IND VS ENG: విజయానికి చేరువలో భారత్‌

రెండో సెషన్‌లో భారత బౌలర్లు విజృంభించారు. వెంట వెంటనే కీలక వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను కోలుకోలేని దెబ్బ తీశారు. 27.1 ఓవర్ల పాటు  సాగిన ఈ సెషన్‌లో భారత బౌలర్లు 55 పరుగులిచ్చి 6 వికెట్లు తీశారు.

Updated : 06 Sep 2021 20:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో సెషన్‌లో భారత బౌలర్లు విజృంభించారు. వెంట వెంటనే కీలక వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను కోలుకోలేని దెబ్బ తీశారు. దీంతో టీ విరామ సమయానికి ఆ జట్టు 8 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. ఆ జట్టు విజయం సాధించాలంటే ఇంకా 175 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో రెండే వికెట్లు ఉండడంతో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఇంగ్లాండ్‌ గెలవడం అసాధ్యం. ప్రస్తుతం ఓవర్టన్‌ (3) క్రీజులో ఉన్నాడు.

క్రీజులో పాతుకుపోయిన ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌ హసిబ్‌ హమీద్‌ (63)ను జడేజా క్లీన్‌ బౌల్డ్‌ చేసి ఇంగ్లాండ్‌ను దెబ్బ తీశాడు. అక్కడికి కొద్ది సేపటికే ఓలీ పోప్‌ (2)ని, తర్వాతి ఓవర్లో మొయిన్‌ అలీ (0)ని బుమ్రా పెవిలియన్‌కు పంపించాడు. వరుసగా వికెట్లు కోల్పోతుండటంతో నిలకడగా ఆడుతూ క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నిస్తున్న కెప్టెన్‌ జో రూట్‌ (36)ను సైతం శార్ధూల్‌ ఠాకూర్‌ బౌల్డ్‌ చేశాడు. ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో క్రిస్‌ వోక్స్‌ (18)ను క్యాచ్‌ ఔటయ్యాడు. దీంతో కీలక వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌ చేతిలో రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఇంకా విజయానికి 175 పరుగులు చేయాల్సి ఉండడంతో భారత్‌ విజయం లాంఛనం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని