IND vs PAK: టీమ్‌ఇండియా అలా చేస్తుందనుకోవడం లేదు : రమీజ్‌ రజా

త్వరలో పాకిస్థాన్‌లో నిర్వహించనున్న ఐసీసీ టోర్నమెంట్ల నుంచి టీమ్‌ఇండియా వైదొలుగుతుందని తాను అనుకోవడం లేదని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ రమీజ్‌ రజా అన్నాడు. ఇరు దేశాల..

Published : 19 Nov 2021 01:49 IST

ఇంటర్నెట్ డెస్క్: త్వరలో పాకిస్థాన్‌లో నిర్వహించనున్న ఐసీసీ టోర్నమెంట్ల నుంచి టీమ్‌ఇండియా వైదొలుగుతుందని తాను అనుకోవడం లేదని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ రమీజ్‌ రజా అన్నాడు. ఇరు దేశాల మధ్య రాజకీయ అనిశ్చితి ఉన్నంత కాలం.. భారత్‌, పాక్‌ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చని పేర్కొన్నాడు. ‘అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) టోర్నమెంట్లు నిర్వహిస్తున్నంత కాలం భారత జట్టు.. పాకిస్థాన్‌లో నిర్వహించే సిరీస్‌ల నుంచి వైదొలగలేదు. ఒక వేళ సిరీస్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటిస్తే ఇతర జట్ల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురుకోవాల్సి వస్తుంది. అందుకే, భారత్ అలా చేస్తుందనుకోవడం లేదు. అలాగే, టీమ్‌ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహించడం చాలా కష్టం. కానీ, త్రైపాక్షిక సిరీస్‌లు నిర్వహిస్తే ఇరు జట్లు తలపడే అవకాశం ఉంది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. అతడితో మాట్లాడి క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాం. అయితే, ఇరుదేశాల మధ్య రాజకీయ అనిశ్చితి ఉన్నంత కాలం అదేమంత సులభం కాదు’ అని రమీజ్ రజా పేర్కొన్నాడు.

2023 ఆసియా కప్‌, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో భారత క్రీడల మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘సమయం వచ్చినప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తాం. హోం మంత్రిత్వ శాఖ సలహా మేరకు నిర్ణయం తీసుకుంటాం. భద్రతా కారణాల దృష్ట్యా చాలా దేశాలు పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకుంటున్నాయి. మేం కూడా భద్రతను సమీక్షించిన తర్వాత నిర్ణయాన్ని వెల్లడిస్తాం’ అని అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. 2005-06 నుంచి ఇప్పటి వరకు టీమిండియా పాకిస్థాన్‌లో పర్యటించలేదు. అలాగే, 2012-13 నుంచి భారత్, పాక్‌ జట్ల ఒక్క ద్వైపాక్షిక సిరీస్ కూడా జరుగకపోవడం గమనార్హం.

 

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని