SA vs BAN: విజృంభిస్తున్న సౌతాఫ్రికా బౌలర్లు.. ఘోర ఓటమి దిశగా బంగ్లాదేశ్

ప్రపంచకప్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఘోర పరాజయం దిశగా సాగుతోంది.

Updated : 24 Oct 2023 20:06 IST

ముంబయి: ప్రపంచకప్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఘోర పరాజయం దిశగా సాగుతోంది. సఫారీలు నిర్దేశించిన 383 పరుగుల లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ కనీస పోరాటం కూడా చేయట్లేదు. సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్‌.. 18 ఓవర్లు ముగిసేసరికి ఐదు వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది. లిట్టన్ దాస్ (22), తాంజిద్ హసన్ (12) పరుగులు చేయగా.. నజ్ముల్ శాంటో (0) ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరిగాడు. షకీబ్ అల్ హసన్ (1), ముష్పీకర్ రహీమ్ (8) సింగిల్ డిజిట్‌ స్కోరుకే పరిమితమయ్యారు. ప్రస్తుతం మహ్మదుల్లా (12*), మెహదీ హసన్ మిరాజ్ (2*) క్రీజులో ఉన్నారు.

లక్ష్యఛేదనలో బంగ్లా మొదటి ఆరు ఓవర్లు నిలకడగానే ఆడింది. అప్పటికి వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. మార్కో జాన్సన్‌ వేసిన ఏడో ఓవర్‌ నుంచి బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ గాడితప్పింది. జాన్సన్‌ వరుస బంతుల్లో తాంజిద్‌ హసన్‌, శాంటోలను పెవిలియన్‌కు పంపాడు. వీరిద్దరూ వికెట్ కీపర్ క్లాసెన్‌కు క్యాచ్‌ ఇచ్చారు.  తర్వాత వచ్చిన షకీబ్‌ను పేసర్ లిజాడ్ విలియమ్స్ ఔట్‌ చేశాడు. అతడు కూడా క్లాసెన్‌కే క్యాచ్‌ ఇచ్చాడు. కొద్దిసేపటికే ముష్పీకర్‌ను కొయిట్జీ వెనక్కి పంపాడు. నిలకడగా ఆడిన ఓపెనర్ లిట్టన్ దాస్‌ను రబాడ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని