IPL: హామీ ఇస్తున్నా.. అప్పటిలోపు కేకేఆర్‌ను బెటర్ పొజిషన్‌లో ఉంచుతా: గంభీర్‌

ఈ సీజన్‌ నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)కు  గౌతమ్‌ గంభీర్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. తన పదవీకాలం ముగిసే సమయానికి కేకేఆర్‌ని మెరుగైన స్థితిలో ఉంచుతానని గంభీర్‌ విశ్వాసం వ్యక్తం చేశాడు.

Published : 19 Mar 2024 15:18 IST

ఇంటర్నెట్ డెస్క్: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkata Knight Riders) అనగానే మొదట గుర్తొచ్చే పేరు గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir). టోర్నీ ఆరంభంలో కేకేఆర్‌ అంతగా ఆకట్టుకోలేదు. గౌతమ్‌ వచ్చాక ఆ జట్టు దశ తిరిగింది. అతని సారథ్యంలో కెప్టెన్‌గా రెండు టైటిళ్లు (2012, 2014) అందించాడు. తర్వాత అతడు కేకేఆర్‌ను వీడటంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. 2021 ఫైనల్‌లో చేరినా ఛాంపియన్‌గా నిలవలేకపోయింది. ఇప్పుడు గౌతమ్‌గంభీర్‌ తిరిగి కేకేఆర్‌ గూటికి చేరుకున్నాడు. ఈసారి మార్గనిర్దేశకుడి పాత్ర పోషించనున్నాడు. ఐపీఎల్‌ (IPL) 2024 సీజన్‌ ముంగిట ప్రమోషన్‌ ఈవెంట్‌లో గంభీర్‌ మాట్లాడాడు. తన పదవీకాలం ముగిసేసరికి కోల్‌కతా నైట్ రైడర్స్‌ని మెరుగైన స్థితిలో ఉంచుతానని విశ్వాసం వ్యక్తం చేశాడు. మార్చి 23న ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కేకేఆర్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది.

‘‘నేను కేకేఆర్‌ని విడిచి వెళ్లే సమయానికి మేం మరింత మెరుగైన స్థితిలో ఉంటామని మీకు హామీ ఇస్తున్నాను. నేను ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. నేను కేకేఆర్‌ని విజయపథంలో నడిపించలేదు. నన్నే కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సక్సెస్‌ చేసింది. లీడర్‌గా మార్చింది. నాతో డీల్‌ చేయడం చాలా కష్టం. ఇన్నాళ్లుగా నన్ను భరిస్తున్నందుకు షారూక్‌ ఖాన్‌ (కేకేఆర్‌ యజమాని), వెంకీ మైసూర్ (కేకేఆర్‌ మేనేజింగ్ డైరెక్టర్)కు కృతజ్ఞతలు. నేను ప్లేయర్‌గా ఫ్రాంఛైజీలో చేరినప్పుడు షారూక్‌ నాతో ‘ఇది నీ ఫ్రాంచైజీ. గెలిపించినా? ఓడించినా? నీ ఇష్టం’ అని అన్నాడు’’ అని గంభీర్‌ పేర్కొన్నాడు. 

2024 సీజన్‌ కేకేఆర్‌ జట్టు

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్‌), నితీష్‌ రాణా, రింకు సింగ్, రెహ్మనుల్లా గుర్బాజ్‌, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, ఫిల్‌ సాల్ట్, కేఎస్ భరత్, మనీశ్‌ పాండే, రఘువంశీ, అనుకుల్‌ రాయ్‌, రమణ్‌దీప్‌ సింగ్, ఆండ్రూ రసెల్, వెంకటేశ్ అయ్యర్, సుయాశ్‌ శర్మ, ముజీబుర్‌ రెహ్మన్‌, దుష్మంత చమీర, సాకిబ్ హుస్సేన్‌, హర్షిత్ రాణా, సునీల్ నరైన్‌, వైభవ్‌ అరోఠా, వరుణ్ చక్రవర్తి, మిచెల్ స్టార్క్‌, చేతన్‌ సకారియా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని