Ashes Series : 147పరుగులకే కుప్పకూలిన ఇంగ్లాండ్‌.. కమిన్స్‌కు ఐదు వికెట్లు

యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ బ్యాటర్లు ఘోర వైఫల్యం..

Updated : 08 Dec 2021 15:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్: యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ బ్యాటర్లు ఘోర వైఫల్యం చెందారు. ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్ కమిన్స్‌ (5/38), మిచెల్‌ స్టార్క్ (2/35), హేజిల్‌వుడ్‌ (2/42), గ్రీన్‌ (1/6) ఇంగ్లాండ్‌ను బెంబేలెత్తించారు. టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 50.1 ఓవర్లలో కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. అయితే వర్షం పడటంతో ఆసీస్‌ బ్యాటింగ్‌కు దిగకుండానే తొలి రోజును ముగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. గబ్బా మైదానం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో తొలి బంతికే ఓపెనర్‌ రోరీ బర్న్స్‌ (0) స్టార్క్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేసి వికెట్ల వేటను ప్రారంభించాడు. యాషెస్‌ టెస్టుల్లో మొదటి బంతికే వికెట్‌ తీసిన రెండో బౌలర్‌గా ఖ్యాతికెక్కాడు. స్టార్క్‌ కంటే ముందు 1936లో  ఎర్నీ మెక్‌ కార్మిక్‌ తొలిసారి ఈ ఘనత సాధించాడు. 

ఇంగ్లాండ్‌ మరో ఓపెనర్ హసీబ్‌ హమీద్‌ (25) కాస్త కుదురుకున్నట్లు కనిపించాడు. అయితే బర్న్స్‌ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన డేవిడ్‌ మలన్‌ (6), జోయ్‌ రూట్‌ (0) ఔటైపోయారు. వీరిద్దరి వికెట్లను హేజిల్‌వుడ్‌ పడగొట్టాడు. ఇక తర్వాత బౌలింగ్‌కు  ఆసీస్‌ సారథి ప్యాట్‌ కమిన్స్‌  దిగాడు. బెన్‌స్టోక్స్‌ (5)ను బోల్తా కొట్టించిన కమిన్స్‌ కెప్టెన్‌గా తొలి వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. క్రీజ్‌లో నిలదొక్కుకున్న హమీద్‌ను కూడా పెవిలియన్‌కు చేర్చాడు. 60 పరుగులకే సగం వికెట్లను కోల్పోయిన ఇంగ్లాండ్‌ను జోస్‌ బట్లర్‌ (39), ఓలీ పోప్ (35) ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి అర్ధశతక (52) భాగస్వామ్యం నిర్మించారు. అయితే మళ్లీ ఆసీస్‌ బౌలర్లు విజృంభించడంతో ఇంగ్లాండ్‌ బ్యాటర్లు వరుసగా క్యూ కట్టారు. ఆఖర్లో క్రిస్‌ వోక్స్‌ 21, మార్క్‌వుడ్‌ 8 పరుగులు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని