Published : 06 Oct 2020 01:48 IST

బెంగళూరును చిత్తు చేసిన దిల్లీ

59 పరుగుల తేడాతో కోహ్లీసేన ఘోరపరాజయం 

ఇంటర్నెట్‌డెస్క్‌: దిల్లీ ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో మెరిసింది. తొలుత బ్యాట్‌తో.. తర్వాత బంతితో ఆదిపత్యం చెలాయించి బెంగళూరును చిత్తుగా ఓడించింది. దుబాయ్‌ వేదికగా కోహ్లీసేనతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో దిల్లీ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన దిల్లీ..  మార్కస్‌ స్టాయినిస్‌ (53*; 26 బంతుల్లో, 6×4, 2×6) అజేయ అర్ధశతకంతో మెరవడంతో 196 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 137 పరుగులు చేసి తొమ్మిది వికెట్లు కోల్పోయింది. బెంగళూరు జట్టులో కోహ్లీ (43; 39 బంతుల్లో 2×4, 1×1) టాప్‌ స్కోరర్‌. దిల్లీ బౌలర్లలో రబాడ (4/24), నోర్జె (2/22), అక్షర్‌ పటేల్‌ (2/18) రాణించారు. ఈ విజయంతో శ్రేయస్సేన పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.

భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన బెంగళూరుకు శుభారంభం దక్కలేదు. 27 పరుగులకే ఓపెనర్లు పడిక్కల్ (4), ఫించ్‌ (13)ను అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌ పెవిలియన్‌కు చేర్చారు. ఈ దశలో బ్యాటింగ్ వచ్చిన డివిలియర్స్‌ (9) తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ డివిలియర్స్‌ను నోర్జె ఔట్‌ చేసి బెంగళూరును దెబ్బ తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మొయిన్‌ అలీ (11) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. అయినా కోహ్లీ క్రీజులో ఉండటంతో బెంగళూరు శిబిరంలో ఆశలు సజీవంగానే ఉన్నాయి. అయితే హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ బాది గేర్‌ మార్చిన కోహ్లీని..తర్వాతి ఓవర్‌లోనే రబాడ బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత దిల్లీ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ విజయాన్ని ఖరారు చేసుకున్నారు.

అర్ధశతకంతో మెరిసిన స్టాయినిస్‌
అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. తొలి ఓవర్‌ నుంచి పృథ్వీ షా (42; 23 బంతుల్లో, 5×4, 2×6) బౌండరీల మోత మోగించడంతో దిల్లీకి శుభారంభం లభించింది. అతడికి తోడుగా శిఖర్‌ ధావన్‌ (32; 28 బంతుల్లో, 3×4) కూడా మెరవడంతో పవర్‌ప్లేలో ఆ జట్టు 63 పరుగులు చేసింది. అయితే 7వ ఓవర్‌లో షాను సిరాజ్‌ బోల్తా కొట్టించి పరుగుల జోరుకు బ్రేక్‌లు వేశాడు. కొద్దిసేపటికే ధావన్‌, శ్రేయస్ అయ్యర్‌ (11) కూడా ఔటవ్వడంతో స్కోరుబోర్డు నెమ్మదించింది. అనంతరం క్రీజులోకి వచ్చిన పంత్ (37; 25 బంతుల్లో‌, 3×4, 2×6), స్టాయినిస్‌ మరో వికెట్‌ పడకుండా నెమ్మదిగా ఆడటంతో 13వ ఓవర్‌లో ఆ జట్టు స్కోరు 100 పరుగులు దాటింది. ఆ తర్వాత స్టాయినిస్‌ గేర్‌ మార్చి బౌండరీల మోత మోగించాడు. మొయిన్‌ అలీ బౌలింగ్‌లో సిక్సర్‌, ఫోర్‌.. సైని ఓవర్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌ బాదాడు. పంత్‌ కూడా చెలరేగంతో పరుగులు పోటెత్తాయి. ఈ క్రమంలో స్టాయినిస్‌ 24 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. ఆఖరి ఓవర్‌లో హెట్‌మెయిర్‌ (11*) సిక్సర్‌ బాదడంతో దిల్లీ 196 పరుగులు సాధించింది. గత సీజన్‌లో స్టాయినిస్‌ బెంగళూరు తరఫున ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ (2/32) రాణించాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని