Cricket News: సీఎస్‌కేకు కొత్త స్పాన్సర్.. బుమ్రాపై స్టెయిన్‌ ప్రశంసలు

చెన్నై సూపర్ కింగ్స్‌కు కొత్త స్పాన్సర్ వచ్చేసింది.. ఇంతకీ ఎవరా స్పాన్సర్‌? టీమ్‌ఇండియా ఫాస్ట్‌ బౌలర్‌ బుమ్రాపై స్టెయిన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇలాంటి క్రికెట్‌ వార్తల సమాహారం.. మీకోసం

Published : 10 Feb 2024 13:15 IST

ఇంటర్నెట్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్‌కు కొత్త స్పాన్సర్ వచ్చేసింది.. టీమ్‌ఇండియా ఫాస్ట్‌ బౌలర్‌పై దక్షిణాఫ్రికా మాజీ పేసర్ ప్రశంసల వర్షం.. జో రూట్‌కు బజ్‌బాల్ క్రికెట్‌ అవసరం లేదన్న ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్.. ఇలాంటి క్రికెట్ విశేషాలు మీ కోసం.. 

కొత్త స్పాన్సర్‌తో నంబర్‌ ‘7’ జెర్సీ..

మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2024 ఎడిషన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్ కింగ్స్‌కు కొత్త స్పాన్సర్‌ వచ్చింది. ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌తో సీఎస్‌కే యాజమాన్యం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ ‘7’వ నంబర్‌ జెర్సీని ఫ్రాంచైజీ విడుదల చేసింది. ధోనీ ఇప్పటికే తన ప్రాక్టీస్‌ను ప్రారంభించాడు. గతేడాది సీజన్‌ తర్వాత మోకాలికి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. ఐదుసార్లు సీఎస్‌కేను ఛాంపియన్‌గా నిలిపిన ధోనీ.. ముంబయి మాజీ కెప్టెన్ రోహిత్‌తో సమంగా నిలిచాడు.


యార్కర్లతో బుమ్రా అదరగొట్టాడు: డేల్ స్టెయిన్‌

ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టుల్లో తన పేస్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన జస్‌ప్రీత్ బుమ్రాపై దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు డేల్‌ స్టెయిన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ‘‘టెస్టుల్లో యార్కర్లతో వికెట్లను తీయగల సత్తా ఉన్నవారు చాలా తక్కువ. అందులో బుమ్రా ముందుంటాడు. ట్రెంట్ బౌల్ట్‌, మిచెల్ స్టార్క్‌ ఇలా వికెట్లను తీస్తుంటారు. బుమ్రా వారందరి కంటే భిన్నం. పిచ్‌ పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ వికెట్లను రాబట్టడం అద్భుతం. ప్రస్తుతం భారత పేస్ దళం బలంగా ఉంది. ఇదే సమయంలో వారిపై వర్క్‌లోడ్‌ ఎక్కువగా లేకుండా చూడాల్సిన బాధ్యత బీసీసీఐదే. బుమ్రాను మాత్రం కొనసాగించాలి. అతడిని పక్కన పెడితే భారత్‌కు నష్టమే’’ అని స్టెయిన్‌ పేర్కొన్నాడు. విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టులో పిచ్‌ నుంచి పెద్దగా సహకారం లేకపోయినా 9 వికెట్లు తీసి భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అతడే ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.


బజ్‌బాల్‌ క్రికెట్‌ రూట్‌కు అవసరం లేదు: మైకెల్ వాన్

భారత్‌తో టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్‌ బ్యాటర్‌గా పెద్దగా ప్రభావం చూపించలేదు. పర్యటక జట్టు ‘బజ్‌బాల్’ క్రికెట్ విధానాన్ని జో రూట్ అందుకోలేకపోతున్నాడనే విమర్శలు వచ్చాయి. మాజీ కెప్టెన్ మైకెల్‌ వాన్‌ మాత్రం రూట్‌ను వెనుకేసుకొచ్చాడు. ‘‘ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు తొలి బంతి నుంచే ఐదో గేర్‌లో బ్యాటింగ్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరు దానికి సరిగ్గా సరిపోతున్నారు. జో రూట్‌ మాత్రం ఆ బజ్‌బాల్‌ క్రికెట్‌ను మరిచిపోవాలి. అతడి సహజ ఆటతీరును ప్రదర్శిస్తూనే టెస్టుల్లో 10 వేల పరుగులు చేశాడు. అందుకే, రూట్‌కు బజ్‌బాల్‌ క్రికెట్ అవసరం లేదు. ఇప్పటికైనా జట్టు మేనేజ్‌మెంట్‌లో ఎవరో ఒకరు రూట్‌ను తన ఆటను ఆడాలని చెప్పాలి’’ అని మైకెల్ వాన్‌ వ్యాఖ్యానించాడు. తొలి రెండు టెస్టుల్లోని నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి రూట్‌ కేవలం 52 పరుగులు మాత్రమే చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని