HarmanPreet: హర్మన్‌ మ్యాచ్‌లోనే కాదు.. గాయాలతోనూ పోరాడటం చూశా: అంజుమ్‌

మహిళల టీ20 ప్రపంచకప్‌లో (Womens World Cup 2023) భారత్‌ కథ సెమీస్‌లోనే ముగిసిపోయింది. ఆసీస్‌ చేతిలో టీమ్‌ఇండియా (Team India) స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. దీంతో కెప్టెన్ హర్మన్‌తో సహా జట్టు సభ్యులంతా బాధలో మునిగిపోయారు.

Updated : 24 Feb 2023 15:58 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌లో (Womens World Cup 2023) ఉత్కంఠభరితంగా సాగిన సెమీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో (IND w vs AUS w) కేవలం ఐదు పరుగుల తేడాతో భారత్‌ ఓటమిపాలైంది. చివరి రెండు ఓవర్లలో 20 పరుగులు చేయాల్సిన తరుణంలో 19వ ఓవర్‌లో కేవలం నాలుగు పరుగులే వచ్చాయి. అప్పటికే క్రీజ్‌లో కుదురుకుని కీలక ఇన్నింగ్స్‌ ఆడిన కెప్టెన్ హర్మన్‌ ప్రీత్ కౌర్‌తోపాటు (HarmanPreet Kaur) రిచా ఘోష్ పెవిలియన్‌కు చేరడంతో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. చివరి ఓవర్‌లో దీప్తి శర్మ (Deepti Sharma) పోరాడినా ప్రయోజనం మాత్రం దక్కలేదు. ఫైనల్‌కు చేరాలనే భారత్‌ ఆశలకు ఆసీస్‌ గండికొట్టింది. వరుసగా ఏడోసారి మహిళల ప్రపంచకప్‌ టైటిల్‌ ఫైనల్‌కు దూసుకెళ్లి రికార్డు సృష్టించింది. 

సెమీస్‌లో స్వల్ప తేడాతో ఓటమి చవిచూడటంతో భారత ప్లేయర్లు దుఖఃసాగరంలో మునిగిపోయారు. మరీ ముఖ్యంగా అర్ధశతకంతో రాణించిన కెప్టెన్ హర్మన్‌ కన్నీళ్లు పెట్టిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మ్యాచ్‌ అనంతరం వ్యాఖ్యాతతో మాట్లాడేటప్పుడు కూడా హర్మన్‌ తన కన్నీటిని ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు కళ్లజోడుతోనే మాట్లాడింది. ఈ క్రమంలో హర్మన్‌ను టీమ్‌ఇండియా మాజీ ప్లేయర్ అంజుమ్‌ చోప్రా ఓదార్చింది. 

అనంతరం అంజుమ్‌ మాట్లాడుతూ.. ‘‘కొద్ది తేడాతో ఓడిపోయి తీవ్ర బాధలో ఉన్న కెప్టెన్‌కు సాంత్వన ఇవ్వడమే నా ఉద్దేశం. బయట నుంచి నేను చేయగలిగేది అదే. ఈ క్షణాలు మా ఇద్దరికీ భావోద్వేగపూరితమైనవే. భారత్‌ చాలాసార్లు సెమీ ఫైనల్స్‌కు దూసుకొచ్చింది. కొన్నిసార్లు ఓటమిపాలైంది. అయితే, హర్మన్‌ ప్రీత్‌ ఇలా బ్యాటింగ్‌ చేయడం ఇదే మొదటిసారికాదు. చాలా అద్భుతంగా ఆడింది. గాయాలు, అనారోగ్య పరిస్థితులతోనూ పోరాడింది. సెమీస్‌లోనూ ఆడుతుందో లేదోననే అనుమానం వచ్చినప్పటికీ.. ప్రపంచ కప్‌ కావడంతో ఆడేందుకే మొగ్గు చూపింది. 20 ఓవర్లపాటు ఫీల్డింగ్‌తోపాటు బ్యాటింగ్‌లోనూ కీలక పాత్ర పోషించింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అంకితభావం ఆ స్థాయిలో ఉంటుంది. జెమీమా రోడ్రిగ్స్‌ కూడా అద్భుతంగా ఆడింది. కానీ మనకు ఓటమి తప్పలేదు. ఓ ప్లేయర్‌గా వారి బాధను తగ్గించేందుకు ప్రయత్నించా’’ అని అంజుమ్ తెలిపింది. ఈ వీడియోను ఐసీసీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని