Shubman Gill: కొత్త కింగ్‌ గిల్‌

జోరుమీదున్న భారత యువ సంచలనం శుభ్‌మన్‌ గిల్‌ మరో అరుదైన ఘనత అందుకున్నాడు.

Updated : 09 Nov 2023 09:46 IST

బౌలర్లలో సిరాజ్‌ మేటి
వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి

దుబాయ్‌: జోరుమీదున్న భారత యువ సంచలనం శుభ్‌మన్‌ గిల్‌ మరో అరుదైన ఘనత అందుకున్నాడు. వన్డే బ్యాటర్‌ ర్యాంకింగ్స్‌లో   అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. బుధవారం ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌ జాబితాలో బాబర్‌ అజామ్‌ (824- పాకిస్థాన్‌)ను వెనక్కి నెట్టిన గిల్‌ 830 పాయింట్లతో నంబర్‌వన్‌ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. సచిన్‌ తెందుల్కర్‌, మహేంద్ర సింగ్‌ ధోని, విరాట్‌ కోహ్లి తర్వాత ఈ ఘనత సాధించిన భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ప్రస్తుత ర్యాంకింగ్స్‌లో కోహ్లి (770),  రోహిత్‌ (739) వరుసగా 4, 6 స్థానాల్లో నిలిచారు. బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో సిరాజ్‌ (709) నంబర్‌వన్‌ స్థానాన్ని తిరిగి సొంతం చేసుకున్నాడు. కుల్‌దీప్‌ యాదవ్‌ (661), బుమ్రా (654), మహ్మద్‌ షమి (635) వరుసగా 4, 8, 10 ర్యాంకుల్లో నిలిచారు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో షకిబుల్‌ హసన్‌ (బంగ్లాదేశ్‌) నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. రవీంద్ర జడేజా పదో స్థానంలో ఉన్నాడు. టీమ్‌ ర్యాంకింగ్స్‌లో టెస్టు, వన్డే, టీ20ల్లో భారత్‌ నం.1 జట్టుగా కొనసాగుతోంది.

నయా సంచలనం

దిగ్గజం సచిన్‌ రికార్డులను తిరగరాస్తూ కోహ్లి దూసుకెళ్తున్నాడు. కానీ 35 ఏళ్ల కోహ్లి తర్వాత భారత క్రికెట్లో ఎవరు? అనే ప్రశ్నకు సమాధానంగా ఇప్పుడు శుభ్‌మన్‌ గిల్‌ నిలుస్తున్నాడు. అంచనాలను అందుకుంటూ, నిలకడైన ఆటతీరుతో సాగిపోతున్నాడు. ముఖ్యంగా వన్డేల్లో అదరగొడుతున్నాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ర్యాంకు సాధించిన భారత బ్యాటర్లలో ధోని (31 ఇన్నింగ్స్‌) తర్వాత అతని (41 ఇన్నింగ్స్‌)ది రెండో స్థానం. 2019 జనవరిలోనే వన్డేల్లో అరంగేట్రం చేసినా అతను 2020 డిసెంబర్‌ వరకు మూడు మ్యాచ్‌ల్లోనే ఆడగలిగాడు. జట్టులో పోటీనే అందుకు కారణం. కానీ తిరిగి నిరుడు జులైలో జట్టులోకి వచ్చిన శుభ్‌మన్‌ తగ్గేదేలేదంటూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఆరు సెంచరీలు బాదాడు. ఈ ఏడాది జనవరిలో ఉప్పల్‌ స్టేడియంలో న్యూజిలాండ్‌పై ద్విశతకం కూడా అందుకున్నాడు. ఇప్పుడు ప్రపంచకప్‌లోనూ జోరు కొనసాగిస్తున్నాడు. డెంగీ జ్వరం కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తిరిగొచ్చి రెండు అర్ధశతకాలు (బంగ్లాపై 53, శ్రీలంకపై 92) చేశాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకూ 41 మ్యాచ్‌ల్లో 61.02 సగటుతో అతను 2136 పరుగులు సాధించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని