Cheteshwar Pujara: విండీస్‌ టూర్‌లో దక్కని చోటు.. ట్విటర్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టిన పుజారా

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంపై ఛెతేశ్వర్‌ పుజారా (Cheteshwar Pujara) ఎమోషనల్ అయ్యాడు.

Published : 25 Jun 2023 01:47 IST

ఇంటర్నెట్ డెస్క్: టెస్టుల్లో స్టార్ బ్యాటర్‌గా పేరొందిన ఛెతేశ్వర్‌ పుజారాకు టీమ్ఇండియా సెలెక్టర్లు షాకిచ్చారు. త్వరలో వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు అతడిని ఎంపిక చేయలేదు. పుజారా కొన్నేళ్లుగా నిలకడగా రాణించలేకపోతున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లోనూ విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 14, 27 పరుగులే చేశాడు. పుజారాను జట్టు నుంచి తప్పించడాన్ని పలువురు మాజీలు తప్పుబట్టారు. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంపై ఛెతేశ్వర్‌ పుజారా ఎమోషనల్ అయ్యాడు. క్రికెట్ అంటే తనకెంతో ఇష్టమని తెలియజేస్తూ మైదానంలో ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోను పోస్ట్ చేస్తూ ‘‘🏏 ❤️’’ ఎమోజీలను పోస్ట్ చేశాడు.

బుమ్రా విషయంలో తొందరొద్దు: రవిశాస్త్రి

వెన్ను నొప్పితో గతేడాది సెప్టెంబర్‌ నుంచి ఆటకు దూరంగా ఉన్న టీమ్‌ఇండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఆగస్టులో ఐర్లాండ్‌ పర్యటనలో జట్టుతో చేరతాడని వార్తలొస్తున్నాయి. ఈ ఏడాది జరిగే కీలకమైన ఆసియా కప్‌, వన్డే ప్రపంచకప్‌లకు బుమ్రాను సిద్ధం చేయడం కోసం ఐర్లాండ్‌ సిరీస్‌లో ఆడించాలని టీమ్ఇండియా మేనేజ్‌మెంట్‌ భావిస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలో బుమ్రాను ఆడించే విషయంలో హడావుడి నిర్ణయాలు తీసుకోవద్దని భారత మాజీ కోచ్‌ రవిశాస్త్రి బీసీసీఐకి సూచించాడు. అతడి విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకుంటే టీమ్‌ఇండియా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించాడు. పాకిస్థాన్‌ ప్రధాన పేసర్ షాహీన్ అఫ్రిది విషయంలో పీసీబీ ఇలానే తొందరపడిందని, దీంతో అతడు నాలుగు నెలలపాటు జాతీయ జట్టుకు దూరమయ్యాడని రవిశాస్త్రి గుర్తు చేశాడు. బుమ్రాను ఎక్కువ మ్యాచ్‌ల్లో ఆడిస్తే భారత్‌ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొవాల్సి వస్తుందని చెప్పాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని