India vs South Africa: పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా.. మరో సిరీస్‌ భారత్‌ వశం

భారత్‌ వరుసగా మరో సిరీస్‌ను పట్టేసింది. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ పరుగుల 16 తేడాతో విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 238 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆ జట్టు ఛేదించలేకపోయింది.

Updated : 02 Oct 2022 23:45 IST

గువహటి: భారత్‌ వరుసగా మరో సిరీస్‌ను పట్టేసింది. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ పరుగుల 16 తేడాతో విజయం సాధించింది.  238 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. డేవిడ్‌ మిల్లర్‌(106 నాటౌట్‌: 47 బంతుల్లో 7 సిక్స్‌లు, 8 ఫోర్లు ), క్వింటన్‌ డికాక్‌(69 నాటౌట్‌: 48 బంతుల్లో) కడదాకా నిలిచి పోరాడినప్పటికీ తమ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 174 పరుగులను జోడించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ 2, అక్షర్ పటేల్ ఒక వికెట్‌ తీశారు. ఇక నామమాత్రమైన మూడో టీ20 ఇండోర్‌ వేదికగా మంగళవారం జరగనుంది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా కేఎల్ రాహుల్‌ అవార్డు సొంతం చేసుకొన్నాడు. 

చెలరేగిన సూర్యకుమార్‌

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల కోల్పోయి 237 పరుగులు చేసింది. తొలుత ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌(57), రోహిత్‌(43) వీరవిహారంతో జట్టుకు మంచి శుభారంభం ఇచ్చారు. అనంతరం సూర్యకుమార్‌ యాదవ్‌(61), కోహ్లీ(49 నాటౌట్‌) విరుచుకుపడ్డారు. శతక (102) భాగస్వామ్యం నిర్మించారు. ఈ క్రమంలో సూర్యకుమార్‌ టీ20ల్లో అత్యంత వేగంగా (573 బంతులు) వెయ్యి పరుగుల మార్క్‌ను తాకిన బ్యాటర్‌గా అవతరించాడు. అయితే 18.1 ఓవర్లలో 209 పరుగుల వద్ద సూర్యకుమార్‌ ఔటైనప్పటికీ.. టీమ్‌ఇండియా స్కోరు మాత్రం ఆగలేదు. బ్యాటింగ్‌కు దిగిన దినేశ్‌ కార్తిక్‌ (17*) చివర్లో బాదేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్‌ మహరాజ్‌ రెండు వికెట్లు తీశాడు. 

మ్యాచ్‌ గురించి మరికొన్ని విశేషాలు

* దక్షిణాఫ్రికాపై స్వదేశంలో తొలిసారి సిరీస్‌ను భారత్‌ నెగ్గింది. 

* డెత్‌ ఓవర్ల (16 నుంచి 20)లో భారీగా పరుగులు వచ్చిన మ్యాచ్‌ ఇదే. మొత్తం 160 పరుగులు వచ్చాయి. భారత్‌ ఇన్నింగ్స్‌లో 82 పరుగులు రాగా.. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో 78 పరుగులను బౌలర్లు సమర్పించారు. 

* అంతర్జాతీయ టీ20ల్లో ఓడిపోయిన మ్యాచుల్లో శతకాలు సాధించిన రెండో బ్యాటర్‌ డేవిడ్ మిల్లర్ (106*). అంతకుముందు టీమ్‌ఇండియా వైస్‌ కెప్టెన్‌ కేఎల్ రాహుల్ (110*) కావడం విశేషం. 

* అంతర్జాతీయ టీ20ల్లో నాలుగో వికెట్‌కు 174 పరుగులు జోడించిన డికాక్- మిల్లర్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని