IND vs ENG: ‘బెస్ట్‌ ఫీల్డర్‌’ మెడల్‌.. మిరుమిట్లు గొలిపేలా ప్రకటించిన కోచ్‌

ఇంగ్లాండ్‌ను కట్టడి చేయడంలో భారత (IND vs ENG) బౌలర్ల శ్రమ ఎంత ఉందో.. ఫీల్డర్లూ అదేస్థాయిలో కష్టపడ్డారు. సింగిల్స్‌ తీసే అవకాశం కూడా ఇవ్వకుండా కట్టుదిట్టమైన ఫీల్డింగ్‌తో అదరగొట్టారు.

Updated : 30 Oct 2023 12:48 IST

ఇంటర్నెట్ డెస్క్‌: డ్రెస్సింగ్‌ రూమ్‌ను మరింత ఉత్సాహంగా మారుస్తూ.. మైదానంలో అత్యుత్తమ ఫీల్డింగ్‌ను ప్రదర్శించే ఆటగాళ్లకు పతకాలను భారత మేనేజ్‌మెంట్ (Team India) ఇస్తోంది. ఇప్పటికే విరాట్ కోహ్లీ, శార్దూల్‌, రవీంద్ర జడేజా, శ్రేయస్‌ అయ్యర్, కేఎల్ రాహుల్ ఈ పతకాలను సాధించారు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ కేఎల్‌కే దక్కింది. ఈ సందర్భంగా ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం గణాంకాలను చూసి మాత్రమే కాదు.. మైదానంలో వ్యవహరించిన తీరును కూడా పరిగణనలోకి తీసుకుని ‘బెస్ట్ ఫీల్డర్‌’ ఎవరనేది ప్రకటిస్తున్నట్లు కోచ్‌ దిలీప్‌ వెల్లడించారు. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో ముగ్గురి మధ్య తీవ్ర పోటీ ఎదురైందని.. చివరికి ఒకరిని ఎంపిక చేసినట్లు ప్రకటించారు. కేఎల్ రాహుల్, ఇషాన్‌ కిషన్‌, మహమ్మద్‌ సిరాజ్‌ తీవ్రంగా పోటీ పడ్డారని.. రాహుల్‌ ‘బెస్ట్‌ ఫీల్డర్’ పతకాన్ని దక్కించుకున్నట్లు దిలీప్‌ తెలిపారు. ఈ సారి ఎల్‌ఈడీ లైట్లతో విజేత పేరును ప్రకటించడం విశేషం.

‘‘ఈ మెడల్ అనేది కేవలం గణాంకాల గురించి కాదు. అలాగే ఒక మంచి క్యాచ్‌ పట్టడమో.. కొన్ని పరుగులను కాపాడటమో చేస్తేనే సరిపోదు. మైదానంలో ఎవరు అలాంటి స్ఫూర్తిని తీసుకువచ్చారనేది కీలకం. మ్యాచ్‌లో వారు చేసే బాధ్యత ఎంతమేర ప్రభావం చూపిందనేది కూడా ముఖ్యమే. అలాంటివన్నీ లెక్కలోకి వస్తాయి. వారే విజేతలుగా నిలుస్తారు. అలాంటి వారిలో ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌ మంచి కంట్రిబ్యూషన్‌ ఇచ్చాడు. అతడే ఈసారి బెస్ట్ ఫీల్డర్‌ విన్నర్. బౌండరీ లైన్‌ వద్ద కొన్నింటిని వదిలేసినప్పటికీ సిరాజ్‌ కూడా శ్రమించిన తీరు బాగుంది. ఇషాన్‌ కిషన్‌ కూడా మైదానంలో చురుగ్గా ఉన్నాడు’’ అని దిలీప్‌ వెల్లడించారు. దీంతో  మెగా టోర్నీలో రెండోసారి ఈ మెడల్‌ కేఎల్ రాహుల్‌ సొంతమైంది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ బెస్ట్‌ ఫీల్డర్‌గా ఎంపికయ్యాడు. ఇక ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో ఒకే ఒక్క క్యాచ్‌ మాత్రమే వచ్చింది. దానిని కేఎల్‌ రాహుల్ అందుకున్నాడు. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ఇషాన్‌ కూడా మెరుపు ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. తేమ ప్రభావంతో బంతి బౌలర్‌ చేజారకుండా ఉండేందుకు విరాట్, జడేజాతో సహా ప్రతి ఫీల్డర్‌ ఎంతో కృషి చేశారని దిలీప్ అభినందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని