PBK vs LSG: దంచి పడేశారు.. లఖ్‌నవూ బ్యాటర్ల విధ్వంసం

పాపం పంజాబ్‌! అర్ష్‌దీప్‌, రబాడ లాంటి మంచి బౌలర్లున్నారు కదా కట్టడి చేస్తారు.. ధావన్‌, లివింగ్‌స్టోన్‌ లాంటి బ్యాటర్లున్నారు లక్ష్యాన్ని సులువుగా ఛేదించేస్తారని..

Updated : 29 Apr 2023 07:23 IST

లీగ్‌లో రెండో అత్యధిక స్కోరు నమోదు
పంజాబ్‌పై ఘనవిజయం

పాపం పంజాబ్‌! అర్ష్‌దీప్‌, రబాడ లాంటి మంచి బౌలర్లున్నారు కదా కట్టడి చేస్తారు.. ధావన్‌, లివింగ్‌స్టోన్‌ లాంటి బ్యాటర్లున్నారు లక్ష్యాన్ని సులువుగా ఛేదించేస్తారని.. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. కానీ బ్యాటింగ్‌కు స్వర్గధామంలా కనిపించిన మొహాలి పిచ్‌పై లఖ్‌నవూ బ్యాటర్లు అలా ఇలా విరుచుకుపడలేదు. తమలో తమకు సిక్సర్లు, ఫోర్ల పోటీ పెట్టుకున్నట్లుగా పదే పదే బంతిని బౌండరీ బాట పట్టించి.. స్కోరును 250 దాటించేశారు. ఆ జట్టు ఇంకాస్త ప్రయత్నించి ఉంటే.. పదేళ్లుగా చెక్కుచెదరని ఐపీఎల్‌ అత్యధిక స్కోరు రికార్డు (263) కూడా బద్దలయ్యేదే. కొండంత లక్ష్యాన్ని ఛేదించలేక పంజాబ్‌ 201కే పరిమితం కావడంతో ఘనవిజయం లఖ్‌నవూ సొంతమైంది.

గత మ్యాచ్‌లో సొంతగడ్డపై 136 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమి చవిచూసిన లఖ్‌నవూ.. శుక్రవారం మొహాలిలో ఏకంగా పంజాబ్‌కు 258 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి.. 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట స్టాయినిస్‌ (72; 40 బంతుల్లో 6×4, 5×6), మేయర్స్‌ (54; 24 బంతుల్లో 7×4, 4×6), పూరన్‌ (45; 19 బంతుల్లో 7×4, 1×6), బదోని (43; 24 బంతుల్లో 3×4, 3×6) రెచ్చిపోవడంతో సూపర్‌జెయింట్స్‌ 5 వికెట్లకు 257 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం పంజాబ్‌ 19.5 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటైంది. అథర్వ టైడ్‌ (66; 36 బంతుల్లో 8×4, 2×6) టాప్‌స్కోరర్‌. యశ్‌ ఠాకూర్‌ (4/37), నవీనుల్‌ హక్‌ (3/30), రవి బిష్ణోయ్‌ (2/41) ఆ జట్టును కట్టడి చేశారు. 8 మ్యాచ్‌ల్లో లఖ్‌నవూ అయిదో విజయం సాధించగా.. పంజాబ్‌ నాలుగో ఓటమి నమోదు చేసింది.

ఆ ఓపెనర్‌.. ఈ స్పిన్నర్‌

ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ సంతోషించదగ్గ విషయం ఒక్కటే. ఈ సీజన్లోనే ఆ జట్టు తరఫున ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన యువ ఓపెనర్‌ అథర్వ.. ఈ మ్యాచ్‌లో తన ముద్రను చాటడమే. తొలి మూడు మ్యాచ్‌ల్లో 0, 4, 29 పరుగులే చేసినప్పటికీ తుది జట్టులో కొనసాగిస్తూ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ అతను చెలరేగి ఆడాడు. చక్కటి టైమింగ్‌తో అలవోకగా భారీ షాట్లు ఆడుతూ అతను కేవలం 26 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. పంజాబ్‌ అంత లక్ష్యాన్ని ఛేదించేస్తుందన్న అంచనాలు లేకపోయినా.. గౌరవప్రదంగా ఓడిందంటే అందుక్కారణం అథర్వనే. ధావన్‌ (1), ప్రభ్‌సిమ్రన్‌ (9)ల వికెట్లను త్వరగా కోల్పోయి పరాభవం చవిచూసేలా కనిపించిన జట్టును అతను.. సికందర్‌ రజా (36)తో కలిసి అతను ఆదుకున్నాడు. వీళ్లిద్దరికీ తోడు లివింగ్‌స్టోన్‌ (23), సామ్‌ కరన్‌ (21), జితేశ్‌ శర్మ (24) కూడా తలో చేయి వేయడంతో పంజాబ్‌ 200 దాటింది. రెండో ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడుతున్న లఖ్‌నవూ స్పిన్నర్‌ యశ్‌ ఠాకూర్‌ 4 వికెట్లతో మెరిశాడు. పేసర్‌ నవీనుల్‌ సైతం ఆకట్టుకున్నాడు.

ఆ రికార్డుకు చేరువగా..

మొదట టాస్‌ గెలిచి లఖ్‌నవూను బ్యాటింగ్‌కు ఆహ్వానించినందుకు పంజాబ్‌ కచ్చితంగా చింతించే ఉంటుంది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న మొహాలి పిచ్‌పై అంతలా చెలరేగిపోయారు లఖ్‌నవూ బ్యాటర్లు. నెమ్మదిగా ఆడే ఆ జట్టు కెప్టెన్‌ రాహుల్‌ (12)ను ఆరంభంలోనే పెవిలియన్‌ చేర్చడం కింగ్స్‌కు చేటు చేసిందనే చెప్పాలి. మిగతా బ్యాటర్లెవ్వరూ అతడిలా ఆచితూచి ఆడే ప్రయత్నమే చేయలేదు. ఎప్పుడో కానీ రెండంకెల స్కోరు చేయని యువ ఆటగాడు బదోని సైతం బ్యాటింగ్‌ ఆర్డర్లో ముందు వచ్చి మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇక స్టాయినిస్‌, మేయర్స్‌, పూరన్‌ అయితే బంతిని బాదడమే పనిగా పెట్టుకున్నారు. ఆరంభంలో మేయర్స్‌ కొట్టిన కొట్టుడుతోనే పంజాబ్‌ బౌలర్లందరి గణాంకాలు చెల్లాచెదురైపోయాయి. అందరూ లయ తప్పారు. కింగ్స్‌ ఉత్తమ బౌలర్‌ అర్ష్‌దీప్‌ వేసిన రెండో ఓవర్లో నాలుగు ఫోర్లతో మొదలైన అతడి విధ్వంసం ఆరో ఓవర్లో ఔటయ్యే వరకు కొనసాగింది. అప్పటికే స్కోరు 74 పరుగులకు చేరుకోవడం విశేషం. మేయర్స్‌ వెనుదిరిగాక బాదుడు బాధ్యత స్టాయినిస్‌, బదోని తీసుకున్నారు. స్టాయినిస్‌ భారీ షాట్లు ఆడటం కొత్తేం కాదు కానీ.. బదోని అలవోకగా బంతిని స్టాండ్స్‌లోకి పంపడమే ఆశ్చర్యం. ఈ జోడీ 26 బంతుల్లోనే అర్ధశతక భాగస్వామ్యం నమోదు చేసింది. 38 పరుగుల వద్ద తన క్యాచ్‌ను అందుకున్న తర్వాత లివింగ్‌స్టోన్‌ కాలిని బౌండరీ హద్దుకు తాకించడంతో జీవన దానం అందుకున్న స్టాయినిస్‌ చివరిదాకా దూకుడు కొనసాగించాడు. అతడితో మూడో వికెట్‌కు 46 బంతుల్లోనే 89 పరుగులు జోడించిన బదోని 14వ ఓవర్లో ఔటయ్యాడు. అప్పటికే స్కోరు 160 దాటిపోయింది. ఆపై స్టాయినిస్‌, పూరన్‌ పోటీ పడి పంజాబ్‌ బౌలింగ్‌ను ఊచకోత కోయడంతో 16 ఓవర్లకే 200 మార్కును అందుకున్న సూపర్‌జెయింట్స్‌.. బెంగళూరు పేరిట ఉన్న ఐపీఎల్‌ రికార్డు స్కోరు (263) మీద కన్నేసింది. ఆఖర్లో స్టాయినిస్‌, పూరన్‌ ఔటవకపోతే ఆ రికార్డు బద్దలయ్యేదే. రాహుల్‌ చాహర్‌ (4-0-29-0) మినహా బౌలర్లందరూ 12 కంటే ఎకానమీ నమోదు చేశారు.


257/5: లఖ్‌నవూ స్కోరు. ఐపీఎల్‌లో ఇది రెండో అత్యధికం. లీగ్‌ రికార్డు బెంగళూరు (263/5; 2013లో పుణెపై) పేరిట ఉంది.


లఖ్‌నవూ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) షారుక్‌ (బి) రబాడ 12; మేయర్స్‌ (సి) ధావన్‌ (బి) రబాడ 54; బదోని (సి) ఆర్‌.చాహర్‌ (బి) లివింగ్‌స్టోన్‌ 43; స్టాయినిస్‌ (సి) జితేశ్‌ (బి) కరన్‌ 72; పూరన్‌ ఎల్బీ (బి) అర్ష్‌దీప్‌ 45; హుడా నాటౌట్‌ 11; కృనాల్‌ నాటౌట్‌ 5; ఎక్స్‌ట్రాలు 15 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 257; వికెట్ల పతనం: 1-41, 2-74, 3-163, 4-239, 5-251; బౌలింగ్‌: గుర్నూర్‌ 3-0-42-0; అర్ష్‌దీప్‌ 4-0-54-1; రబాడ 4-0-52-2; సికందర్‌ 1-0-17-0; ఆర్‌.చాహర్‌ 4-0-29-0; సామ్‌ కరన్‌ 3-0-38-1; లివింగ్‌స్టోన్‌ 1-0-19-1

పంజాబ్‌ ఇన్నింగ్స్‌: ప్రభ్‌సిమ్రన్‌ (సి) సామ్స్‌ (బి) నవీనుల్‌ 9; ధావన్‌ (సి) కృనాల్‌ (బి) స్టాయినిస్‌ 1; అథర్వ (సి) అండ్‌ (బి) బిష్ణోయ్‌ 66; సికందర్‌ (సి) కృనాల్‌ (బి) యశ్‌ 36; లివింగ్‌స్టోన్‌ ఎల్బీ (బి) బిష్ణోయ్‌ 23; కరన్‌ (సి) బదోని (బి) నవీనుల్‌ 21; జితేశ్‌ (సి) రాహుల్‌ (బి) యశ్‌  24; షారుక్‌ (సి) బిష్ణోయ్‌ (బి) యశ్‌ 6; ఆర్‌.చాహర్‌ (సి) హుడా(బి) యశ్‌ 0; రబాడ(బి) నవీనుల్‌0; అర్ష్‌దీప్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 13 మొత్తం: (19.5 ఓవర్లలో ఆలౌట్‌) 201; వికెట్ల పతనం: 1-3, 2-31, 3-109, 4-127, 5-152, 6-178, 7-192, 8-193, 9-197; బౌలింగ్‌: స్టాయినిస్‌ 1.5-0-21-1; మేయర్స్‌ 1-0-4-0; బదోని 0.1-0-0-0; నవీనుల్‌ 4-0-30-3; అవేష్‌ 2-0-28-0; అమిత్‌ 2-0-23-0; బిష్ణోయ్‌ 4-0-41-2; యశ్‌ 3.5-0-37-4; కృనాల్‌ 1-0-13-0

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని