ODI WC 2023: ఈ కప్పుపైనే కళ్లన్నీ!

ప్రపంచంలోనే మేటి జట్లు తలపడేది ఈ కప్పు కోసమే! మైదానంలో యుద్ధానికి దిగేది ఈ కప్పును ముద్దాడటం కోసమే! ఒక్కసారైన విశ్వ విజేతగా నిలవాలనే లక్ష్యంతో కొన్ని..

Updated : 21 Sep 2023 10:00 IST

క్రికెట్‌ ప్రపంచకప్‌మరో 14 రోజుల్లో

రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రదర్శనకు ఉంచిన ప్రపంచకప్‌ ట్రోఫీ

ఈనాడు - హైదరాబాద్‌ : ప్రపంచంలోనే మేటి జట్లు తలపడేది ఈ కప్పు కోసమే! మైదానంలో యుద్ధానికి దిగేది ఈ కప్పును ముద్దాడటం కోసమే! ఒక్కసారైన విశ్వ విజేతగా నిలవాలనే లక్ష్యంతో కొన్ని.. ట్రోఫీని మరోసారి దక్కించుకోవాలనే పట్టుదలతో మరికొన్ని.. ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యాన్ని కొనసాగించాలనే సంకల్పంతో ఇంకొన్ని జట్లు.. ఇలా అందరి కళ్లు ఈ కప్పును సొంతం చేసుకోవడం మీదే! ఏ జట్టు చేతుల్లో ఒదిగిపోతుందోనని అభిమానులూ దృష్టి పెట్టేది ఈ కప్పు మీదే! మరో పక్షం రోజుల్లోపే ఈ కప్పు పోరు ప్రారంభం కానుంది. భారత్‌ వేదికగా వచ్చే నెల 5న వన్డే ప్రపంచకప్‌ ఆరంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీలో విజేతగా నిలిచే జట్టుకు అందించే కప్పు బుధవారం హైదరాబాద్‌కు చేరుకుంది. ప్రపంచకప్‌కు ముందు నిర్వహిస్తున్న ఈ ట్రోఫీ పర్యటనలో భాగంగా ప్రత్యేకంగా రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈ కప్పును ప్రదర్శించారు.. గురువారం నగరంలోని చార్మినార్‌, ఉప్పల్‌ క్రికెట్‌ మైదానంలో దీన్ని ప్రదర్శించనున్నారు.

అలా మొదలైంది..

  • ఇప్పుడున్న ట్రోఫీని 1999 ప్రపంచకప్‌ నుంచి విజేతలకు అందిస్తున్నారు. ఛాంపియన్‌ జట్టుకు మొదట ఈ ట్రోఫీని ప్రదానం చేసి.. అనంతరం దీని నమూనాను అందజేస్తారు. నిజమైన ట్రోఫీ కింది భాగంలో విజేత జట్ల పేర్లను రాస్తారు.
  • ప్రస్తుత ట్రోఫీని లండన్‌లోని గరార్డ్‌ అండ్‌ కో అనే ఆభరణాల సంస్థ తయారుచేసింది. దీని తయారీలో బంగారం, వెండి వాడారు. ఇది 60 సెంటీమీటర్ల ఎత్తు ఉంటుంది. దీని బరువు 11 కిలోలు. ఏ కోణం నుంచి చూసినా ఒకేలా కనిపించేలా తీర్చిదిద్దడం దీని ప్రత్యేకత.
  • మూడు వైపులా పొడుగ్గా ఉండే వెండి స్టంప్స్‌, బెయిల్స్‌ మీద బంతి (బంగారు గ్లోబ్‌) పొదిగి ఉన్నట్లు ఈ కప్పుంది. క్రికెట్లోని బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లను ఈ మూడు స్టంప్స్‌ సూచిస్తాయి.
  • 1999 ప్రపంచకప్‌ ముందు నాలుగు రకాల ట్రోఫీలను మార్చారు. ఇంగ్లాండ్‌లో జరిగిన తొలి మూడు (1975, 1979, 1983) ప్రపంచకప్‌ల్లోనూ ఒకే రకమైన ట్రోఫీని అందించారు. స్పాన్సర్‌షిప్‌ కారణంగా ప్రుడెన్షియల్‌ కప్‌గా వ్యవహరించిన ఇది చూడ్డానికి వింబుల్డన్‌ పురుషుల ట్రోఫీలాగా ఉండేది.
  • తొలిసారి ఇంగ్లాండ్‌ వెలుపల 1987లో ప్రపంచకప్‌ నిర్వహించారు. ఈ రిలయన్స్‌ ప్రపంచకప్‌కు భారత్‌, పాకిస్థాన్‌ ఉమ్మడిగా ఆతిథ్యమిచ్చాయి. అప్పుడు డైమండ్లు పొదిగి, బంగారు పూతతో ఉన్న కప్పును విజేత ఆస్ట్రేలియాకు అందజేశారు. అప్పుడే దీని విలువ దాదాపు రూ.6 లక్షలు.
  • 1992 బెన్సన్‌ అండ్‌ హెడ్జెస్‌ ప్రపంచకప్‌ కోసం అందించిన ట్రోఫీ ఈ కప్పు చరిత్రలోనే అందమైందిగా పేరు తెచ్చుకుంది. వాటర్‌ఫోర్ట్‌ క్రిస్టల్‌ ట్రోఫీని విజేత పాకిస్థాన్‌ సొంతం చేసుకుంది. ఇక 1996లో భారత్‌, పాకిస్థాన్‌, శ్రీలంక కలిసి ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్‌ కోసం మరోసారి లోహంతో కూడిన కప్పునే తయారు చేశారు. ఇది ఎక్కువగా అలంకరించిన కప్పుగా నిలిచిపోయింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని