​​​​​​TN cabinet: స్టాలిన్‌.. గాంధీ.. నెహ్రూ!

తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 33 మంది చేత గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్‌ ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన...

Published : 08 May 2021 01:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 33 మంది చేత గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్‌ ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కొవిడ్‌ సాయం కింద ₹4వేలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పాల ధర తగ్గింపు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు స్టాలిన్‌. ఇక స్టాలిన్‌ మంత్రివర్గాన్ని నిశితంగా పరిశీలిస్తే ఓ ఆసక్తికర విషయం బయటపడింది. ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌ నేత అయిన స్టాలిన్‌.. మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన గాంధీ, మన తొలి ప్రధాని నెహ్రూ పేర్లు కలిగిన వ్యక్తులు ఒకే కేబినెట్‌లో ఉండడం విశేషం.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అయిన కరుణానిధి సోవియట్‌ యూనియన్‌ నేత స్టాలిన్‌ అంటే ఎనలేని అభిమానం. దీంతో ఆయన పేరునే తన కుమారుడికి పెట్టుకున్నారు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన స్టాలిన్‌.. తండ్రి హయాంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ఎన్నో ఏళ్ల  ఎదురు చూపుల తర్వాత తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు తమిళనాడులో చరిత్రలో ముఖ్యమంత్రి వారసలెవరూ సీఎంగా బాధ్యతలు చేపట్టలేదు. స్టాలినే తొలి వ్యక్తి కావడం గమనార్హం. ఇక తిరుచ్చుపల్లికి చెందిన డీఎంకే నేత కేఎన్‌ నెహ్రూ సైతం ఇవాళ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనకు మున్సిపల్‌ నిర్వహణ, పట్టణ తాగునీటి సరఫరా మంత్రిత్వ శాఖను స్టాలిన్‌ అప్పగించారు. కేఎన్‌ నెహ్రూ తండ్రి కాంగ్రెస్‌కు పెద్ద అభిమాని కావడంతో తన కుమారుడికి నెహ్రూ పేరు పెట్టారు. ఇక ఆర్‌.గాంధీ సైతం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయనకు చేనేత, టెక్ట్స్‌టైల్స్‌ మంత్రిత్వ శాఖను కేటాయించారు. చేనేతను ప్రోత్సహించాలని చెప్పిన గాంధీ ఆశయాలకు అనుగుణంగా ఆయన మంత్రిత్వ శాఖ సైతం ఉండడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని