CSK vs PBKS: పంజాబ్‌కే చిక్కింది

చెన్నై స్కోరు 200.. ఛేదన ఆరంభంలో ప్రభ్‌సిమ్రన్‌ మెరిసినా ఇన్నింగ్స్‌ సగం అయ్యేసరికి ఒత్తిడి పంజాబ్‌పైనే!

Updated : 01 May 2023 10:29 IST

ఉత్కంఠ పోరులో చెన్నై ఓటమి
మెరిసిన లివింగ్‌స్టోన్‌, ప్రభ్‌సిమ్రన్‌
కాన్వే శ్రమ వృథా

చెన్నై స్కోరు 200.. ఛేదన ఆరంభంలో ప్రభ్‌సిమ్రన్‌ మెరిసినా ఇన్నింగ్స్‌ సగం అయ్యేసరికి ఒత్తిడి పంజాబ్‌పైనే! ఈ స్థితిలో చెలరేగిన లివింగ్‌స్టోన్‌, కరన్‌, జితేశ్‌ పంజాబ్‌కు విజయాన్నందించారు. ఒకరుపోతే ఇంకొకరు అన్నట్లుగా చెలరేగి చెన్నైకు ఓటమి మిగిల్చారు. ఆఖర్లో సికందర్‌ రజా ఉత్కంఠను అధిగమించి పంజాబ్‌ను గెలిపించాడు. సీఎస్కేకు ఇది వరుసగా రెండో ఓటమి. గత అయిదు మ్యాచ్‌ల్లో పంజాబ్‌కిది మూడో విజయం.

ఐపీఎల్‌-16లో పంజాబ్‌కు అదిరే విజయం. పట్టుదలగా ఆడిన ఆ జట్టు ఉత్కంఠ పోరులో చెన్నైపై విజయాన్ని అందుకుంది. ఆదివారం 4 వికెట్ల తేడాతో సీఎస్కేపై నెగ్గింది. మొదట ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ డెవాన్‌ కాన్వే (92 నాటౌట్‌; 52 బంతుల్లో 16×4, 1×6) సత్తా చాటడంతో చెన్నై 200/4 స్కోరు చేసింది. ఛేదనలో ప్రభ్‌సిమ్రన్‌ (42; 24 బంతుల్లో 4×4, 2×6), లివింగ్‌స్టోన్‌ (40; 24 బంతుల్లో 1×4, 4×6) మెరుపులతో లక్ష్యాన్ని పంజాబ్‌ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి అందుకుంది. చెన్నై బౌలర్లలో తుషార్‌ దేశ్‌పాండే (3/49), జడేజా (2/32) రాణించినా జట్టును గెలిపించలేకపోయారు.
పంజాబ్‌ మెరుపుదాడి: ఆరంభంలో ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ మెరుపులు.. మధ్యలో లివింగ్‌స్టోన్‌, కరన్‌ దూకుడు..! ఆఖర్లో సికందర్‌ రజా తెలివైన బ్యాటింగ్‌.. వెరసి పంజాబ్‌ విజయం! ఇది కింగ్స్‌ ఛేదన సాగిన తీరు. భారీ ఛేదనలో పంజాబ్‌ది ఆరంభం నుంచి ఎదురుదాడే! శిఖర్‌ ధావన్‌ (28) అండతో చెలరేగిన ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ జట్టుకు మెరుపు ఆరంభాన్నిచ్చాడు. దేశ్‌పాండే బౌలింగ్‌లో ఓ ఫ్లిక్‌ సిక్స్‌తో మొదలైన అతడి జోరు ఆ తర్వాత మరింత పెరిగింది. ధావన్‌ కూడా కొన్ని షాట్లు ఆడడంతో పవర్‌ ప్లే ఆఖరికి పంజాబ్‌ 62/1తో మెరుగ్గా కనిపించింది. కానీ కుదురుకున్న ప్రభ్‌సిమ్రన్‌,  అథర్వ (13)ను ఔట్‌ చేసిన జడేజా.. ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో కింగ్స్‌కు సమీకరణం (30 బంతుల్లో 72) క్లిష్టంగా మారింది. ఈ స్థితిలో సిక్స్‌లతో చెలరేగిన లివింగ్‌స్టోన్‌, కరన్‌ (29; 20 బంతుల్లో 1×4, 1×6) పంజాబ్‌లో ఆశలు రేపారు. అయితే స్వల్ప తేడాతో వీళ్లిద్దరూ ఔట్‌ కావడంతో మళ్లీ మ్యాచ్‌ సీఎస్కే వైపు మొగ్గింది. ఈ స్థితిలో దూకుడుగా ఆడిన జితేశ్‌ శర్మ (21; 10 బంతుల్లో 2×4, 1×6) జట్టును విజయపథంలో నడిపించాడు. పతిరన వేసిన ఆఖరి ఓవర్లో పంజాబ్‌కు 9 పరుగులు అవసరం కాగా.. తొలి మూడు బంతుల్లో 2 పరుగులే రావడంతో ఉత్కంఠ నెలకొంది. 4, 5 బంతులకు సికందర్‌ రజా (13 నాటౌట్‌) రెండేసి పరుగులు చేయడంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు మళ్లుతుందా అనిపించింది. కానీ ఆఖరి బంతికి 3 పరుగులు చేయాల్సి ఉండగా.. స్క్వేర్‌ లెగ్‌ వైపు షాట్‌ కొట్టి మూడు పరుగులు చేసిన రజా.. పంజాబ్‌కు విజయాన్ని అందించాడు.
కాన్వే ఒక్కడే..: అంతకుముందు చెన్నై ఇన్నింగ్స్‌లో కాన్వే ఆటే హైలైట్‌. మొదట రుతురాజ్‌ గైక్వాడ్‌ (37; 31 బంతుల్లో 4×4, 1×6)తో ఇన్నింగ్స్‌కు పునాది వేసిన ఈ లెఫ్ట్‌హ్యాండర్‌.. ఆ తర్వాత శివమ్‌ దూబె (28; 17 బంతుల్లో 1×4, 2×6) అండతో భారీ స్కోరుకు బాటలు వేశాడు. ఎక్కువ గ్రౌండ్‌ షాట్లే ఆడిన కాన్వే.. బౌండరీలతోనే స్కోరు పెంచాడు. రుతురాజ్‌ కూడా కుదురుగా బ్యాటింగ్‌ చేశాడు. వికెట్‌ పడకున్నా 9 ఓవర్లకు చెన్నై చేసింది 77 పరుగులే. అయితే రుతురాజ్‌ ఔటై.. దూబె క్రీజులోకి వచ్చాక ఇన్నింగ్స్‌కు ఊపొచ్చింది. రబాడ, రజా బౌలింగ్‌లో ఈ లెఫ్ట్‌ హ్యాండర్‌ రెండు సిక్స్‌లు బాది స్కోరుబోర్డుకు వేగాన్ని అందించాడు. కానీ దూబెతో పాటు మొయిన్‌ అలీ (10) ఔట్‌ కావడంతో చెన్నైకు ఎదురుదెబ్బ తగిలింది. 17 ఓవర్లకు ఆ జట్టు స్కోరు 169/3. కానీ దూకుడుగా ఆడిన కాన్వే స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఆఖరి ఓవర్లో చివరి రెండు బంతులకు ధోని (13 నాటౌట్‌; 4 బంతుల్లో 2×6) సిక్స్‌లు బాదడంతో చెన్నై 200 మార్కు అందుకుంది. చివరి రెండు ఓవర్లలో ఎక్కువగా స్ట్రెక్‌ రాకపోవడంతో కాన్వే సెంచరీ చేయలేకపోయాడు.


చెన్నై ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (స్టంప్డ్‌) జితేశ్‌ (బి) రజా 37; కాన్వే నాటౌట్‌ 92; దూబె (సి) షారుక్‌ (బి) అర్ష్‌దీప్‌ 28; మొయిన్‌ (స్టంప్డ్‌) జితేశ్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 10; జడేజా (సి) లివింగ్‌స్టోన్‌ (బి) కరన్‌ 12; ధోని నాటౌట్‌ 13; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 200; వికెట్ల పతనం: 1-86, 2-130, 3-158, 4-185; బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 4-0-37-1; రబాడ 4-0-34-0; కరన్‌ 4-0-46-1; రాహుల్‌ చాహర్‌ 4-0-35-1; సికందర్‌ 3-0-31-1; లివింగ్‌స్టోన్‌ 1-0-16-0
పంజాబ్‌ ఇన్నింగ్స్‌: ప్రభ్‌సిమ్రన్‌ (స్టంప్ట్‌) ధోని (బి) జడేజా 42; ధావన్‌ (సి) పతిరన (బి) తుషార్‌ 28; అథర్వ (సి) అండ్‌ (బి) జడేజా 13; లివింగ్‌స్టోన్‌ (సి) రుతురాజ్‌ (బి) తుషార్‌ 40; కరన్‌ (బి) పతిరన 29; జితేశ్‌ (సి) రషీద్‌ (బి) తుషార్‌ 21; షారుక్‌ నాటౌట్‌ 2; రజా నాటౌట్‌ 13; ఎక్స్‌ట్రాలు 13 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 201; వికెట్ల పతనం: 1-50, 2-81, 3-94, 4-151, 5-170, 6-186; బౌలింగ్‌: ఆకాశ్‌ సింగ్‌ 3-0-35-0; తుషార్‌ దేశ్‌పాండే 4-0-49-3; తీక్షణ 4-0-36-0; జడేజా 4-0-32-2; మొయిన్‌ 1-0-10-0; పతిరన 4-0-32-1

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని