Govt Jobs: ప్రభుత్వ విభాగాల్లో 30లక్షల పోస్టులు ఖాళీ : ఖర్గే

ప్రభుత్వ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడంపై కేంద్ర ప్రభుత్వం తాత్సారం వహిస్తోందని కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. మొత్తం 30లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని.. అవన్నీ ఎప్పుడు భర్తీ చేస్తారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు.

Published : 19 Nov 2022 02:12 IST

దిల్లీ: దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని.. అయినప్పటికీ ఖాళీగా ఉన్న పోస్టులను మోదీ ప్రభుత్వం భర్తీ చేయడం లేదని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విరుచుకుపడ్డారు. ప్రభుత్వ విభాగాల్లో 30లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. కానీ, ప్రధాని మాత్రం 75వేల మందికే నియామక పత్రాలను అందజేశారని అన్నారు. కేవలం సెంట్రల్‌ సెక్రటేరియట్‌ సర్వీస్‌ (CSS) విభాగాల్లోనే 1600లకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ మీడియాలో వచ్చిన వార్తలపై స్పందించిన మల్లికార్జున ఖర్గే.. మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

‘ఏటా 2కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఈ విధంగా గడిచిన ఎనిమిదేళ్లలో 16కోట్ల ఉద్యోగాలు కల్పించాలి. ప్రభుత్వ విభాగాల్లో 30లక్షలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ, ప్రధాని మోదీ మాత్రం కేవలం 75 వేల మందికి నియామక పత్రాలు అందించారు’ అని కాంగ్రెస్‌ అధినేత మల్లికార్జున ఖర్గే ట్వీట్‌ చేశారు. ప్రధాని కార్యాలయం కిందకు వచ్చే కేంద్ర సెక్రటేరియట్‌లోనే 1600 పోస్టులు ఖాళీగా ఎందుకున్నాయని ప్రశ్నించారు.

2023 నాటికి దేశవ్యాప్తంగా 10లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది జూన్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తమ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ అన్ని విభాగాలకు సూచించింది. ఇదే సమయంలో దేశంలో ముప్పై లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటన్నింటినీ భర్తీ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని