Shahid Afridi: అహ్మదాబాద్‌లో ఎందుకు ఆడరు?: అఫ్రిది

ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్‌లో ఆరంభమయ్యే వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్‌లో మ్యాచ్‌ ఆడేందుకు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఎందుకు వెనుకడుగు వేస్తోందని ఆ జట్టు మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిది ప్రశ్నించాడు.

Updated : 18 Jun 2023 07:47 IST

కరాచి: ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్‌లో ఆరంభమయ్యే వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్‌లో మ్యాచ్‌ ఆడేందుకు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఎందుకు వెనుకడుగు వేస్తోందని ఆ జట్టు మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిది ప్రశ్నించాడు. పాక్‌ సూచించిన హైబ్రిడ్‌ విధానంలో ఆసియా కప్‌ నిర్వహించేందుకు ఆసియా క్రికెట్‌ మండలి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడిక అందరి దృష్టి భారత్‌ ఆతిథ్యమిచ్చే వన్డే ప్రపంచకప్‌పై పడింది. ఇప్పటికే ఈ ప్రపంచకప్‌ ముసాయిదా షెడ్యూల్‌ను ఐసీసీ సభ్య దేశాలకు బీసీసీఐ పంపించింది. దీని ప్రకారం అహ్మదాబాద్‌లో భారత్‌, పాక్‌ తలపడాల్సి ఉంది. కానీ పాక్‌ మ్యాచ్‌ను అహ్మదాబాద్‌లో నిర్వహించకుండా ఐసీసీ ప్రతినిధులను ఒప్పించేందుకు పీసీబీ అధ్యక్షుడు నజమ్‌ సేథీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీనిపై స్పందించిన అఫ్రిది.. ‘‘అహ్మదాబాద్‌ పిచ్‌పై ఆడేందుకు పీసీబీ ఎందుకు నిరాకరిస్తోంది? అదేమైనా నిప్పులు చెరుగుతుందా లేదా వేటాడుతుందా? వెళ్లి అక్కడ ఆడడమే కాదు.. గెలవాలి. ఈ సవాళ్లను అధిగమించేందుకు అక్కడ విజయం సాధించడం ఒక్కటే మార్గం. చివరకు పాకిస్థాన్‌ జట్టు గెలుపే ముఖ్యం. ఆ కఠిన పరిస్థితుల్లో ఆడడాన్ని సానుకూలంగా తీసుకోవాలి. ఆ మైదానం భారత్‌కు సౌకర్యవంతంగా ఉంటుంది అనుకుంటే పాక్‌ వెళ్లి అక్కడే ఆడాలి. భారత అభిమానులతో నిండిన ఆ మైదానంలో గెలిచి మన సత్తాచాటాలి’’ అని పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని