U19 Asia Cup: సెమీస్‌లో వెనుదిరిగిన భారత్‌.. ఫైనల్‌లో బంగ్లా-యూఏఈ

U19 ఆసియాకప్‌ టోర్నీలో భాగంగా జరిగిన రెండు సెమీఫైనల్‌ మ్యాచుల్లో భారత్‌, పాక్‌ ఓటమి పాలయ్యాయి. బంగ్లాదేశ్‌, యూఏఈ ఫైనల్‌లో తలపడనున్నాయి.

Published : 15 Dec 2023 19:12 IST

దుబాయ్‌: U19 ఆసియాకప్‌ టోర్నీ (U19 Asia Cup) నుంచి భారత్‌ వైదొలిగింది. దుబాయ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఓటమి చవి చూసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన యువభారత్‌ 42.4 ఓవర్లలో 188 పరుగులు చేసి ఆలౌటయ్యింది. మురుగన్‌ అభిషేక్‌ (62; 73 బంతుల్లో 6×4,2×6) ముషీర్‌ ఖాన్‌ (50; 62 బంతుల్లో 3×4) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌ కేవలం 42.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అరిఫుల్‌ ఇస్లామ్‌ (94; 9×4,4×6) విజృంభించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆహర్‌ అమిన్‌ (44) పరుగులు చేశాడు.

పాక్‌ పరాజయం

మరోవైపు పాకిస్థాన్‌తో జరిగిన రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో యూఏఈ 11 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌లో అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన యూఏఈ 47.5 ఓవర్లలో 193 పరుగులు చేసి ఆలౌటయ్యింది. ఆర్యన్‌ ఖాన్‌ (55), ఆర్యాన్ష్‌ శర్మ (46) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్థాన్‌ కేవలం 49.3 ఓవర్లు ఆడి 182 పరుగులకు ఆలౌటయ్యింది. సాద్‌ బయాగ్‌ (50), అజన్‌ అవాయిస్‌ (41) మినహా మిగతా వారెవ్వరూ పెద్దగా రాణించలేదు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఓటమి ఎరుగని పాకిస్థాన్‌ సెమీస్‌లో పరాజయంపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఫైనల్‌కు చేరిన బంగ్లాదేశ్‌, యూఏఈలు ఆదివారం తలపడనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని