IND vs SL: రిషభ్‌ పంత్‌ వికెట్‌ కీపింగ్‌పై దినేశ్‌ కార్తిక్‌ కామెంట్స్‌... ఏమన్నాడంటే?

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో రిషభ్‌ పంత్‌ అద్భుతంగా కీపింగ్‌ చేశాడని వెటరన్‌ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు. ఈ మ్యాచ్‌లో పంత్‌ (96) బ్యాటింగ్‌లో ధనాధన్‌...

Updated : 07 Mar 2022 14:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో రిషభ్‌ పంత్‌ అద్భుతంగా కీపింగ్‌ చేశాడని వెటరన్‌ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు. ఈ మ్యాచ్‌లో పంత్‌ (96) బ్యాటింగ్‌లో ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడినా కీపింగ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేశాడని మెచ్చుకున్నాడు. తాజాగా ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడిన డీకే యువ కీపర్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు.

‘పంత్‌ బ్యాటింగ్‌ గురించి తెలిసిందే. దాని గురించి ఎంతైనా మాట్లాడొచ్చు. కానీ, వ్యక్తిగతంగా అతడికి ఈ టెస్టులో చెప్పుకోదగిన విశేషం ఏమిటంటే.. బాగా కీపింగ్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో కొన్ని క్యాచ్‌లు అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా నిశాంక క్యాచ్‌ను పట్టిన తీరు అమోఘం. అది చాలా కష్టమైంది కూడా ఒడిసిపట్టాడు. ఎవరైనా ఆఫ్‌స్పిన్నర్‌ రఫ్‌ పిచ్‌పై టర్న్‌ తీసుకునే బంతులు వేస్తే కీపర్‌కు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో బంతి ఎటువైపు వెళుతుందో అర్థంకాదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ పంత్‌ చాలా గొప్పగా కీపింగ్‌ చేశాడు. అది నన్ను ఎంతగానో ఆకట్టుకుంది’ అని డీకే చెప్పుకొచ్చాడు.

‘వికెట్‌ కీపింగ్‌ విభాగంలో ప్రాక్టీస్‌ చేసేటప్పుడు ఇలాంటి బంతులను దృష్టిలో పెట్టుకోవాలి. ఈ విషయంలో పంత్‌ చాలా కష్టపడ్డాడని తెలుస్తోంది. పిచ్‌ స్వభావానికి తగ్గట్టుగా కీపింగ్‌ చేసేవారు చాలా చురుకుగా ఉండాలి. మ్యాచ్‌లో బంతులు ఎప్పుడు ఎలా టర్న్‌ అవుతాయో తెలియదు. అలాంటప్పుడు వికెట్‌ కీపర్లు చాకచక్యంతో స్పందించాలి. అందుకోసం చాలా కష్టపడాలి. ఈ టెస్టు చూస్తే పంత్‌ ఆ విషయంలో మెరుగయ్యాడని అర్థమవుతోంది. దీంతో ఇంతకుముందు కన్నా ఇప్పుడు బాగా కీపింగ్‌ చేస్తున్నాడు’ అని దినేశ్‌ కార్తీక్‌ అభినందించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో పంత్‌ మొత్తం 3 క్యాచ్‌లు అందుకున్నాడు. ఆ మూడు కూడా రెండో ఇన్నింగ్స్‌లోనే రావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని