Virat - Dravid: విరాట్ ఘనత వెనుక కష్టం ఎవరికీ తెలియదు: ద్రవిడ్

వెస్టిండీస్‌తో టెస్టు (WI vs IND) సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌ ఇవాళ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో భారత ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పలు విషయాలపై స్పందించాడు.

Published : 20 Jul 2023 14:03 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వెస్టిండీస్‌తో భారత్ (WI vs IND) 100వ టెస్టు.. విరాట్ కోహ్లీ 500వ అంతర్జాతీయ మ్యాచ్‌ ఒకేసారి కలిసి రావడం విశేషం. ఇప్పటికే రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ట్రినిడాడ్‌ వేదికగా జరగనున్న రెండో టెస్టులోనూ ఘనవిజయం సాధించాలనే లక్ష్యంతో టీమ్‌ఇండియా (Team India) బరిలోకి దిగనుంది. ఈ క్రమంలో భారత ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) కీలక విషయాలపై మాట్లాడుతూ..

ఎందరికో ఆదర్శం..

‘‘విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇప్పుడున్న చాలా మంది యువ క్రికెటర్లకు ఆదర్శం. చరిత్ర పుటల్లో అతడి రికార్డులు, గణాంకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఇంతటి ఘనత సాధించడానికి కోహ్లీ పడిన శ్రమ, కష్టం ఎవరికీ తెలియదు. ఆ శ్రమే అతడిని 500 మ్యాచ్‌లు ఆడేలా చేసింది. ఇప్పటికీ యువకులతో పోటీపడేలా ఉన్న అతడి ఫిట్‌నెస్ స్థాయి అమోఘం. ఈ స్థాయికి చేరుకొనేందుకు ఎన్నో త్యాగాలు చేశాడు. విరాట్ కోహ్లీ క్రికెట్‌ ప్రయాణం చూస్తేనే ఉన్నా. గత 18 నెలల్లో అనేక ఇబ్బందులను ఎదుర్కొని మరీ నిలదొక్కుకున్నాడు. వ్యక్తిగతంగా చాలా విషయాలను అతడి నుంచి నేర్చుకున్నా’’ 

జట్టులో మార్పులు సహజం.. సీనియర్ల పాత్ర చాలా కీలకం

కుర్రాళ్లు సూపర్.. 

‘‘మన దేశవాళీ క్రికెట్‌ గొప్పతనం గురించి చెప్పాలి. దాని వల్లే అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రతిభావంతులు వస్తున్నారు. విండీస్‌తో తొలి టెస్టులో యశస్వి జైస్వాల్ అదరగొట్టాడు. శుభ్‌మన్‌ గిల్ కూడా గత ఆరేడు నెలలుగా మెరుగ్గా ఆడుతున్నాడు.  ఇషాన్‌ కిషన్‌కు బ్యాటింగ్‌లో పెద్దగా అవకాశాలు రాకపోయినా.. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కుర్రాళ్లు ఒక్కసారి గాడిన పడితే ఆటోమేటిక్‌గా పరుగులు సాధిస్తారు’’ 

వందో టెస్టు.. 

‘‘వెస్టిండీస్‌తో భారత్ వందో టెస్టు మ్యాచ్‌ ఆడనుండటం ఆనందంగా ఉంది. ఇరుదేశాల్లోనూ క్రికెట్‌కు విపరీతమైన ఆదరణ ఉంది. విండీస్‌ దిగ్గజ క్రికెటర్లను చూస్తూ నేను పెరిగా. కొంతమంది సూపర్‌స్టార్‌ ఆటగాళ్లు ఈ వంద టెస్టుల్లో అద్భుతమైన క్రికెట్ ఆడారు.  విండీస్‌-భారత్‌ క్రికెట్‌కు ఇదొక ప్రత్యేక సందర్భం. అయితే, ఈ మ్యాచ్‌లోనూ విజయమే లక్ష్యంగా ఆడతాం. 1983లో విండీస్‌ను భారత్ ఓడించిన తర్వాత దేశవాళీ క్రికెట్‌లో పెను మార్పులొచ్చాయి. భారత క్రికెట్‌కు అదొక మైలురాయి. అప్పుడు నేను పదేళ్ల పిల్లాడిని’’ 

ఆసియా కప్‌ షెడ్యూల్‌పై.. 

‘‘వన్డే ప్రపంచకప్‌ మెగా టోర్నీకి ముందు ఆసియా కప్‌ రానుంది. ఇప్పటికే షెడ్యూల్‌ను ప్రకటించారు. మంచి సన్నద్ధత లభించినట్లు అవుతుంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తోనే (IND vs PAK) తలపడనున్నాం. ఆ తర్వాత నేపాల్‌తో ఆడాలి. సూపర్-4లో పాకిస్థాన్‌తో మళ్లీ తలపడే అవకాశం ఉంటుంది. ఫైనల్‌కు వస్తే మూడోసారి కూడా ఆడొచ్చు. ఇలా ఒకే టోర్నీలో మూడుసార్లు పాక్‌తో తలపడే అవకాశం వస్తే అద్భుతమనే చెప్పాలి. ఇక మా కుర్రాళ్లు కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు’’ అని పేర్కొన్నారు. ద్రవిడ్‌ మాట్లాడిన ఈ వీడియోను బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని