IND vs AUS: ఆస్ట్రేలియా జట్టులో కంగారు మొదలైంది..: మహమ్మద్ కైఫ్‌

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌ (WTC) ఫైనల్‌కు చేరుకొనేందుకు భారత్ - ఆసీస్ (IND vs AUS) నాలుగు టెస్టుల సిరీస్‌ను ఆడేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Published : 04 Feb 2023 10:51 IST

ఇంటర్నెట్ డెస్క్: నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 9వ తేదీ నుంచి భారత్‌ - ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్‌ (Test Match) ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్యాట్ కమిన్స్‌ నాయకత్వంలోని ఆసీస్‌ తమ ప్రాక్టీస్‌ను మొదలెట్టేసింది. భారత స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా (Australia) బ్యాటర్లు తెగ కష్టపడిపోతున్నారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC) ఫైనల్‌కు చేరుకోవడానికి ఇరు జట్లకూ ఇది కీలకమైన టెస్టు సిరీస్‌ కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఆసీస్‌ మాజీలు, ప్రస్తుత ఆటగాళ్లు తమ మాటల యుద్ధం ప్రారంభించారు. ఇక్కడి పిచ్‌లతో పాటు, వార్మప్‌ మ్యాచ్‌పైనా వ్యాఖ్యలు చేశారు. దీనికి భారత్ నుంచి అశ్విన్‌ ఘాటుగానే స్పందించాడు. ఇప్పుడు టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ (Mohammad Kaif) కూడా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. కంగారూల జట్టులో కంగారు మొదలైందని పేర్కొన్నాడు.

‘‘భారత్‌ పర్యటనకు ఆస్ట్రేలియా 18 మంది ఆటగాళ్లతో వచ్చింది.  వారు చాలా ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే ఇంతకు ముందెప్పుడూ 18 మంది ఆటగాళ్లతో ఆసీస్‌ భారత్‌లో పర్యటించలేదు. సొంతగడ్డపై భారత్‌ (Team India) చాలా పటిష్టమైన జట్టు అని ఆసీస్‌కు తెలుసు. టీమ్ఇండియాను ఓడించడం చాలా కష్టం. గబ్బా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ లేడు. అయినా భారత్‌ విజయం సాధించింది. ఇప్పుడు విరాట్ (Virat Kohli) ఉన్నాడు. ఆసీస్‌ కూడా బలంగానే ఉన్నప్పటికీ.. భారత్‌ను ఇక్కడ ఓడించడం సులువైన విషయం కాదు. అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్‌ యాదవ్‌ను ఆసీస్‌ అడ్డుకోగలిగితే మంచి పోరు అవుతుంది’’ అని మహమ్మద్ కైఫ్ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని