IND vs AUS: బంతి గాడిన పడాలి

వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా కొట్టిన దెబ్బను భారత అభిమానులు అంత సులువుగా మరిచిపోలేరు.

Updated : 26 Nov 2023 06:54 IST

నేడు ఆసీస్‌తో భారత్‌ రెండో టీ20
రాత్రి 7 గంటల నుంచి
మ్యాచ్‌కు వర్షం ముప్పు
తిరువనంతపురం

వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా కొట్టిన దెబ్బను భారత అభిమానులు అంత సులువుగా మరిచిపోలేరు. ఆ గాయాన్ని ఏ మందూ మాన్పలేదు కానీ.. అదే జట్టుతో మొదలైన టీ20 సిరీస్‌లో భారత జట్టు విజయం సాధిస్తే అభిమానులకు కొంత ఉపశమనం దక్కుతుందనడంలో సందేహం లేదు. విజయంతో మొదలుపెట్టిన యువ భారత్‌.. సిరీస్‌ దిశగా ఒక అడుగు వేసింది. విశాఖపట్నంలో 200 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించి ఆస్ట్రేలియాకు షాకిచ్చిన టీమ్‌ఇండియా.. ఇదే ఊపులో ఇంకో మ్యాచ్‌ గెలిచేయాలని చూస్తోంది. ఆదివారమే రెండో టీ20.

స్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో భారత్‌ ఆడుతోంది ద్వితీయ శ్రేణి జట్టుతో అని చెప్పొచ్చు. ఆస్ట్రేలియా కూడా కొందరు కీలక ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగినప్పటికీ.. స్టీవ్‌ స్మిత్‌, స్టాయినిస్‌, ఇంగ్లిస్‌, సీన్‌ అబాట్‌, బెరెన్‌డార్ఫ్‌ లాంటి స్టార్‌ ఆటగాళ్లతో తొలి టీ20లో బరిలోకి దిగి భారత్‌ చేతిలో కంగుతింది. పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లతో ఆడిన భారత్‌.. 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేయడం కంగారూలకు షాకే. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్‌ అంచనాలను మించిపోయింది. ముఖ్యంగా వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో తీవ్రంగా నిరాశపరిచిన సూర్యకుమార్‌.. టీ20 సిరీస్‌లో కెప్టెన్‌గా అడుగు పెట్టి తొలి మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌ మాత్రం తేలిపోయింది. ఆదివారం బౌలర్లు పుంజుకోకుంటే కష్టమే.

మార్పుల్లేకుండా..: భారత్‌ తొలి టీ20లో ఆడిన జట్టునే ఈ మ్యాచ్‌కూ కొనసాగించే అవకాశాలున్నాయి. మార్పులేమీ జరగకపోవచ్చు. తొలి టీ20లో బ్యాటర్లు అంచనాలకు మించి రాణించారు. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ జట్టును ముందుండి నడిపించాడు. ఇషాన్‌ కిషన్‌, యశస్వి జైస్వాల్‌, రింకు సింగ్‌ ఉపయుక్తమైన ఇన్నింగ్స్‌ ఆడారు. వీళ్లు ఇదే జోరును కొనసాగించాలని జట్టు ఆశిస్తోంది. విశాఖలో నిరాశపరిచిన రుతురాజ్‌ గైక్వాడ్‌, తిలక్‌ వర్మ తిరువనంతపురంలో ఊపందుకుంటారేమో చూడాలి. విశాఖలో బౌలర్ల ప్రదర్శన జట్టుకు ఆందోళన కలిగించే ఉంటుంది. ప్రధాన పేసర్లు అర్ష్‌దీప్‌, ప్రసిద్ధ్‌ వరుసగా 10.25, 12.50 ఎకానమీ నమోదు చేశారు. స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ అయితే ఏకంగా ఓవర్‌కు 13.50 చొప్పున పరుగులిచ్చాడు. ముకేశ్‌ కుమార్‌ (ఎకానమీ 7.25), అక్షర్‌ పటేల్‌ (ఎకానమీ 8) కట్టడి చేయకుంటే ఆ మ్యాచ్‌లో ఆసీస్‌ స్కోరు 230 చేరుకునేదే. మరి ఆదివారం అయినా భారత బౌలర్లు గాడిన పడతారేమో చూడాలి. ఆస్ట్రేలియాకు కూడా బౌలింగే సమస్యగా మారింది. బెరెన్‌డార్ఫ్‌ అదరగొట్టినప్పటికీ మిగతా బౌలర్లు నిరాశపరిచారు. ఎలిస్‌, అబాట్‌ ధారాళంగా పరుగులిచ్చేశారు. బ్యాటింగ్‌లో ఆసీస్‌కు సమస్యలేమీ లేవు. ఓపెనర్‌గా కొత్త పాత్రలో స్టీవ్‌ స్మిత్‌ ఆకట్టుకున్నాడు. ఇంగ్లిస్‌ రెచ్చిపోయి సెంచరీ కొట్టేశాడు. వీళ్లిద్దరికీ తోడు షార్ట్‌, స్టాయినిస్‌, డేవిడ్‌, వేడ్‌లతో ఆసీస్‌ బ్యాటింగ్‌ బలంగా ఉంది. మరి బ్యాటింగ్‌కు అనుకూలించే తిరువనంతపురం పిచ్‌పై ఏ జట్టు పైచేయి సాధిస్తుందో చూడాలి.

పిచ్‌ ఎలా?: తిరువనంతపురం పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పేసర్లకు సహకారం ఉంటుంది. టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్‌ ఎంచుకునే అవకాశముంది.

తుది జట్లు (అంచనా)... భారత్‌: రుతురాజ్‌, యశస్వి, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, రింకు సింగ్‌, అక్షర్‌ పటేల్‌, రవి బిష్ణోయ్‌, ముకేశ్‌కుమార్‌, అర్ష్‌దీప్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ;

ఆస్ట్రేలియా: స్టీవ్‌ స్మిత్‌, షార్ట్‌, ఇంగ్లిస్‌, స్టాయినిస్‌, డేవిడ్‌, హార్డీ, వేడ్‌, సీన్‌ అబాట్‌, ఎలిస్‌, బెరెన్‌డార్ఫ్‌, తన్వీర్‌ సంఘా.


వరుణుడు కరుణిస్తేనే..

రెండో టీ20కి వర్షం ముప్పుంది. తిరువనంతపురంలో శనివారం వర్షం పడింది. పిచ్‌ను రోజంతా కవర్లతో కప్పి ఉంచారు. ఆదివారం కూడా వరుణుడు ప్రభావం చూపేందుకు ఆస్కారముంది. మ్యాచ్‌ పూర్తిగా రద్దయ్యే ప్రమాదం లేదు కానీ.. అంతరాయం మాత్రం తప్పకపోవచ్చు.

  • తిరువనంతపురంలో భారత్‌ మూడు టీ20లు ఆడి.. రెండు విజయాలు సాధించింది. ఒకటి ఓడింది. 2017లో న్యూజిలాండ్‌ను, 2022లో దక్షిణాఫ్రికాను ఓడించిన టీమ్‌ఇండియా.. 2019లో వెస్టిండీస్‌ చేతిలో పరాజయం చవిచూసింది.
  • తిరువనంతపురంలో చివరగా ఈ ఏడాది జనవరిలో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్‌ రికార్డు స్థాయిలో 317 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని