. దీంతో వీరిమధ్య రహస్య భేటీకి కారణమేంటనే విషయం చర్చనీయాశమయ్యింది.

దీనిపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్‌ పాటిల్‌ మాట్లాడుతూ.. అది రహస్య భేటీ కాదన్నారు. శరద్‌ పవార్‌తో కలిసి తాను కూడా వెళ్లానని.. కొద్దిసేపటికే బయటకు వచ్చానని అన్నారు. వారిద్దరి మధ్య ఏం సంభాషణ జరిగిందనే విషయం మాత్రం తనకు తెలియదన్నారు. అయితే, అజిత్‌ పవార్‌ వర్గంలో చేరతారా? అని వచ్చిన ప్రశ్నలకు బదులిస్తూ.. ఇరు వర్గాలు కూడా శరద్‌ పవార్‌ తమ అధినాయకుడనే విషయాన్ని గట్టిగా చెబుతున్నాయన్నారు. ఎన్‌సీపీలో ఎటువంటి విభజన లేదన్నారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ కూడా పవార్‌ల భేటీపై తనకు సమాచారం లేదని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని