Chess: ఇది బంగారు తరం

భారత చెస్‌లో ఇప్పుడు సువర్ణాధ్యాయం నడుస్తోందని దిగ్గజ క్రీడాకారుడు విశ్వనాథన్‌ ఆనంద్‌ అన్నాడు. యువ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద చెస్‌ ప్రపంచకప్‌లో కార్ల్‌సన్‌తో ఫైనల్‌ ఆడుతున్న నేపథ్యంలో ఆనంద్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. దేశంలో ఇటీవల కాలంలో అనేకమంది గ్రాండ్‌మాస్టర్లుగా ఎదిగిన సంగతి తెలిసిందే.

Updated : 24 Aug 2023 14:16 IST

చెన్నై: భారత చెస్‌లో ఇప్పుడు సువర్ణాధ్యాయం నడుస్తోందని దిగ్గజ క్రీడాకారుడు విశ్వనాథన్‌ ఆనంద్‌ అన్నాడు. యువ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద చెస్‌ ప్రపంచకప్‌లో కార్ల్‌సన్‌తో ఫైనల్‌ ఆడుతున్న నేపథ్యంలో ఆనంద్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. దేశంలో ఇటీవల కాలంలో అనేకమంది గ్రాండ్‌మాస్టర్లుగా ఎదిగిన సంగతి తెలిసిందే. వాళ్లలో చాలా మందికి 2,700పై ఎలో రేటింగ్‌ ఉండడం గొప్ప విషయమని ఆనంద్‌ అన్నాడు. ‘‘వాళ్లది బంగారు తరం. వాళ్లంతా 2,700పై ఎలో రేటింగ్‌తో ఉన్నారు. వయసు 20 లోపే. ఇది అంత తేలికైన విషయం కాదు. ఇది చాలా ప్రత్యేకమైంది. వచ్చే పదేళ్లు ఈ యువ క్రీడాకారులు అత్యున్నత స్థితిలో ఉంటారు. అందుకే వారిది బంగారు తరం అంటున్నా’’ అని చెప్పాడు.


అమన్‌ప్రీత్‌కు స్వర్ణం

ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌

బాకు: ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుల ఉత్తమ ప్రదర్శన కొనసాగుతోంది. పురుషుల 25 మీటర్ల స్టాండర్డ్‌ పిస్టల్‌ విభాగంలో అమన్‌ప్రీత్‌ సింగ్‌ బుధవారం స్వర్ణం సాధించాడు. అతను ఫైనల్లో 577 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. లీ గన్‌యోక్‌ (కొరియా-574), కెవిన్‌ చాపన్‌ (ఫ్రాన్స్‌-573) వరుసగా రజతం, కాంస్యం గెలిచారు. మహిళల 25 మీటర్ల స్టాండర్డ్‌ విభాగంలో తియానా (538), యాషిత షోకీన్‌ (536), కృతిక శర్మ (527) విడి విడిగా పతకాలు సాధించలేకపోయినా.. ఉమ్మడి స్కోరుతో కాంస్యం గెలి చారు. ఈ టోర్నీలో ఇప్పటిదాకా భారత్‌ అయిదు స్వర్ణాలు, నాలుగు కాంస్యాలు సాధించింది.


భారత మహిళలకు మూడో స్థానం

డసెల్‌డార్ఫ్‌ (జర్మనీ): నాలుగు దేశాల జూనియర్‌ హాకీ టోర్నమెంట్లో భారత మహిళల జట్టు మూడో స్థానం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో 6-2తో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించింది. భారత్‌ తరఫున అన్ను (26వ, 43వ) రెండు గోల్స్‌ కొట్టగా.. నీలమ్‌ (25వ), తొప్పో (35వ), హినా బానో (38వ), ముంతాజ్‌ ఖాన్‌ (40వ) తలో గోల్‌ చేశారు. ఇంగ్లాండ్‌ జట్టులో క్లాడియా స్వెయిన్‌ (16వ), చార్లోట్‌ బింగమ్‌ (54వ) చెరో గోల్‌ సాధించారు. మ్యాచ్‌లో ఇంగ్లాండే మొదట ఆధిక్యంలోకి వెళ్లినా.. ఆ తర్వాత భారత్‌ అదరగొట్టింది.


ఇంగ్లాండ్‌, నెదర్లాండ్స్‌లతో భారత్‌ ఢీ

ప్రపంచకప్‌ వార్మప్‌ షెడ్యూల్‌ ఖరారు

దుబాయ్‌: వన్డే ప్రపంచకప్‌ ముంగిట టీమ్‌ఇండియా ఆడే వార్మప్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ ఖరా రైంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌తో పాటు పసికూన నెదర్లాండ్స్‌ను రోహిత్‌ సేన ఢీకొనబోతోంది. సెప్టెంబరు 30న గువాహటిలోని బర్సపర స్టేడియంలో ఇంగ్లాండ్‌తో తలపడబోతున్న భారత్‌.. అక్టోబరు 3న తిరువనంతపురంలో నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ ఆడుతుంది. వార్మప్‌ మ్యాచ్‌లకు గువాహటి, తిరువనంతపురంతో పాటు హైదరాబాద్‌ వేదికలుగా ఖరారైన సంగతి తెలిసిందే. ప్రపంచకప్‌లో భారత్‌ ఆడే మ్యాచ్‌ను దక్కించుకోలేపోయిన హైదరాబాద్‌కు వార్మప్‌లోనూ రోహిత్‌ సేనకు ఆతిథ్యమిచ్చే అవకాశం లభించలేదు. సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 3 వరకు వార్మప్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నీలో తలపడే పది జట్లూ రెండు చొప్పున మ్యాచ్‌లు ఆడతాయి. అక్టోబరు 5న ఇంగ్లాండ్‌-న్యూజిలాండ్‌ పోరుతో ప్రపంచకప్‌ ఆరంభమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని