Asia Cup : ఆసియా కప్‌ నెగ్గేందుకు భారత్‌కే ఎక్కువ అవకాశాలు..!

మరో పన్నెండు రోజుల్లో యూఏఈ వేదికగా ఆసియా కప్‌ ప్రారంభం కానుంది. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీలో ...

Published : 16 Aug 2022 01:50 IST

పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ అంచనా

ఇంటర్నెట్ డెస్క్‌: మరో పన్నెండు రోజుల్లో యూఏఈ వేదికగా ఆసియా కప్‌ ప్రారంభం కానుంది. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీలో రాణించిన ఆటగాళ్లకు వచ్చే పొట్టి ప్రపంచకప్‌ జట్టులోకి మార్గం ఏర్పడినట్టే. అందుకే యువ ఆటగాళ్లతో సహా సీనియర్లూ ఆసియా కప్‌లో అదరగొట్టాలని చూస్తున్నారు. ఆసియా కప్‌ కోసం ఆరు జట్లు తలపడతాయి. వాటిల్లో భారత్‌, పాకిస్థాన్‌ ఫేవరేట్లుగా ఉండే అవకాశం ఉంది. శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ ఏదైనా సంచలనాలు నమోదు చేస్తాయేమో చూడాలి. ఈ క్రమంలో పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్ సల్మాన్‌ భట్‌ మాత్రం టీమ్‌ఇండియానే టైటిల్‌ ఫేవరేట్‌ అని చెబుతున్నాడు. జట్టు నిండా మంచి ప్లేయర్లు ఉండటం భారత్‌కు కలిసొస్తుందని పేర్కొన్నాడు. 

‘‘తప్పకుండా ఆసియా కప్‌ను భారత్ సొంతం చేసుకుంటుందని అనుకుంటున్నా. ఎందుకంటే జట్టులో అత్యుత్తమంగా రాణించే ఆటగాళ్లు ఉన్నారు. అందుకే టీమ్‌ఇండియాను ఫేవరేట్‌గా పరిగణిస్తా. అలాగే, పాకిస్థాన్‌ తమదైన రోజున ఎంతటి జట్టునైనా ఓడిస్తుంది. అఫ్గానిస్థాన్‌ కూడా సంచలనం నమోదు చేయగల సత్తా ఉన్న టీమ్‌. అందుకే అఫ్గాన్‌ను ‘డార్క్‌ హార్స్‌’గా పిలుస్తా’’ అని సల్మాన్‌ భట్‌ చెప్పుకొచ్చాడు. ఆగస్టు 27 నుంచి ఆసియా కప్‌ పోటీలు ప్రారంభమవుతాయి. మరుసటి రోజే (ఆగస్టు 28) భారత్, పాకిస్థాన్‌ మధ్య పోరు ఉంటుంది. ఇలాంటి మెగా టోర్నీల్లో తప్ప ఇరు జట్లూ బయట ఆడే అవకాశాలు లేకపోవడంతో ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని