ధోనీ సిక్స్‌ ముందు.. యువీ కనుమరుగు 

2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ధోనీ కొట్టిన సిక్సరే ప్రజలు గుర్తించుకుంటారని.. ఆ టోర్నీలో ఆల్‌రౌండర్‌గా గొప్ప ప్రదర్శన చేసిన యువరాజ్‌ను ఎవరూ పట్టించుకోరని నాటి బ్యాట్స్‌మన్‌...

Published : 02 Apr 2021 14:04 IST

2011 వన్డే ప్రపంచకప్‌పై గంభీర్‌ స్పందన..

ఇంటర్నెట్‌డెస్క్‌: 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ధోనీ కొట్టిన సిక్సర్నే ప్రజలు గుర్తించుకుంటారని.. ఆ టోర్నీలో ఆల్‌రౌండర్‌గా గొప్ప ప్రదర్శన చేసిన యువరాజ్‌ను ఎవరూ పట్టించుకోరని నాటి బ్యాట్స్‌మన్‌ గౌతమ్‌ గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. శ్రీలంకపై ధోనీసేన ఆ ప్రపంచకప్‌ సాధించి నేటికి పదేళ్లు పూర్తైన సందర్భంలో గంభీర్‌ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టులో చాలా మంది అద్భుతంగా ఆడారు కానీ ఎవరికీ సరైన గుర్తింపు దక్కలేదని ఈ మాజీ క్రికెటర్‌ పేర్కొన్నాడు.

‘ఆ విజయంలో చాలా మందికి తగిన గుర్తింపు రాలేదు. మునాఫ్‌, హర్భజన్‌, నేను, కోహ్లీ, రైనా, యువీ ఇలా ఒక్కొక్కరు ఒక్కోసారి రాణించారు. అందరూ బాగా కష్టపడ్డారు. ఆ చారిత్రక విజయాన్ని ఇప్పుడు గుర్తుచేసుకుంటే యువరాజ్‌కు సరైన గుర్తింపు దక్కలేదని నా అభిప్రాయం. యువీ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’గా ఎంపికైనా తన గురించి ఎవరూ మాట్లాడరు. కానీ కచ్చితంగా ఫైనల్లో ధోనీ కొట్టిన చివరి సిక్సర్‌ గురించి చర్చిస్తారు’ అని గంభీర్‌ వ్యాఖ్యానించాడు. కాగా, ఆ మ్యాచ్‌లో శ్రీలంక నిర్దేశించిన 275 పరుగుల లక్ష్యాన్ని టీమ్‌ఇండియా 48.2 ఓవర్లలో ఛేదించింది. సెహ్వాగ్‌(0), తెందూల్కర్‌(18) విఫలమైనా.. గంభీర్(97), కోహ్లీ(35), ధోనీ(91*), యువీ(21*) నిలకడగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. చివరికి నువాన్‌ కులశేఖర బౌలింగ్‌లో ధోనీ సిక్సర్‌ బాది మ్యాచ్‌ను ముగించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని