Team India: బుమ్రా లేకపోతే.. మిగతా బౌలర్లు బాధ్యత తీసుకోవాలి!

టీ20 ఫార్మాట్‌లో డెత్‌ ఓవర్లు చాలా కీలకమని టీమ్‌ఇండియా మాజీ సెలెక్టర్‌ సబా కరీం వ్యాఖ్యానించాడు. ఆరంభ ఓవర్లలో బాగానే వేస్తున్నప్పటికీ.. చివర్లో భారత బౌలర్లు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నాడు.

Published : 30 Sep 2022 18:55 IST

ఇంటర్నెట్ డెస్క్‌: డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌ చేయడం ఆషామాషీ వ్యవహారం కాదని.. అయితే బుమ్రా లేని లోటును మిగతా బౌలర్లు పూడ్చాలని టీమ్‌ఇండియా మాజీ సెలెక్టర్ సబా కరీం సూచించాడు. వెన్నునొప్పి కారణంగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరమైన బుమ్రా.. వచ్చే నెల ఆసీస్‌ వేదికగా ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్‌నకూ దూరమయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో బుమ్రాకి బదులు దక్షిణాఫ్రికాతో మిగతా టీ20లకు హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. బుమ్రా గైర్హాజరీతో డెత్‌ బౌలింగ్‌ బలహీనంగా ఉంటుందనే ఆందోళన సర్వత్రా నెలకొంది. ఈ క్రమంలో మాజీ సెలెక్టర్‌ సబా కరీం కీలక సూచనలు చేశాడు. మహమ్మద్‌ షమీ, అర్ష్‌దీప్‌ సింగ్‌, భువనేశ్వర్‌ వంటి బౌలర్లు భారత్‌కు ఉన్నారని, అయితే మరింత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు.

‘‘కొత్త బంతితో బౌలింగ్‌ చేసేందుకు భారత్‌ వద్ద చాలా ఆప్షన్లు ఉన్నాయి. ఇప్పటికే భువనేశ్వర్‌ కుమార్ అద్భుతంగా వేస్తున్నాడని తెలుసు. తాజాగా అర్ష్‌దీప్‌ సింగ్‌ కూడా నిరూపించుకొన్నాడు. అలాగే షమీ కూడా సీనియర్‌ పేసర్. అయితే టీమ్‌ఇండియాకు సమస్య డెత్ ఓవర్లు. తీవ్ర ఒత్తిడి సమయంలోనూ బౌలింగ్‌ చేయగల సామర్థ్యం ఉన్న బౌలర్లను గుర్తించాలి. ఒకవేళ బుమ్రా దూరమైతే ఇతర బౌలర్లు బాధ్యత వహించి అత్యుత్తమంగా రాణించాలి. అయితే అంత సులువైన వ్యవహారం మాత్రం కాదు’’ అని సబా కరీం వెల్లడించాడు. 

డెత్‌ ఓవర్లలో భువీ వద్దు: డానిష్ కనేరియా

పవర్‌ప్లేలో అద్భుతంగా బౌలింగ్‌ వేసే భారత సీనియర్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ చివరి ఓవర్లలో మాత్రం తేలిపోతున్నాడు. ఈ క్రమంలో పాక్‌ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా కూడా భువీకి డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌ ఇవ్వొద్దని పేర్కొన్నాడు. ‘ఆసీస్‌ పిచ్‌లపై స్వింగ్‌ కష్టం. హార్డ్‌ ట్రాక్స్ మీదనే మ్యాచ్‌లను ఆడాల్సి ఉంటుంది. అందుకే భువనేశ్వర్‌ కుమార్‌ డెత్‌ ఓవర్లలో సరైన ఎంపిక కాదు’’ అని కనేరియా తెలిపాడు. గత ఆసియా కప్‌ నుంచి మొన్న ఆసీస్‌తో సిరీస్‌ వరకు భువనేశ్వర్‌ కుమార్‌ డెత్‌ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకొని విమర్శలపాలైన సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని