David Warner: నా టెస్టు కెరీర్‌పై సెహ్వాగ్‌ అప్పుడే జోస్యం చెప్పాడు: వార్నర్‌

భారత టీ20 లీగ్‌లో హైదరాబాద్‌కు చాలాకాలంపాటు ప్రాతినిధ్యం వహించిన డేవిడ్‌ వార్నర్‌.. ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తోనూ ప్రాచుర్యం పొందాడు. తాజాగా వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి ఆడినప్పుడు జరిగిన సంఘటనను గుర్తు చేసుకొన్నాడు.

Published : 01 Oct 2022 02:16 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. భారత టీ20 లీగ్‌లో హైదరాబాద్‌కు చాలాకాలంపాటు ప్రాతినిధ్యం వహించిన వార్నర్‌.. ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తోనూ ప్రాచుర్యం పొందాడు. తెలుగు, హిందీ పాటలు, డైలాగులకు తనదైన హావభావాలను జోడించి ఆకట్టుకున్నాడు. గత టీ20 ప్రపంచకప్‌లో అనూహ్యంగా చెలరేగిన డేవిడ్ వార్నర్‌.. ఆసీస్‌కు తొలి పొట్టి కప్‌ను అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడకుండా టెస్టుల్లోకి అడుగు పెట్టడం అప్పట్లో చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆస్ట్రేలియా క్రికెట్‌ చరిత్రలో డొమిస్టిక్‌ క్రికెట్‌లో అడుగు పెట్టకుండా టెస్టు జట్టుకు ఎంపికైన తొలి ఆటగాడిగా డేవిడ్ వార్నర్‌ రికార్డు సొంతం చేసుకున్నాడు. తాజాగా వార్నర్ తన క్రికెట్ ప్రయాణం గురించి మాట్లాడుతూ.. వీరేంద్ర సెహ్వాగ్‌ వ్యాఖ్యలను గుర్తు చేసుకొన్నాడు. 

‘‘భారత టీ20 లీగ్‌లో దిల్లీ తరఫున సెహ్వాగ్‌తో కలిసి ఆడాను. అప్పుడే నాలోని టెస్టు ఆటగాడిని గుర్తించాడు. భవిష్యత్తులో మంచి టెస్టు ప్లేయర్‌గా రాణిస్తానని అప్పుడే చెప్పాడు. ‘టీ20 ప్లేయర్‌గా కంటే సుదీర్ఘ ఫార్మాట్‌లో ఉత్తమ బ్యాటర్‌గా మారతావు’ అని సెహ్వాగ్ అన్నాడు. దానికి నేను సమాధానంగా ‘నేను ఇంత వరకు ఒక్క ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ కూడా ఆడలేదు’’ అని అనడంతో.. ‘‘ఫీల్డర్లు దగ్గరగా ఉన్నా సరే నీదైన శైలిలో బంతిని ఆడతావు. పరుగులు రాబట్టేందుకు అవకాశాలను సృష్టిస్తావు. అలాగే మంచి బాల్‌ను గౌరవించి.. చెత్త బంతిని బాదేయగల సామర్థ్యం ఉంది’ అని సెహ్వాగ్‌ నా గురించి చెప్పడంతో ఆశ్చర్యపోయా. ఇప్పుడు సెహ్వాగ్ జోస్యం నిజమైనట్లు అనిపిస్తోంది’’ అని డేవిడ్‌ వార్నర్‌ ఆనాటి సంఘటనను వివరించాడు. ఇప్పటివరకు డేవిడ్ వార్నర్ ఆసీస్ తరఫున 96 టెస్టులు, 138 వన్డేలు, 91 టీ20లు ఆడి మొత్తం 15వేలకు పైగా పరుగులు సాధించాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని