ఇది ఎప్పటికీ మరవలేను: నటరాజన్‌

టీమిండియా అమ్ములపొదిలో మరో పేస్‌ అస్త్రం చేరింది. బ్యాట్స్‌మెన్‌కు సమాధానం దొరకని యార్కర్లు, ఆఫ్‌ కట్టర్లు, నెమ్మది బంతులతో నటరాజన్‌ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. సీనియర్‌ పేసర్లు బుమ్రా, షమి...

Published : 08 Dec 2020 00:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమిండియా అమ్ములపొదిలో మరో పేస్‌ అస్త్రం చేరింది. బ్యాట్స్‌మెన్‌కు సమాధానం దొరకని యార్కర్లు, ఆఫ్‌ కట్టర్లు, నెమ్మది బంతులతో నటరాజన్‌ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. సీనియర్‌ పేసర్లు బుమ్రా, షమి జట్టులో లేకపోయినా దీపక్‌ చాహర్, శార్దూల్‌ ఠాకూర్‌తో కలిసి పేస్ దళం బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఆస్ట్రేలియాపై భారత్‌ టీ20 సిరీస్‌ గెలవడంలో నటరాజన్‌ కీలకపాత్ర పోషించాడు. రెండో టీ20లో సహచరులంతా భారీ పరుగులు ఇవ్వగా అతడు నాలుగు ఓవర్లలో 20 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. తొలి టీ20లోనూ మూడు వికెట్లతో సత్తాచాటాడు.

అయితే టీమిండియా టీ20 సిరీస్‌ కైవసం చేసుకున్న అనంతరం నటరాజన్ ట్వీట్ చేశాడు. ‘‘దేశం తరఫున గెలిచిన తొలి సిరీస్‌. ఇది చిరస్మరణీయం, ఎంతో ప్రత్యేకం’’ అని దానికి వ్యాఖ్య జత చేశాడు. వరుణ్‌ చక్రవర్తికి గాయమవ్వడంతో ఆఖర్లో ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన నట్టూ సంచలన ప్రదర్శనలతో అందరి ప్రశంసలు పొందుతున్న విషయం తెలిసిందే. బుమ్రా మాదిరిగానే నటరాజన్ కంగారూల గడ్డపై అరంగేట్రం చేశాడని, త్వరలో ప్రపంచ మేటి బౌలర్‌గా మారుతాడని ఆశిస్తున్నారంతా. ‘‘నటరాజన్‌ గొప్పగా బౌలింగ్ చేస్తున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భారత్‌ మరో కీలక బౌలర్‌ను కనుగొంది. అతడు తన ప్రదర్శన ఇలానే కొనసాగిస్తాడని ఆశిస్తున్నా’’ అని రెండో టీ20లో వ్యాఖ్యాతగా ఉన్న ఆసీస్‌ దిగ్గజ పేసర్ మెక్‌గ్రాత్ ‌ అన్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్×ఆస్ట్రేలియా చివరి మ్యాచ్‌ మంగళవారం జరగనుంది.

ఇదీ చదవండి

క్లీన్‌స్వీప్ కోసం భారత్.. పరువు కోసం ఆసీస్‌

జడ్డూ.. డౌటే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని