Siraj: వెస్టిండీస్‌లో నేర్చుకున్నా..

నెట్స్‌లో గంటల కొద్దీ సాధన చేయడం వల్లే సమర్థవంతంగా ఔట్‌ స్వింగర్లను వేయగలుగుతున్నానని భారత స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అన్నాడు.

Updated : 20 Sep 2023 09:37 IST

కొలంబో: నెట్స్‌లో గంటల కొద్దీ సాధన చేయడం వల్లే సమర్థవంతంగా ఔట్‌ స్వింగర్లను వేయగలుగుతున్నానని భారత స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అన్నాడు. ‘‘వెస్టిండీస్‌కు వెళ్లినప్పుడు క్రీజుకు దూరంగా బంతిని వేసి ఔట్‌ స్వింగ్‌ను రాబట్టడం ప్రాక్టీస్‌ చేశాను. దీని వల్ల పిచ్‌ అయిన తర్వాత బంతి దిశను మార్చుకుంటూ దూసుకెళ్తుంది. శ్రీలంకపై ఇలాగే అనుకున్నట్లుగా బంతులు వేయగలిగా. ఏనాడూ ఇంత బాగా బౌలింగ్‌ చేయగలనని అనుకోలేదు. త్రివేండ్రంలో లంకతో వన్డేలో నాలుగు వికెట్లు తీసినప్పుడు అయిదో వికెట్‌ కోసం ప్రయత్నించి విఫలమయ్యా. ఈసారి మాత్రం 5 వికెట్లు సాధించగలిగా. సరైన ప్రదేశాల్లో బంతులు వేసి ఫలితాలు అందుకున్నా. ప్రపంచకప్‌ ముందు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే ప్రదర్శన ఇది’’ అని సిరాజ్‌ అన్నాడు. లంకతో ఫైనల్లో సిరాజ్‌ (6/21) అద్భుత బౌలింగ్‌తో భారత్‌ను గెలిపించిన సంగతి తెలిసిందే.

ఆ రెండు అస్త్రాల వల్లే... కుల్‌దీప్‌: రాంగాన్‌, ఫ్లిప్పర్‌లను సరిగ్గా వేయడం వల్లే ఆసియాకప్‌లో సత్తా చాటగలిగానని లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ అన్నాడు. ‘‘మ్యాచ్‌కు ముందు ఎక్కువగా ఆలోచించను. పిచ్‌ను చదివేందుకు ప్రయత్నిస్తా. అప్పుడు అనుకున్నట్లు బంతిని వేయగలుగుతా. బ్యాటర్‌ కూడా ఎలాంటి షాట్లు కొడతాడనేది ముందుగానే ఊహించి దానికి తగ్గట్టు బంతులు వేస్తా. రాంగాన్‌, ఫ్లిప్పర్‌లను సరిగా వేయగలుగుతున్నా. గత ఏడాదిన్నరగా    రాంగాన్‌పై బాగా పట్టు సాధించా’’ అని కుల్‌దీప్‌ చెప్పాడు. ఆసియాకప్‌లో పాక్‌పై కుల్‌దీప్‌ (5/25)తో అదరగొట్టాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని