SA vs IND: ఐదు సెషన్లలోనే మ్యాచ్‌ ముగింపు.. టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే అరుదైన రికార్డు

దక్షిణాఫ్రికా, భారత్ (SA vs IND) మధ్య జరిగిన రెండో టెస్టు ఐదు సెషన్లలోనే ముగిసింది. ఈ క్రమంలోనే ఓ అరుదైన రికార్డు నమోదైంది. 

Updated : 04 Jan 2024 21:22 IST

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్‌ (Team India) 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను రోహిత్ సేన 1-1 తేడాతో సమం చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాను 55 పరుగులకు ఆలౌట్‌ చేసిన భారత్.. అనంతరం బ్యాటింగ్ చేసి 153 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో సఫారీలు 176 పరుగులు చేయగా.. 79 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 12 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పిచ్‌ పేసర్లకు స్వర్గధామంలా మారడంతో మ్యాచ్‌ ఐదు సెషన్లలోనే ముగిసింది. ఈ క్రమంలోనే టెస్టు క్రికెట్‌లో ఓ అరుదైన రికార్డు నమోదైంది. టెస్టు క్రికెట్ చరిత్రలోనే అతి తక్కువ (642) బంతుల్లో ముగిసిన టెస్టుగా ఈ మ్యాచ్‌ రికార్డుల్లోకెక్కింది. అంతకుముందు 1932లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌ 656 బంతుల్లో ముగిసింది. ఇప్పుడు ఆ రికార్డు బ్రేక్‌ అయింది. 

కేప్‌టౌన్‌లో తొలిసారి.. మొదటి కెప్టెన్‌గా రోహిత్‌ రికార్డు 

కేప్‌టౌన్‌లో జరిగిన టెస్టుల్లో భారత్‌ విజయం సాధించడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు ఈ స్టేడియంలో టీమ్‌ఇండియా ఆరు మ్యాచ్‌లు ఆడి నాలుగింటిలో ఓడి రెండు మ్యాచ్‌లు డ్రా చేసుకుంది. ఈ మైదానంలో విజయం సాధించిన తొలి ఆసియా  కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ (Rohit Sharma) రికార్డు సృష్టించాడు. అంతేకాదు దక్షిణాఫ్రికాలో ధోనీ తర్వాత టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకున్న రెండో భారత కెప్టెన్‌గా నిలిచాడు. 

టెస్టుల్లో మళ్లీ అగ్రస్థానం

దక్షిణాఫ్రికాపై రెండో టెస్టులో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించడంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి దూసుకొచ్చింది. సఫారీలతో రెండు టెస్టు ప్రారంభానికి ముందు భారత్‌ ఆరో స్థానంలో ఉంది. ప్రస్తుతం భారత్ టాప్‌లో ఉండగా.. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 

ఒక్క సిరీస్‌నూ చేజార్చుకోలేదు

దక్షిణాఫ్రికా టూర్‌లో మూడేసి టీ20లు, వన్డేలు, రెండు టెస్టులు ఆడిన భారత్ ఒక్క సిరీస్‌ కూడా కోల్పోలేదు. పొట్టి సిరీస్‌ను 1-1 తేడాతో సమం చేసిన టీమ్ఇండియా.. వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ 32 పరుగుల తేడాతో ఓడిన రోహిత్‌ సేన.. రెండో టెస్టులో ఘన విజయం అందుకుని సిరీస్‌ను సమం చేసింది.

అతి తక్కువ బంతుల్లో ముగిసిన టెస్టులు 

  • 642 - దక్షిణాఫ్రికా vs భారత్‌ (కేప్‌టౌన్) 2024
  • 656 - ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా (మెల్‌బోర్న్‌) 1932
  • 672 - వెస్టిండీస్‌ vs ఇంగ్లాండ్ (బ్రిడ్జ్‌టౌన్) 1935
  • 788 - ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా (మాంచెస్టర్) 1888
  • 792 - ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా (లార్డ్స్) 1888

భారత్‌పై రెండు ఇన్నింగ్స్‌లు కలిపి అత్యల్ప స్కోర్లు చేసిన జట్లు

  • 193 - ఇంగ్లాండ్ (అహ్మదాబాద్) 2021
  • 212 - అఫ్గానిస్థాన్‌ (బెంగళూరు) 2018
  • 229 - న్యూజిలాండ్ (ముంబయి) 2021
  • 230 - ఇంగ్లాండ్ (లీడ్స్) 1986
  • 231 - దక్షిణాఫ్రికా (కేప్‌టౌన్) 2024

భారత్‌ ఆడిన టెస్టులు రెండు రోజుల్లో ముగిసిన సందర్భాలు

  • అఫ్గానిస్థాన్‌తో (బెంగళూరు) 2018
  • ఇంగ్లాండ్‌తో (అహ్మదాబాద్) 2021
  • దక్షిణాఫ్రికాతో (కేప్‌టౌన్) 2024 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని