Cheteshwar Pujara: రంజీ ట్రోఫీలో పుజారా డబుల్ సెంచరీ.. టీమ్ఇండియాలోకి రీ ఎంట్రీ?

టీమ్‌ఇండియా వెటరన్ బ్యాటర్‌ ఛెతేశ్వర్‌ పుజారా (Cheteshwar Pujara) రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. ఝార్ఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో డబుల్ సెంచరీ బాదాడు.

Published : 07 Jan 2024 18:45 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా (Team India) టెస్టు స్పెషలిస్టు, వెటరన్ బ్యాటర్‌ ఛెతేశ్వర్‌ పుజారా (Cheteshwar Pujara) గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో పుజారా నిరాశపరిచాడు. కీలకమైన మ్యాచ్‌లో విఫలమవడంతో తర్వాత వెస్టిండీస్‌, సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లకు అతడిని పక్కన పెట్టారు. తిరిగి ఎలాగైనా జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్న ఈ సౌరాష్ట్ర ఆటగాడు రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. ఝార్ఖండ్‌తో జరుగుతున్న ఎలైట్‌ గ్రూప్‌ ఏ మ్యాచ్‌లో పుజారా (243*; 356 బంతుల్లో 30 ఫోర్లు) డబుల్ సెంచరీ బాది అజేయంగా నిలిచాడు. ప్రేరక్‌ మన్కడ్ (104*; 176 బంతుల్లో) సెంచరీ చేశాడు. 406/4 స్కోరుతో మూడో రోజు, ఆదివారం ఆటను ప్రారంభించిన సౌరాష్ట్ర.. 578/4 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసి 436 పరుగుల ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఝార్ఖండ్‌ 142కే ఆలౌటైంది. 

సెలక్టర్లు ఏం చేస్తారో?

జనవరి 25 నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ ప్రారంభంకానుంది. ఇంగ్లాండ్ ఇప్పటికే తమ జట్టును ప్రకటింది. అగార్కర్‌ సారథ్యంలోని సెలక్షన్‌ కమిటీ త్వరలోనే భారత జట్టును ప్రకటించనుంది. ఝార్ఖండ్‌పై డబుల్ సెంచరీ బాదిన పుజారా సెలక్టర్లకు రేసులో తాను కూడా ఉన్నానని చెప్పకనే చెప్పాడు. అతడిని జట్టులోకి తీసుకోవడంపై సెలక్షన్‌ కమిటీలో కచ్చితంగా చర్చ జరిగే ఛాన్స్‌ ఉంది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు దూరంగా ఉన్న వెటరన్ ఆటగాడు అజింక్య రహానెను కూడా ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేస్తారని వార్తలొస్తున్నాయి. మరి వీరిద్దరికి అవకాశం కల్పిస్తారా? లేదా భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని కొత్త ఆటగాళ్లను కొనసాగిస్తారా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని