IPL 2024 Auction: వేలంలో పంజాబ్ కింగ్స్‌ పొరపాటు.. అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌కు ఛాన్స్‌!

ఐపీఎల్‌ వేలం (IPL 2024 Auction) ద్వారా చాలా మంది యువ ఆటగాళ్లకు మెగా టోర్నీలో పాల్గొనే అవకాశం దక్కింది. అయితే, ఓ ప్లేయర్‌కు మాత్రం అనుకోకుండా అదృష్టం వరించింది.

Updated : 20 Dec 2023 16:00 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌ వేలంలో (IPL 2024) కొందరికి కాసుల వర్షం కురిసింది. మరికొందరికేమో అనుకున్నంత రాలేదు. కానీ, ఓ ఆటగాడు మాత్రం అనూహ్యంగా బిడ్‌ను దక్కించుకోవడం విశేషం. పంజాబ్‌ కింగ్స్‌ (Punjab Kings) చేసిన పొరపాటుకు అతడికి వరంగా మారిపోయింది. ఇంతకీ అసలేం జరిగింది? ఆ ఆటగాడు ఎవరంటే? 

వేలం చివరి దశకు చేరుకున్న వేళ.. అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ల బిడ్డింగ్‌ వేగంగా సాగింది. ఈ క్రమంలో శశాంక్‌ సింగ్‌ అనే ఆటగాడి పేరును రూ. 20 లక్షల కనీస ధరతో ఆక్షనీర్‌ మల్లికా సాగర్‌ ప్రారంభించారు. వెంటనే పంజాబ్‌ కింగ్స్‌ సహ యజమాని ప్రీతి జింతా బిడ్డింగ్‌ వేసినట్లు సిగ్నల్ ఇచ్చారు. ఆ తర్వాత సహచరులతో ప్రీతి జింతా మాట్లాడుతూ ఉండగానే శశాంక్‌ను పంజాబ్‌ రూ. 20 లక్షలకు దక్కించుకున్నట్లు ఆక్షనీర్‌ ప్రకటించారు. పంజాబ్‌ మినహా.. ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో వేలం ముగిసినట్లు ఆక్షనీర్ తెలిపారు. ఆ వెంటనే వేరే ఆటగాడి వేలానికి వెళ్లిపోయారు. ఈ సమయంలోనే పంజాబ్‌ కింగ్స్‌ తాము చేసిన పొరపాటును గ్రహించింది. 

అంగీకరించని ఆక్షనీర్..

మరో ప్లేయర్‌ అనుకుని శశాంక్‌ను తీసుకున్నట్లు గ్రహించిన పంజాబ్‌ కింగ్స్‌ ప్రతినిధులు వెంటనే ఆక్షనీర్‌ దృష్టికి తీసుకెళ్లారు. నెస్‌వాడియా, ప్రీతి జింతా కాస్త అసహనం వ్యక్తం చేసిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా వారు ఆక్షనీర్‌ మల్లికాసాగర్‌ దృష్టికి తీసుకెళ్లారు. 

‘‘ఇది సరైన పేరు కాదా? మీరు ఆ ప్లేయర్‌ను వద్దనుకుంటున్నారా?’’ అని మల్లికా సాగర్‌ ప్రశ్నించారు. దానికి సమాధానంగా ‘మేం కోరుకోలేదు’ అని పంజాబ్‌ పేర్కొంది. 

‘‘మేం మాట్లాడుతోంది శశాంక్‌ సింగ్‌ గురించి. కానీ, మీరు వద్దని చెప్పేసరికి బిడ్డింగ్‌ ముగిసింది. కాబట్టి, వరుస క్రమంలోని 236, 237 నంబర్ల ఆటగాళ్లు ఇద్దరూ మీకే’’ అని మల్లికా ప్రతిస్పందించారు. తొలుత వద్దనుకున్న ఆటగాడిని పంజాబ్‌ కింగ్స్‌.. చివరికి తమ జట్టులోకి తీసుకోవాల్సి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని