MSD - Rohit Sharma: ఎంఎస్ ధోనీ వల్లే.. అక్కడ రోహిత్ సక్సెస్‌: గౌతమ్‌ గంభీర్‌

రోహిత్ శర్మ (Rohit Sharma) విజయవంతమైన బ్యాటర్‌గా, కెప్టెన్‌గా మారడంలో ఎంఎస్ ధోనీదే కీలక పాత్ర  అని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ వ్యాఖ్యానించాడు.

Published : 13 Sep 2023 13:56 IST

ఇంటర్నెట్ డెస్క్: కెరీర్‌ ఆరంభంలో మిడిలార్డర్‌లో ఆడిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కొన్ని సంవత్సరాలకే ఓపెనర్‌గా మారాడు. తాజాగా వన్డేల్లో 10వేలకుపైగా పరుగులు చేసిన జాబితాలోకి చేరిన రోహిత్.. గతంలోనే ఓపెనర్‌గా వస్తూ అత్యంత వేగంగా 8వేలకుపైగా పరుగులు చేసిన బ్యాటర్‌గా అవతరించాడు. రోహిత్ 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టినప్పటికీ.. జట్టులో స్థానం సంపాదించడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే, అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) చొరవతో రోహిత్ ఓపెనర్‌గా మారిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదని మాజీ ఓపెనర్ గౌతమ్‌ గంభీర్‌ (Gautham Gambhir) వ్యాఖ్యానించాడు. రోహిత్‌ను ఓపెనర్‌గా ధోనీ ప్రమోట్‌ చేసి మద్దతుగా నిలవడంతోనే అతడి కెరీర్‌ ఉన్నత స్థాయికి వెళ్లిందని పేర్కొన్నాడు.

‘‘వన్డేల్లో పదివేలకుపైగా పరుగులు చేయడమంటే సులువేం కాదు. కెరీర్‌లో ఎత్తుపల్లాలను అనుభవించి ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ప్రస్తుతం రోహిత్‌ కెప్టెన్‌గా యువ క్రికెటర్లకు మద్దతుగా ఉండటం చూస్తున్నాం. ఇప్పుడు రోహిత్ శర్మ ఇలా ఉండటానికి ప్రధాన కారణం మాత్రం ఎంఎస్ ధోనీ. ఎందుకంటే ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు యువ క్రికెటర్లకు మద్దతు ఇచ్చేవాడు. మరీ ముఖ్యంగా రోహిత్‌ తన కెరీర్‌ ఆరంభంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అలాంటి సమయంలో ఎంఎస్ ధోనీ అండగా నిలిచి అవకాశాలు ఇచ్చాడు. ఇప్పుడు రోహిత్ కూడా తన జూనియర్ల విషయంలోనూ అలానే ఉండాలి. 

రోహిత్‌ను తొలిసారి దేశవాళీ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా కలిశా. మా జట్టుకు ప్రత్యర్థిగా బరిలోకి దిగాడు. మేం 350 పరుగుల వరకు చేశాం. రోహిత్ శర్మ ఐదో స్థానంలో వచ్చి 130 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. అప్పుడే నేను వసీమ్ జాఫర్‌ను ఎవరు అతడు? అని అడిగా. అప్పటి నుంచే ఇతడిలో ఏదో ప్రత్యేకత ఉందనిపించింది’’ అని గంభీర్‌ తెలిపాడు. భారత్‌ తరఫున పది వేల పరుగుల క్లబ్‌లో చేరిన ఆరో బ్యాటర్‌ రోహిత్ శర్మ కావడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని