IND vs ENG: భారత్ ‘B’ జట్టు చేతిలో ఇంగ్లాండ్‌ ఓడిపోవడం బాగుంది: ఆసీస్‌ మాజీ కెప్టెన్

ఇంగ్లాండ్‌పై (IND vs ENG) ఐదు టెస్టుల సిరీస్‌ను ఇప్పటికే కైవసం చేసుకున్న టీమ్‌ఇండియా.. చివరి మ్యాచ్‌లోనూ విజయం దిశగా సాగుతోంది. 

Published : 09 Mar 2024 10:42 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్‌ జట్టు ఓడిపోవడాన్ని ఎంతో ఇష్టపడతానని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ టిమ్‌ పైన్‌ వ్యాఖ్యానించాడు. భారత్‌తో జరుగుతున్న (IND vs ENG) ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లిష్‌ జట్టు ఇప్పటికే 3-1 తేడాతో వెనుకబడిన సంగతి తెలిసిందే. సిరీస్‌ను కోల్పోయిన ఇంగ్లాండ్‌ చివరి టెస్టులోనూ పోరాడుతోంది. ఈ క్రమంలో ఆసీస్ మాజీ సారథి కీలక వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. అదే సమయంలో ఇంగ్లాండ్‌తో బరిలోకి దిగిన భారత్‌ జట్టును ‘B’ టీమ్‌గా అభివర్ణించడం గమనార్హం. సైమన్ కటిచ్‌తో కలిసి ఓ చర్చా కార్యక్రమంలో టిమ్‌ పాల్గొన్నాడు. 

‘‘ఇంగ్లాండ్‌ జట్టు భారత పర్యటనలో ‘B’ జట్టుతో తలపడుతోంది. ఈ మాట అనడానికి కారణం ఉంది. ప్రస్తుతం ఉన్న జట్టులో విరాట్ కోహ్లీ లేడు. షమీ లేడు. కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్, పుజారా, రహానె లేరు. బుమ్రా, రవీంద్ర జడేజా మధ్యలో విశ్రాంతి తీసుకున్నారు. అత్యంత బలమైన జట్టు బరిలోకి దిగలేదు. అయితే, భారత్‌లో అద్భుతమైన క్రికెటర్లకు కొదవలేదని నిరూపితమైంది. భవిష్యత్తులో స్టార్లుగా ఎదిగే సత్తా ఉన్న ప్లేయర్లు వెలుగులోకి వచ్చారు. యశస్వి జైస్వాల్ జట్టును ముందుండి నడిపించడం అభినందనీయం. ధ్రువ్‌ జురెల్‌, సర్ఫరాజ్‌ కూడా అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. కాబట్టి, భారత జట్టు ఇప్పుడు కూడా పటిష్ఠంగానే ఉంది’’ అని సైమన్‌ కటిచ్‌ వ్యాఖ్యానించాడు. 

గతంలో ఆసీస్‌కూ పరాభవం తప్పలేదు..

‘‘2018-19 సీజన్‌లో ఆసీస్‌కూ భారత్‌ చేతిలో ఓటమి ఎదురైంది. అప్పుడు కూడా టీమ్‌ఇండియా స్టార్‌ ప్లేయర్లు లేకుండానే బరిలోకి దిగింది. మా సొంతగడ్డపై భారత్ ‘B’ జట్టు చేతిలో మేం ఓడాం. ఇప్పుడు కూడా ఇంగ్లాండ్‌ పరిస్థితి ఇలానే ఉంది. కొంతమంది పెద్ద ప్లేయర్లు లేని భారత్‌ అద్భుతంగా ఆడుతోంది. ఇంగ్లాండ్‌ ఇలా ఓడిపోవడాన్ని చూడటం నాకెంతో ఇష్టం. దీనిపై తప్పుబట్టొద్దు. ఇప్పటికీ ఇంగ్లాండ్‌ క్రికెట్ జట్టు ఆటపరంగా అభిమానులను అలరిస్తోంది’’ అని పైన్‌ తెలిపాడు. 

ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగుల ఆధిక్యం సాధించింది. మొదటి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 477 పరుగులకు ఆలౌటైంది. షోయబ్‌ బషీర్‌ 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. రెండు వికెట్లు తీసిన అండర్సన్ 700 వికెట్ల క్లబ్‌లో చేరాడు. అంతకుముందు ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకే కుప్పకూలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని