ఒక రేంజ్‌ క్రికెటర్లు బాబూ..!

ఒకరేమో బరిలోకి దిగితే ‘పరుగుల రారాజు’ అవతారం ఎత్తేస్తాడు. ఇంకొకరేమో ఒత్తిడెంత చిత్తుచేస్తున్నా ‘కూల్‌’గా పనికానిచ్చేస్తాడు. మరొకరేమో మైదానంలో ‘360 డిగ్రీ’ల్లో బంతిని పరుగులు పెట్టిస్తాడు. ఆ ఉంగరాల జట్టు పేసరేమో పదునైన ‘యార్కర్ల’తో బ్యాట్స్‌మెన్‌ పాదాలను...

Updated : 29 Dec 2020 11:10 IST

ఐసీసీ దశాబ్దపు జట్లలో సాటిలేని మొనగాళ్లు 

ఒకరేమో బరిలోకి దిగితే ‘పరుగుల రారాజు’ అవతారం ఎత్తేస్తాడు. ఇంకొకరేమో ఒత్తిడెంత చిత్తుచేస్తున్నా ‘కూల్‌’గా పనికానిచ్చేస్తాడు. మరొకరేమో మైదానంలో ‘360 డిగ్రీ’ల్లో బంతిని పరుగులు పెట్టిస్తాడు. ఆ ఉంగరాల జుట్టు పేసరేమో పదునైన ‘యార్కర్ల’తో బ్యాట్స్‌మెన్‌ పాదాలను చిదిమేస్తాడు. ఇక ఆయనేమో షార్ట్‌పిచ్‌ బంతుల్ని అలవోకగా సిక్సర్లుగా మలుస్తూ తనను మించిన ‘హిట్‌మ్యాన్‌’ మరొకరు లేరంటాడు. అందుకే కదా! ఈ దశాబ్దపు ఐసీసీ జట్లలో కనీసం రెండింట్లో వీరంతా చోటు దక్కించుకుంది మరి!


సరిలేరు.. తనకెవ్వరూ

‘నే ఆడితే లోకమే ఆడదా.. నే పాడితే లోకమే పాడదా.. నేనుంటే హాయి హాయి..’- టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీకి ఇది అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ఎందుకంటే అతనాడుతుంటే లోకమంతా చూస్తుంది. సొగసైన కవర్‌డ్రైవ్‌లతో అలరిస్తుంటే అభిమాన గణం అతడి పేరును పాటలా పాడుతుంది. అతనుండే జట్టు ఏదైనా హాయిగా ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత నిలకడకు మారుపేరు కింగ్‌కోహ్లీ. టీ20, వన్డే, టెస్టు.. ఫార్మాటేదైనా స్వదేశం, విదేశం అన్న తేడా లేకుండా అతడు పరుగుల మోత మోగిస్తాడు. శతకాల పంట పండిస్తాడు. అందుకే ఐసీసీ ఈ దశాబ్దపు వన్డే, టీ20, టెస్టు జట్లలో చోటు సాధించిన ఏకైక క్రికెటర్‌గా ఘనత సాధించాడు. అంతేకాకుండా ఐసీసీ ఈ దశాబ్దపు వన్డే క్రికెటర్‌, ఐసీసీ ఈ దశాబ్దపు పురుష క్రికెటర్‌ పురస్కారాలు అందుకున్నాడు. దిగ్గజాలతో కూడిన టెస్టు జట్టుకు సారథిగా ఎంపికయ్యాడు. 2008లో అరంగేట్రం చేసిన విరాట్‌ 2013 నుంచి తన అసలైన విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. ఫిట్‌నెస్‌ పరంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. వన్డే ప్రపంచకప్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీలు ముద్దాడాడు. అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటి వరకు 423 మ్యాచులాడి 55.99 సగటుతో 22,286 పరుగులు చేశాడు. 70 శతకాలతో సచిన్‌ రికార్డును బద్దలు కొట్టేందుకు వడివడిగా పయనిస్తున్నాడు.


హై.. హై నాయకా

అంతర్జాతీయ క్రికెట్లో సారథ్యానికి సరికొత్త రూపు తీసుకొచ్చిన ఆటగాడు మహేంద్రసింగ్‌ ధోనీ. ‘మిస్టర్‌ కూల్‌’గా అతడు సాధించాల్సింది ఇంకేమీ లేదు. ఐసీసీ వన్డే, టీ20 ప్రపంచకప్‌లు, ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ, ఆసియాకప్‌లు గెలిచేశాడు. మూడుసార్లు ఐపీఎల్‌ టైటిళ్లూ అందుకున్నాడు. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌శర్మ, సురేశ్‌ రైనా సహా ఎందరో ఆటగాళ్లను ప్రోత్సహించాడు. తన ప్రతిభాపాటవాలతో ‘అత్యుత్తమ క్రికెట్‌ బుర్ర’ తనదేనని నిరూపించుకున్నాడు. ఇక మెరుపు వేగంతో చేసిన స్టంపౌట్లు, రనౌట్లకు లెక్కే లేదు. గుండెలయను అమాంతం పెంచే ఒత్తిడిలోనూ అతడు ప్రశాంతంగా ముగించిన మ్యాచులకు కొదవలేదు. మైదానంలో మహీ క్రీడాస్ఫూర్తికి సాటిరారెవరు! 2011లో నాటింగ్‌హామ్‌ టెస్టులో ఇయాన్‌బెల్‌ రనౌట్‌పై అతడి ప్రదర్శించిన స్ఫూర్తికి గాను ఇప్పుడు ‘ఐసీసీ ఈ దశాబ్దపు స్ఫూర్తిదాయక క్రికెటర్‌’ పురస్కారాన్నీ సొంతం చేసుకున్నాడు. ఐసీసీ ఈ దశాబ్దపు వన్డే, టీ20 జట్లకు సారథిగా ఎంపికయ్యాడు. కెరీర్లో 538 మ్యాచులాడిన మహీ 44.96 సగటుతో 17,266 పరుగులు చేశాడు. 16 శతకాలు బాదాడు. 634 క్యాచులు అందుకున్నాడు. 195 మందిని స్టంపౌట్‌ చేసి రికార్డు నెలకొల్పాడు. ‘అత్యుత్తమ బుర్ర’ కాబట్టే అతడు లేని లోటు ఇప్పటికీ కనిపిస్తోంది!


హిట్‌.. హిట్‌ హుర్రే

ప్రపంచ క్రికెట్లో అందమైన షాట్లతో అలరించిన ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. ఆ అందరిలోనూ భిన్నమైన క్రికెటర్‌ రోహిత్‌ శర్మ. అతడి క్రికెటింగ్‌ షాట్లలో సొగసు, పవర్‌ రెండూ కనిపిస్తాయి. షార్ట్‌పిచ్‌ బంతులకు వెరవకుండా బౌండరీ సరిహద్దు దాటించగలడం అతడికి మాత్రమే సొంతమైన కళ. ఈ షాట్‌ను ఎంతోమంది ప్రయత్నించి విఫలమైతే అతడు మాత్రం మరింత రాటుదేలాడు. అందరూ ద్విశతకాలను అందుకొనేందుకు టెస్టులను ఉపయోగించుకుంటే హిట్‌మ్యాన్‌ మాత్రం వన్డేలను ఎంచుకున్నాడు. ఐదేళ్లుగా అతడి కెరీర్‌ అత్యుత్తమ స్థాయిలో ఉంది. ఓపెనర్‌గా అతడు సృష్టించిన విధ్వంసాలతో టీమ్‌ఇండియా అనూహ్య విజయాలెన్నో అందుకుంది. అందుకే ఐసీసీ ఈ దశాబ్దపు వన్డే, టీ20 జట్లలో అతడు ఓపెనర్‌గా ఎంపికయ్యాడు. ఇక సారథిగానూ రోహిత్‌ ప్రతిభ చాటుకున్నాడు. కోహ్లీకి విశ్రాంతి ప్రకటించిన ప్రతిసారీ సిరీసులు గెలిచి చూపించాడు. యువకులను ప్రోత్సహించడం, మెరుగ్గా బౌలింగ్‌ చేయించడం, పక్కాగా వ్యూహాలు అమలు చేయడంలో ఎంఎస్‌ ధోనీకి వారసుడిగా అనిపిస్తాడు. ఐదుసార్లు ఐపీఎల్‌ గెలిపించాడంటేనే అతడి సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. కెరీర్లో 364 మ్యాచులాడిన రోహిత్‌ 44.39 సగటుతో 14,029 పరుగులు చేశాడు. 39 శతకాలు అందుకున్నాడు.


అంతా అతనిష్టం

తన వినూత్నమైన షాట్లు, దేహభాషతో ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్న ఆటగాడు ఏబీ డివిలియర్స్‌. మైదానంలో 360 డిగ్రీల్లో షాట్లు బాదేస్తూ ‘క్రేజీ’ క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. అటు బౌలర్‌ మీదుగా, ఇటు కీపర్‌ మీదుగా సిక్సర్లు బాదగలిగే నైపుణ్యం ఉన్న ఆటగాడు బహుశా అతడేకావచ్చు. వేగంగా షాట్లు కొడుతూ పరుగుల వరద పారిస్తూ అతడు సృష్టించిన విధ్వంసాలకు కొదవలేదు. అతడు భారత బౌలర్లనూ ఊచకోత కోస్తున్నా ‘ఏబీ.. ఏబీ’ అని నినాదాలు వినిపించేవంటే అభిమానులు అతడిని ఎంతగా ప్రేమిస్తారో అర్థం చేసుకోవచ్చు. బ్యాట్స్‌మన్‌, కీపర్‌, సారథిగా విపరీతంగా శ్రమించినా దక్షిణాఫ్రికాకు ప్రపంచకప్‌ అందించలేకపోవడం మాత్రం అతడికి లోటే. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై చాన్నాళ్లే అయినా ఇప్పటికీ అతడు తిరిగి రావాలన్న డిమాండ్లు వినిపిస్తుండటం గమనార్హం. అందుకే అతడు ఐసీసీ ఈ దశాబ్దపు వన్డే, టీ20 జట్లలో చోటు దక్కించుకున్నాడు. కెరీర్లో 420 అంతర్జాతీయ మ్యాచులాడిన ఏబీ 48.11 సగటుతో 20,014 పరుగులు చేశాడు. 47 శతకాలు బాదేశాడు.


బంతి విసిరితే వికెట్టే

ఉంగరాల జుట్టు.. సైడ్‌ ఆర్మ్‌ను తలపించే బౌలింగ్‌.. భయంకరమైన యార్కర్లతో బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించిన పేసర్‌ లసిత్‌ మలింగ. ఆరంభ, ఆఖరి ఓవర్లలో చెలరేగి శ్రీలంకకు ఎన్నో విజయాలు  అందించాడు. గాయాలు, ఫిట్‌నెస్‌ ఇబ్బందులతో టెస్టు కెరీర్‌కు త్వరగానే వీడ్కోలు పలికిన అతడు పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. 2014లో తన సారథ్యంలో శ్రీలంకకు టీ20 ప్రపంచకప్‌ అందించాడు. ఇక వరుస వికెట్లు తీయడంలో అతడి తర్వాతే ఎవరైనా. అంతర్జాతీయ క్రికెట్లో రెండుసార్లు వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌ మలింగ. 2007లో దక్షిణాఫ్రికా, 2019లో న్యూజిలాండ్‌పై ఈ ఘనత సాధించాడు. టీ20 మ్యాచుల్లో 100 వికెట్లు తీసిన తొలి బౌలర్‌ అతనే. ఇప్పటి వరకు వన్డేల్లో మూడు హ్యాట్రిక్‌ల ఘనత దక్కిందీ అతడికే. వేగంలో మార్పులు చేస్తూ ఇన్‌స్వింగింగ్‌ డెలివరీలతో వికెట్లు తీయడంలో మలింగను మించిన వారు లేరు. అందుకే ఐసీసీ ఈ దశాబ్దపు వన్డే, టీ20 జట్లలో అతడికి చోటిచ్చింది. కెరీర్లో 340 అంతర్జాతీయ మ్యాచులాడిన మలింగ 28.08 సగటుతో 546 వికెట్లు పడగొట్టాడు. 6/38 అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు.


‘స్ట్రోక్స్‌’ ప్లేయర్‌

అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌కు మారుపేరుగా మారాడు బెన్‌స్టోక్స్‌. ఉత్తమ ప్రతిభావంతుడే అయినా మద్యం సేవించి వీధుల్లో గొడవపడటం అతడి కొంప ముంచింది. కోర్టుల చుట్టూ తిరగడంతో జట్టులో చోటే ప్రశ్నార్థకమైంది. కానీ అప్పటి ఇంగ్లాండ్‌ క్రికెట్‌ డైరెక్టర్‌ ఆండ్రూస్ట్రాస్‌ దయతో వివాదాల నుంచి బయటపడ్డాడు. తన తప్పు తెలుసుకొని మెరుగైన క్రికెటర్‌గా అవతరించాడు. ఇంగ్లాండ్‌కు 2019లో వన్డే ప్రపంచకప్‌ అందించాడు. అటు బ్యాటు, బంతితో జట్టుకు అండగా నిలిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో అతడి పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్‌ సిరీసులో తన విలువను మరింత పెంచుకున్నాడు. ఆఖరి వికెట్‌తో కలిసి అరుదైన భాగస్వామ్యంతో ఇంగ్లాండ్‌కు విజయం అందించి శెభాష్‌ అనిపించుకున్నాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 250 (196 బంతుల్లో) పరుగులు చేసిన ఆటగాడిగా స్టోక్స్‌ రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో టెస్టులో ఆరో వికెట్‌కు 399 పరుగుల భాగస్వామ్యంతో చరిత్ర లిఖించాడు. ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్లలో 191 మ్యాచులాడిన స్టోక్స్‌ 36.97 సగటుతో 7,468 పరుగులు చేశాడు. 13 శతకాలు బాదాడు. ఇక 34.80 సగటుతో 244 వికెట్లు తీశాడు. 6/22 అత్యుత్తమ గణాంకాలు. అందుకే అతడు ఐసీసీ ఈ దశాబ్దపు వన్డే, టెస్టు జట్లలో ఆల్‌రౌండర్‌గా చోటు సంపాదించాడు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌

ఇవీ చదవండి..

రెండో టెస్టులో విజయం మనదే

విరాట్‌కు పోటీయా! వార్నర్ ప్రశంసలివి

ఇలాగైతే ఐసీసీ దృష్టిసారించాల్సిందే: సచిన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని