Shikhar Dhawan: కెప్టెన్సీ పోతుందని నేనెప్పుడూ భయపడలేదు: శిఖర్ ధావన్‌

కివీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ కోసం శిఖర్ ధావన్‌ నాయకత్వంలోని భారత్‌ సిద్ధమవుతోంది. రోహిత్ గైర్హాజరీలో ధావన్‌ సారథ్య బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. 

Published : 23 Nov 2022 18:04 IST

ఇంటర్నెట్ డెస్క్‌: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను పట్టేసిన టీమ్‌ఇండియా.. మరో రెండు రోజుల్లో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ను ఆడనుంది. భారత కెప్టెన్‌గా శిఖర్ ధావన్ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. ఇటీవలే టీ20 లీగ్‌లోని పంజాబ్‌ ఫ్రాంచైజీకి సారథిగా ధావన్‌ను నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా కివీస్‌తో వన్డే సిరీస్‌తోపాటు పంజాబ్‌ కెప్టెన్సీపై శిఖర్ ధావన్‌ స్పందించాడు.

‘‘కెప్టెన్‌గా ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే మనం కచ్చితమైన నిర్ణయాలు తీసుకొనేందుకు నమ్మకం కలుగుతుంది. ఇంతకుముందు బౌలర్‌కు ఇబ్బందిగా ఉన్నప్పటికీ అదనంగా ఓవర్‌ వేయించేవాడిని. కానీ ఇప్పుడు జట్టు అవసరాలకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవడంలో పరిణితి సాధించా. నాయకత్వ లక్షణాలు వృద్ధి చెందాలంటే జట్టును బ్యాలెన్స్‌ చేసుకుంటూ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. ఎవరైనా ఆటగాడు ఒత్తిడికి గురైతే.. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడేసి సంతోషంగా ఉండేలా చూడాలి. ఉదాహరణకు బౌలర్‌ విషయానికొస్తే.. అతడి బౌలింగ్‌ను ప్రత్యర్థులు బాదేస్తున్నారనుకోండి.. అప్పుడు సదరు బౌలర్ కాస్త కోపం మీద ఉంటాడు. అందుకే ఆ సమయంలో కాకుండా పరిస్థితి చల్లబడిన తర్వాత నెమ్మదిగా మాట్లాడాలి. ఇదంతా నాయకత్వం వహించే స్థాయిని బట్టి ఉంటుంది. భారత టీ20 లీగ్‌లో అయితే ఎక్కువ మంది అంతర్జాతీయ ఆటగాళ్లే ఉంటారు. అదే రంజీ ట్రోఫీలో అయితే మరోలా ఆటగాళ్లతో వ్యవహరించాల్సి ఉంటుంది’’

పంజాబ్‌కు కెప్టెన్‌ కావడంపై..

‘‘గతంలో చేసిన తప్పిదాల నుంచి నేర్చుకొని మా జట్టును తీర్చిదిద్దుతా. అయితే గత ప్రదర్శనలనే తలచుకొంటూ ఉండాల్సిన అవసరం లేదు. తప్పకుండా మా సహాయక సిబ్బందితో కలిసి జట్టులో ఆటగాళ్లందరూ సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు తీసుకుంటా. అయితే వారి సహజమైన ఆటను ఆడటంతోపాటు బాధ్యతలను అర్థమయ్యేలా చెప్పడం చాలా ముఖ్యం. అందుకే రిలాక్స్‌గా ఉంచడంతోపాటు లక్ష్యం వైపు దృష్టిసారించేలా చేస్తా. భారత టీ20 లీగ్‌లో ఆడటం చాలా మందికి కల. అలాంటి డ్రీమ్‌ నెరవేర్చుకునే క్రమంలో సంతోషం తప్ప ఒత్తిడి అనేది ఉండదు. ట్రోఫీని గెలవడం మరీ కష్టమైందేమీ కాదు. అయితే అదే సమయంలో సారథ్యం పోతుందన్న ఆందోళన కూడా లేదు’’ అని పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని