బిగ్‌బాష్‌లోకి యువీ..!

టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ మరో ప్రఖ్యాత లీగ్‌పై కన్నేశాడు. ఆస్ట్రేలియా టీ20 లీగ్‌ ‘బిగ్‌బాష్‌’లో ఆడాలని కోరుకుంటున్నాడు. అతడి కోసం క్రికెట్‌ ఆస్ట్రేలియా ఓ ఫ్రాంచైజీని వెతికే పనిలో పడిందని సమాచారం.....

Updated : 08 Sep 2020 15:59 IST

ఫ్రాంచైజీని వెతుకుతున్న క్రికెట్‌ ఆస్ట్రేలియా

మెల్‌బోర్న్‌: టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ మరో ప్రఖ్యాత లీగ్‌పై కన్నేశాడు. ఆస్ట్రేలియా టీ20 లీగ్‌ ‘బిగ్‌బాష్‌’లో ఆడాలని కోరుకుంటున్నాడు. అతడి కోసం క్రికెట్‌ ఆస్ట్రేలియా ఓ ఫ్రాంచైజీని వెతికే పనిలో పడిందని సమాచారం.

ఐపీఎల్‌ తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మక క్రికెట్‌ లీగ్‌గా ‘బిగ్‌బాష్‌’కు పేరుంది. భారతీయులు మినహా ప్రపంచ దేశాల క్రికెటర్లు అందులో భాగం అవుతున్నారు. మహిళా క్రికెటర్లు మినహా పురుషులు ఇతర దేశాల లీగుల్లో ఆడేందుకు బీసీసీఐ అనుమతి ఇవ్వడం లేదు. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లకు మాత్రం అనుమతి ఇస్తోంది. సురేశ్‌ రైనా, రాబిన్‌ ఉతప్ప, హర్భజన్‌ సింగ్‌ వంటి వెటరన్‌ క్రికెటర్లు తమకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు.

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన యువీ.. కెనడా టీ20 లీగ్‌, టీ10 వంటి లీగుల్లో ఆడాడు. కరోనా వైరస్‌ కారణంగా ప్రస్తుతం టోర్నీలేమీ జరగడం లేదు. ఎంతో కష్టపడితే గానీ ఐపీఎల్‌ వంటి లీగులు సాధ్యమవ్వడం లేదు. ఈ నేపథ్యంలో ‘బిగ్‌బాష్‌’లో ఆడాలని అతడు‌ నిర్ణయించుకున్నాడు. క్రికెట్‌ ఆస్ట్రేలియా యువీ కోసం ఓ ఫ్రాంచైజీని గుర్తించే పనిలో పడిందని అతడి మేనేజర్‌ జేసన్‌ వార్న్‌ (డబ్ల్యూ స్పోర్ట్స్‌, మీడియా) చెప్పినట్టు  సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌లో ఓ కథనం వచ్చింది.

భారతీయ క్రికెటర్లు బిగ్‌బాష్‌లో ఆడితే టోర్నీ విలువ మరింత పెరుగుతుందని ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఘం అధ్యక్షుడు షేన్‌ వాట్సన్‌ పేర్కొన్నారు. బిగ్‌బాష్‌పై యువీ ఆసక్తి ప్రదర్శించడంపై అతడు స్పందించాడు. ‘ఇలాంటి టోర్నీల్లో భారతీయులు ఆడితే అద్భుతంగా ఉంటుంది. పరిస్థితులు అలాగే ఉన్నాయి. భారత్‌లో ప్రపంచస్థాయి టీ20 స్పెషలిస్టులు ఉన్నారు. వారు స్వదేశంలో తప్ప ఎక్కడా ఆడటం లేదు. బిగ్‌బాష్‌ సహా ప్రపంచ లీగులకు వారు అందుబాటులో ఉంటే బాగుంటుంది’ అని అన్నాడు. ‘ఇదే నిజమైతే టోర్నీల్లో పోటీతత్వమే మారిపోతుంది’ అని పేర్కొన్నాడు. వాట్సన్‌ ఇప్పుడు చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని