Hyderabad Vs Punjab: ఒత్తిడిలోనూ ఏమాత్రం తొణక్కుండా.. మనోడు అదుర్స్‌

పంజాబ్‌ కింగ్స్‌తో పోరులో నెమ్మదిగా ఉన్న ముల్లాన్‌పుర్‌ పిచ్‌పై బంతి బ్యాట్‌ మీదకు రావట్లేదు. 64కే 4 కీలక వికెట్లు పడిపోయాయి.

Updated : 10 Apr 2024 07:40 IST

ముల్లాన్‌పుర్‌: పంజాబ్‌ కింగ్స్‌తో పోరులో నెమ్మదిగా ఉన్న ముల్లాన్‌పుర్‌ పిచ్‌పై బంతి బ్యాట్‌ మీదకు రావట్లేదు. 64కే 4 కీలక వికెట్లు పడిపోయాయి. ఈ స్థితిలో అదిరే ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను నిలబెట్టాడు కాకి నితీశ్‌ కుమార్‌రెడ్డి. ఒత్తిడిలోనూ ఏమాత్రం తొణక్కుండా ఎదురుదాడి చేసి ప్రత్యర్థి బౌలర్లను చెదరగొట్టాడీ 20 ఏళ్ల ఈ ఆంధ్ర ఆల్‌రౌండర్‌. దేశవాళీ క్రికెట్లోనూ పెద్దగా అనుభవం లేని ఈ విశాఖపట్నం కుర్రాడు.. రబాడ, సామ్‌ కరన్‌ లాంటి అంతర్జాతీయ పేసర్లను దీటుగా ఎదుర్కొన్న తీరును మెచ్చుకోవాల్సిందే. ముఖ్యంగా రబాడ బౌలింగ్‌లో హుక్‌ షాట్‌తో కొట్టిన సిక్సర్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతడి మెరుపులతోనే సన్‌రైజర్స్‌ భారీ స్కోరు చేసింది.

ఐపీఎల్‌-17లో రెండో మ్యాచ్‌ మాత్రమే ఆడుతున్న నితీశ్‌ను 2023లో రూ.20 లక్షల కనీస ధరతో సన్‌రైజర్స్‌ సొంతం చేసుకుంది. తొలి సీజన్లో అతడికి పెద్దగా అవకాశాలు రాలేదు. రెండే మ్యాచ్‌లు ఆడాడు. ఈ సీజన్లో అతడిని ఫినిషర్‌గా ఉపయోగించుకోవాలని ఎస్‌ఆర్‌హెచ్‌ భావించింది. దానికి తగ్గట్టుగానే చెన్నైతో మ్యాచ్‌లో లోయర్‌ మిడిలార్డర్లో బరిలోకి దింపింది. ఈ మ్యాచ్‌లో ఛేదనలో 8 బంతుల్లో 14 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కానీ పంజాబ్‌పై కాస్త ముందుగా బ్యాటింగ్‌కు వచ్చి అర్ధసెంచరీతో అదరగొట్టాడు. ఇప్పటిదాకా 17 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన నితీశ్‌.. 29.96 సగటుతో 566 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 52 వికెట్లు పడగొట్టాడు. 2020లో కేరళపై రంజీ అరంగేట్రం చేసిన నితీశ్‌.. ఛేదనలో లోయర్‌ఆర్డర్‌లో దిగి 39 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని