మహీ ఆడితే డబ్బు సమకూరుస్తా!

టీమ్ఇండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ వచ్చే ఏడాది జరిగే ‘100 బంతులు’ టోర్నీ ఆడతానంటే ఎక్కడో ఓ చోట డబ్బు సమకూరుస్తానని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ షేన్‌వార్న్‌ అన్నాడు. అతడో అద్భుతమైన క్రికెటర్‌, కెప్టెన్‌ అని ప్రశంసించాడు. అత్యుత్తమ నాయకులు ఉండే జట్లే మ్యాచులు గెలుస్తాయని...

Updated : 17 Aug 2020 18:35 IST

‘వంద బంతుల’ కోసం షేన్‌వార్న్‌ ప్రతిపాదన

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: టీమ్ఇండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ వచ్చే ఏడాది జరిగే ‘100 బంతులు’ టోర్నీ ఆడతానంటే ఎక్కడో ఓ చోట డబ్బు సమకూరుస్తానని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ షేన్‌వార్న్‌ అన్నాడు. అతడో అద్భుతమైన క్రికెటర్‌, కెప్టెన్‌ అని ప్రశంసించాడు. అత్యుత్తమ నాయకులు ఉండే జట్లే మ్యాచులు గెలుస్తాయని వెల్లడించాడు.

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమిపాలైన తర్వాత మహీ మైదానంలో కనిపించలేదు. అతడి వీడ్కోలుపై అనేక ఊహాగానాలు వచ్చాయి. ఐపీఎల్‌-2020లో రాణిస్తే ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు పోటీలో ఉంటాడని అంతా భావించారు. కరోనా వైరస్‌ ముప్పుతో రెండు టోర్నీలూ వాయిదా పడటంతో కొన్నాళ్లు సందడి కనిపించలేదు. సెప్టెంబర్‌ 19న యూఏఈ వేదికగా ఐపీఎల్‌ మళ్లీ జరుగుతుందని ప్రకటించగానే అందరి దృష్టి అతడిపై నెలకొంది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆగస్టు 15 సాయంత్రం ధోనీ వీడ్కోలు ప్రకటించేశాడు.

‘వచ్చే ఏడాది జరిగే ‘ది హండ్రెడ్‌’లో లండన్‌ స్పిరిట్‌కు మహీని తీసుకొస్తే అద్భుతమే. లార్డ్స్‌లో ఆడేందుకు ఆసక్తిగా ఉన్నాడో లేదో ఒకసారి మాట్లాడతాను. ఒకవేళ అంగీకరిస్తే ఎక్కడో ఓ చోట డబ్బు సమకూరుస్తా’ అని ఇంగ్లాండ్‌-పాక్‌ మ్యాచుకు కామెంటరీ చేస్తూ షేన్‌వార్న్‌ వ్యాఖ్యానించాడు. టీ20కి పోటీగా ఇంగ్లాండ్‌ వంద బంతుల టోర్నీని తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదే టోర్నీ ఆరంభం కావాల్సి ఉండగా కరోనా వైరస్‌ ముప్పుతో 2021కి వాయిదా వేశారు. ఒకవేళ ఇష్టపడితే ఐపీఎల్‌ ఆడుతున్న మహీకి బీసీసీఐ అనుమతి ఇస్తుందో లేదో చూడాల్సి ఉంది.

‘టీ20ల్లో అత్యుత్తమ నాయకులు ఉన్న జట్లు సాధారణంగా ఫైనల్‌కు వస్తుంటాయి. పొట్టి క్రికెట్లో ఇదే కీలకం. చెన్నై సూపర్‌కింగ్స్‌ మూడుసార్లు ఐపీఎల్‌ గెలిచిన సంగతి తెలిసిందే. మహీ అద్భుతమైన క్రికెటర్‌. అతడే ముందుండి కొన్ని మ్యాచులు గెలిపించాడు. నాయకత్వం పరంగా తిరుగులేదు. ప్రత్యర్థి జట్లకు గట్టిపోటీనిస్తాడు. చరిత్రలో గొప్ప వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌గా నిలిచిపోతాడు. అతడెంతో ప్రశాంతంగా ఉంటాడు. ఆడేది టీమ్‌ఇండియా లేదా చెన్నై అయినా జట్టు అత్యుత్తమ ఆటతీరును బయటకి తీసుకొస్తాడు. అందుకే తన జట్టు ఆటగాళ్లందరూ ఎంఎస్‌డీని గౌరవిస్తారు’ అని వార్న్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని